ఖైరతాబాద్, అక్టోబర్ 5 : జడ్చర్ల మండలం గౌరారం గ్రామంలో ఎంబీ చర్చికి చెందిన రూ.300 కోట్ల విలువైన 57 ఎకరాల భూములను కబ్జా చేసేందుకు కొంద రు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ ఆరోపించారు. ఎంబీ చర్చి భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ డిప్యూటీ కలెక్టర్ జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1974లో గవర్నర్ కౌన్సి ల్ అనుమతితో క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో చట్ట ప్రకారం ఏర్పాటుచేసిన ఎం బీ చర్చి మెడికల్ కళాశాల, వైద్యశాల క్రైస్తవుల ప్రయోజనాల కోసం కొనసాగుతున్నాయని తెలిపారు.
దళిత క్రైస్తవులకు చెందిన భూములను కొందరు రియల్టర్లు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నా రు. వందేండ్లుగా ఈ భూమి చర్చి యాజమాన్యం ఆధ్వర్యంలోనే ఉన్నదని తెలిపారు. ఎలాంటి అధికారిక భూ పత్రాలు చూపించకుండా కొందరు ప్రైవేట్ వ్యక్తులు భూమిలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ భూమి విలువ రూ.300 కోట్లు ఉంటుందని, అందుకే కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నా రు. సమావేశంలో పీ కృష్ణపాల్, ఆశీర్వాదం, ఎంఏ వందనం పాల్గొన్నారు.