ఒక దశాబ్ద కాలం కిందివరకూ.. మనం ఏ టూర్‌కి వెళ్లినా ఓ చిన్న కెమెరాను వెంట తీసుకెళ్లేవాళ్లం. అది డిజిటల్ కెమెరా లేదంటే, రీల్ కెమెరానో అయి ఉండేది. ఇంటికి వెళ్లాక వాటి మెమరీ కార్డ్స్లోంచి కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని.. వాటిని ప్రింట్ చేయించుకునే వాళ్లం. అలా.. ఆ టూర్‌కు సంబంధించిన అందాలను, అనుభూతులను భద్రపర్చుకునేవాళ్లం. కానీ, స్మార్ట్ఫోన్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ఇప్పుడొస్తున్న ప్రతి స్మార్ట్‌ఫోన్‌లో.. మంచిమంచి కెమెరాలు ఉంటున్నాయి. దీనివల్ల మనకి వేరేగా కెమెరా వెంట పెట్టుకెళ్లే అవసరం లేకుండాపోయింది. చేతిలో ఒక మంచి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. మనకి నచ్చినట్టు ఫొటోలు తీయొచ్చు. దాంతో ఇప్పుడు చాలామంది ఫొటోగ్రఫీని ఒక హాబీగానూ ఎంచుకుంటున్నారు. అయితే, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లా ఫొటోలు తీయాలంటే.. కొన్ని టిప్స్ పాటించడం అవసరం. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ టిప్స్ ఏంటో నేర్చేసుకుందాం.
1. లైటింగ్: ఫొటోలో ‘లైటింగ్’ కీలకపాత్ర పోషిస్తుంది. సాధ్యమైనంత వరకు సహజ కాంతిలోనే ఫొటోలు తీసేందుకు ప్రయత్నించండి. సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో తీసిన ఫొటోలు.. అందమైన నారింజ రంగులో అదిరిపోతాయి.
2.ఫోకస్: మొబైల్ కెమెరాతో ఫొటో తీసేటప్పుడు.. ఫోకస్‌ను సరిగ్గా సెట్ చేయడం చాలా ముఖ్యం. మీ సబ్జెక్ట్ (దేన్నయితే ఫొటో తీస్తున్నారో)పై టచ్‌చేస్తే.. ఆటోమేటిక్‌గా ఫోకస్ అయిపోతుంది. ఇది ఫొటోను స్పష్టంగా వచ్చేలా సహాయపడుతుంది.
3.స్టెబిలిటీ : మీరు ఫొటో తీసేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ కదలకుండా ఉండాలి. లేకుంటే, ఫొటోలు షేక్/ బ్లర్ అవుతాయి. ఇందుకోసం ఫోన్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని ఫొటో తీయండి. అవసరమైతే ట్రైపాడ్‌ను వాడండి.
4.క్లియర్‌గా: మీ ఫొటోల్లో ప్రధాన సబ్జెక్ట్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఫ్రేమ్‌లో అనవసరమైన వ్యక్తులు, ప్రదేశాలు ఏవైనా ఉంటే.. అలాంటి డిస్టర్బెన్స్లను తొలగించండి.
5.అవసరమైతేనే.. ఫ్లాష్ : ఫ్లాష్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉండాల్సిన అవసరంలేదు. ఫ్లాష్‌ను అనవసరంగా ఉపయోగిస్తే.. ఫొటోలు మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకూ సహజసిద్ధమైన, పరిసరాల కాంతిపైనే ఆధారపడి ఫొటోలు తీయండి. అంతగా లైటింగ్ అవసరం అనుకుంటే.. సాఫ్ట్ గ్లో కోసం సెకండరీ లైట్ సోర్స్‌ని ఉపయోగించండి.
6.దగ్గరగా వెళ్లండి: స్మార్ట్‌ఫోన్ కెమెరాలు పట్టుకొని డిజిటల్ జూమ్ చేస్తే.. ఫొటోలో నాణ్యత తగ్గుతుంది. అందుకే.. జూమ్ చేయడానికి బదులుగా సబ్జెక్ట్‌కు దగ్గరగా వెళ్లి ఫొటోలు తీసేందుకు ప్రయత్నించండి.
7.HDR మోడ్: హై డైనమిక్ రేంజ్ (HDR) మోడ్.. మీ ఫొటోలను మరో మెట్టు ఎక్కిస్తుంది. మామూలుగా ఫొటో తీస్తే.. ఎండ ప్రదేశాలు ఎక్కువ ప్రకాశవంతంగా, నీడలో ఉండేవి చీకటిగా కనిపిస్తాయి. ఈ సమస్యకు.. HDR మోడ్ పరిష్కారం చూపుతుంది. ప్రకృతి దృశ్యాలు, అధిక కాంట్రాస్ట్ ఉండే దృశ్యాల కోసం దీన్ని ఉపయోగించండి.
8.స్టోరీ చెప్పండి: మీరు తీసే ఒక్కో ఫొటో.. ఒక్కో కథ చెబుతుందని గుర్తించి.. ఫొటోలు తీసుకోండి. మీరు చెప్పాలనుకుంటున్న కథనం.. ఆ ఫొటోల్లో ప్రతిబింబించేలా చూసుకోండి. ఆ పరిసరాలు.. అక్కడి భావోద్వేగాలు, మానసిక స్థితిని చెప్పేలా మీ షాట్‌ను కంపోజ్ చేయండి. అప్పుడు మీ ఫొటోలు.. మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి.
9.ప్రాక్టీస్‌తో పర్ఫెక్ట్: ఫొటోలు మరింత పర్ఫెక్ట్గా రావాలంటే.. మరిన్ని ఎక్కువగా ఫొటోలు తీయండి. ఫోన్‌ను చేతపట్టుకొని రోజూ ప్రాక్టీస్ చేస్తుండండి. వివిధ యాంగిల్స్, లైటింగ్ షేడ్స్‌ను ట్రై చేస్తూ.. మీ స్కిల్స్ మెరుగుపర్చుకోండి.
మొదట్లో ఈ టిప్స్ పాటించడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ, కొద్దికాలానికి అలవాటు అవుతాయి. మీ క్రియేటివిటీకి అనుగుణంగా ఈ టిప్స్‌ను కలిపి కొత్త తరహా ఫొటోలు సృష్టించండి! మీ స్మార్ట్ఫోన్స్తో మంచి ఫొటోలు తీసుకోవడానికి.. ఈ చిట్కాలు మీకు సహాయపడతాయని ఆశిస్తూ..
ఎడిటింగ్
ఎడిటింగ్‌తో ఫొటోలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఫొటోలు తీసిన తర్వాత.. ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి లైటింగ్, కాంట్రాస్ట్తోపాటు రంగులను మెరుగుపరచండి. ఇందుకోసం PS ఎక్స్‌ప్రెస్, Lightroom, Snapseed వంటి యాప్‌లు వాడండి.
ఆడెపు హరికృష్ణ