Donkey Milk | ఖైరతాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): మీకు గాడిదలను మేమే అమ్ము తాం.. వాటి పాలను మేమే కొంటాం అంటూ ఓ కొత్త తరహా మోసానికి పాల్పడింది.. తమిళనాడు తిరునల్వేలికి చెందిన డాంకీ ప్యాలెస్ సంస్థ. గాడిదలను లక్షలకు విక్రయించి, పాలను కొనకుండా మొహం చాటేసింది. గాడిద పాలు అమ్ముతూ లక్షలు సంపాదించవచ్చని చెబుతూ వందల మంది రైతులు, చిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజ ల్ని నిండా ముంచింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల నుంచి 400 మంది నుంచి రూ.5.50 చొప్పున వసూలు చేసిన ముఠా వ్యవహారం ఏడాదికాలంగా పరిష్కారం కావడం లేదు. తెలంగాణ, ఏపీ లోనే రూ.100 కోట్ల స్కామ్ జరిగిందని బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం తమ గోడు వెల్లడించారు. డాంకీ ప్యాలెస్ సంస్థ నిర్వాహకులను నిలదీస్తే చెల్లని చెక్కులు ఇచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. లాభాలు ఆర్జించవచ్చని ఆశపడ్డామని, ఇంత మోసం జరుగుతుందని ఊహించలేదంటూ వాపోయారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై కేటీఆర్ ఎక్స్‌లో స్పందించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
లాభాల ఆశతో లక్షలు పోగొట్టుకున్నాం
గాడిదల పాల వల్ల లక్షలు సంపాదించవచ్చన్న ప్రకటనలు చూసి మోసపోయాం. ఇండ్ల్లు, జాగా అమ్ముకొని రూ.60లక్షల నుంచి రూ.70లక్షల వరకు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్నాం.
-రమాదేవి, డాంకీ ప్యాలెస్ బాధితురాలు, మాచర్ల
ప్రభుత్వాలు ఆదుకోవాలి
గాడిద పాల వ్యాపారం కోసం తాము రూ.65లక్షల పెట్టుబడి పెట్టి మోసపోయాం. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్నాటక ముఖ్యమంత్రులు స్పందించి మాకు న్యాయం జరిగేలా చూడాలి.
– తేజస్విని, డాంకీ ప్యాలెస్ బాధితురాలు, అనంతపురం
మాయమాటలు నమ్మి మోసపోయాం
నేను బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాణ్ని. గాడిద పాలతో లక్షలు గడించవచ్చని డాంకీ ప్యాలెస్ సంస్థ యూట్యూబ్ చానళ్లలో విపరీతమైన ప్రచారం చేసింది. . ఒక్కో గాడిదకు రూ.80వేల నుంచి 1.5 లక్షలు ఉంటుందని, లీటర్ పాలకు 1,600 నుంచి రూ.1,800 వరకు చెల్లిస్తామని చె ప్పారు. ఒక్కొక్కరి నుంచి రూ.5.50లక్షల చొప్పున వసూలు చేశారు. రూ.15వేలు నుంచి రూ.20వేల విలువైన గాడిదలను రూ.90వేలకు విక్రయించారు. అవి హలా రే జాతికి చెందిన గాడిదలు అని అన్నారు. డాంకీ ప్యాలెస్ నిర్వాహకుల మాటలు నమ్మి లక్షలు పోసి గాడిదలను కొనుక్కున్న వాళ్లం మరింత ఖర్చుపెట్టి వ్యవసాయభూముల్లో ఫామ్‌లు కట్టుకున్నాం. మొత్తం నష్టపోయాం.
– సాయిబాబా, బాధితుడు, బెంగళూరు