హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వాటిలో ఒకటైన కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) కొన్ని ఇంకా బాలారిష్టాలను దాటడంలేదు. ఈ పథకం ప్రారంభమై 20 ఏండ్లు గడిచినా ఇంకా కొన్నింటికి సొంత భవనాలు కలగానే మిగిలాయి. రాష్ట్రంలో 10 విద్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. మరో 10 విద్యాలయాలకు సొంత భవనాలు మంజూ రై, నిర్మాణ దశలోనే ఉండి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. మరో 16 కేజీబీవీలు అద్దెలేకుండా ప్రభుత్వ శాఖలకు చెందిన ఇతర భవనాల్లో నడుస్తున్నాయి. సంబంధిత శాఖలు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు బయటకెళ్లాల్సిందే.
రాష్ట్రంలో మొత్తంగా 495 కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం మొత్తం 36 కేజీబీవీలకు పూర్తిస్థాయి సొంత భవనాలు లేవు. దీంతో ఆ విద్యాలయాల్లోని బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సక్సెస్‌కు చిరునామాగా విజయవంతంగా నడుస్తున్న రాష్ట్రంలోని కేజీబీవీలు అమ్మాయిలకు రక్షణ, ఉన్నత చదువులకు తార్కాణంగా నిలుస్తూ, వారికి పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నాయి. దీంతో కేజీబీవీల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో 1,25,928 విద్యార్థులు ఉండగా, 2025-26లో ఆ సంఖ్య 1,28,499 మందికి పెరిగింది. అంటే దాదాపు 3,500 మంది అదనంగా చేరారు. అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఆ కొన్నింటికి సొంత భవనాలను సమకూర్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.