కళకు ఆకట్టుకునే స్వభావం ఉంటుంది. అందులోనూ చిత్రకళ అన్నపేరుకు అచ్చంగా సరిపోయేలా ఉన్నాయనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలను గమనిస్తే. ఎందుకంటే, చూడగానే పేపర్ స్కెచ్‌లా నలుపూ తెలుపూ రంగుల్లో కనిపిస్తున్న ఇవి కాగితం మీద గీసిన బొమ్మలు కాదు. నిజమైన కార్లు, గదులే. ఈ గమ్మత్తు సృష్టికర్త జోషువా వైడ్స్ అనే అమెరికన్ కళాకారుడు. ఆ కుంచె వెనుక సంగతులేంటంటే…
ఎవరైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక కారు డిజైన్ చేయాలనుకున్నా, బూట్లు తయారు చేయాలనుకున్నా ముందుగా ఒక నమూనా స్కెచ్ గీసుకుంటారు. తెల్ల పేపర్ మీద నలుపు ఇంకుతో దీన్ని ముందుగా గీసుకొని, లేదా కంప్యూటర్లో స్కెచ్ వేసి తర్వాత దాన్ని రూపొందిస్తారు, లేదా నిర్మిస్తారు. అలా ఎప్పుడూ ఐడియాను రియాలిటీగానే ఎందుకు మార్చాలి, రియాలిటీని ఐడియాలా కనిపించేలా చేస్తే ఎలా ఉంటుంది అంటూ వచ్చిన వెరైటీ ఆలోచనే అమెరికా దేశంలోని క్యాలిఫోర్నియాకి చెందిన జోషువా వైడ్స్కి చాలా పేరు తెచ్చి పెట్టింది. మెర్సిడెస్ బెంజ్, ఫెరారీలాంటి కార్ల కంపెనీలు మాకూ అలాంటిది చేసి పెట్టవూ అని అడిగేలా చేసింది. ఇన్‌స్టాలాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
ఈ చిత్రాల వెనుక ఉన్న టెక్నిక్‌ను రియాలిటీ టు ఐడియా (ఆర్టీఐ) అనే పేరుతో పిలుస్తున్నారు. సాధారణంగా మన చూపు త్రీ డైమెన్షనల్లో ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసేందుకు చదరంగా, టూ డైమెన్షనల్లా కనిపించేట్టు చేసేలా నలుపు తెలుపు రంగులు అద్దడం అన్నది ఇక్కడ మ్యాజిక్. అంటే, గది లోతు ఇక్కడ మనకు అర్థం కాదు. కేవలం ఒక చదరంగా ఉన్న తెల్లటి కాగితం మీద కిటికీలు, తలుపులు, కుర్చీలు గీసినట్టుగా అది కనిపిస్తుంది. ఎదురుగా ఉన్నా సరే అచ్చం ఇప్పుడు మనం చూస్తున్నట్టు కాగితం మీద నల్ల పెన్నుతో గీసిన బొమ్మలాగే కనిపిస్తుంది. వస్తువులూ, కార్లూ అంతే! అయితే ఒకసారి ఇతను నైకీ ఎయిర్ ఫోర్స్ 1 మోడల్ షూలకు సంబంధించిన స్కెచ్‌ను చూశాడట.
తర్వాత అచ్చం దానిలాగే ఆ షూలను పెయింట్ వేసి నెట్టింట్లో పెట్టాడు. బోలెడు లైక్‌లు వచ్చాయి. మరోసారి తన ఫ్రెండ్ దగ్గరున్న ఆక్యురా ఎన్ఎస్ఎక్స్ కారునూ ఇలా స్కెచ్‌లా మార్చాడు. దానికి ఊహించని స్పందన వచ్చింది. బీఎండబ్ల్యూ సంస్థ జోషువాని సంప్రదించి తమ ఆర్ట్కార్ ప్రాజెక్ట్‌లో భాగం అవుతారా అంటూ అడిగింది. ఆ తర్వాత ఫెరారి, మెర్సిడెస్ బెంజ్ లాంటి లగ్జరీ కార్ల సంస్థలు వరుస కట్టాయి. ఫెండిలాంటి లగ్జరీ యాక్సెసరీల సంస్థలూ తమ ఉత్పత్తులను ఇలా స్కెచ్లలా తీర్చిదిద్దమని అడిగాయి. ఇవే కాదు, ఇంటి గదులూ, ప్రార్థనా మందిరాలు, ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులు కూడా ఇతని చేతిలో పేపర్ మీది బొమ్మలా మారి చూపరుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.