హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడి నుంచి మోసగాళ్లు కొట్టేసిన రూ. 85.2 లక్షలు రికవరీ చేశామని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖాగోయెల్ తెలిపారు. హైదరాబాద్‌లోని మలాజిగిరి కమిషనరేట్, నేరెడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన 85 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి ఆగస్టు 21న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారిగా నటిస్తూ ఒక వ్యక్తి యూనిఫామ్‌లో వీడియో కాల్ చేశాడు. బాధితుడి ఆధార్ వివరాలు దుర్వినియోగం అయ్యాయని బెదిరించాడు. రూ. 2.5 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగాయని, కేసు నుంచి బయటపడాలంటే ఆర్బీఐ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు పంపాలని నమ్మించాడు. భయపడిన బాధితుడు నిందితుడు చెప్పిన ఖాతాలోకి రూ. 85,20,000 బదిలీ చేశాడు.
కేటుగాడు మరో రూ.42 లక్షలు డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే బ్యాంక్‌ను సంప్రదించి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్(ఎన్సీఆర్పీ) ద్వారా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందడమే తడవుగా టీజీసీఎస్బీ అధికారులు లావాదేవీలను ట్రాక్ చేశారు. కోయంబత్తూరులోని ఐడీఎఫ్సీ బ్యాంక్ శాఖలోని నిందితుడి ఖాతాను సకాలంలో ఫ్రీజ్ చేశారు. బాధితుడు కోల్పోయిన మొత్తం రూ. 85.2 లక్షలను సురక్షితంగా రక్షించగలిగారు. ఈ సందర్భంగా టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయెల్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వ లేదా పోలీసు సంస్థలు, ఆర్బీఐ అధికారులు డబ్బులు బదిలీ చేయమని అడుగరని స్పష్టం చేశారు. అలాంటి అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లోని సీడ్ క్యాపిటల్ కాంపొనెంట్ విభాగంలో ఎస్‌హెచ్‌జీలను ప్రోత్సహిస్తున్నందుకుగాను తెలంగాణకు ప్రథమ బహుమతి లభించింది. ఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో నిర్వహించిన ఎంవోఎఫ్‌పీఐ-పీఎంఎఫ్ఎంఈ నేషనల్ కాన్క్లేవ్-26లో కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ తెలంగాణ సెర్ప్ డైరెక్టర్ ఎన్ రజితకు అవార్డును ప్రదానం చేశారు. రాష్ట్రానికి అవార్డు రావడంపై మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు.