ఓరుగల్లు మిర్చి ఖ్యాతి.. ఖండాంతరాలు దాటింది. ఈ ప్రాంతానికే సొంతమైన ‘చపాట’ రకానికి ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్‌తో.. మన పంట ప్రపంచంలోని అరుదైన పంటల సరసన చేరింది. ఫలితంగా, డిమాండ్‌తోపాటు ధరకూడా పెరిగే అవకాశం ఉండగా.. కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
మిర్చి పంట అంటేనే.. సమ్‌థింగ్ స్పెషల్! అందులోనూ ‘వరంగల్ చపాట’ రకం మరీ స్పెషల్. కాస్త ఘాటు, మరికాస్త స్వీటు కలగలిసిన ఈ రకం.. పచ్చళ్లకు ప్రశస్తి. ఫుడ్ కలర్స్ తయారీలోనూ దీనివాడకం ఎక్కువే! ఇప్పటిదాకా ఓరుగల్లుకే పరిమితమైన ఈ లోకల్ వెరైటీ ఘాటు.. ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌కు చేరుకున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్నేండ్లుగా సాగులో ఉన్న ‘చపాట మిర్చి’కి ఇటీవల భౌగోళిక గుర్తింపు దక్కింది.
చపాట మిర్చిని దేశవాళీ, టమాట, లబ్బకాయ, నగరం మిర్చి అని కూడా పిలుస్తారు. లావుగా, మంచి ఎరుపుతో ఉండే ఈ రకం.. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఇందులోని కాప్సంథిన్ పదార్థం వల్ల.. ఎరుపు రంగుతో నిగనిగలాడుతూ కనిపిస్తుంది. తక్కువ కారంగా ఉండి.. విదేశీయుల మనసు దోచేస్తుంది. అందుకే, తక్కువ కారం తినే అమెరికా, యూరప్‌తోపాటు థాయిలాండ్, మలేసియా, జపాన్ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నది. మనదగ్గరా ముంబయి, అహ్మదాబాద్, నాగ్‌పూర్ నగరాల్లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉన్నది. సహజ రంగుల తయారీలోనూ దీనిని విరివిగా వాడుతున్నారు. చపాట కారంతో తొక్కులు (పచ్చళ్లు) పెడితే.. ఏడాది వరకు రంగు మారకుండా ఉంటాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కొందరు రైతులు చాలా ఏండ్ల క్రితం చపాట మిర్చిని పండించేవారు. వాడుక భాషలో ‘నగరం మిర్చి’ అని పిలిచేవారు. అక్కడినుంచి 70 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాకు వచ్చింది. నల్లబెల్లి మండలం రంగాపురం, మొగుళ్లపల్లి మండలం బంగ్లాపల్లికి చెందిన ఇద్దరు రైతులు.. చపాట మిర్చి విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడ పండించారని స్థానిక రైతులు చెబుతారు. అలా మొదలైన చపాట సాగు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకే తలమానికంగా మారింది. ప్రస్తుతం వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో 20 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నది. ఎకరానికి గరిష్ఠంగా 18 క్వింటాళ్ల వరకూ దిగుబడి ఇస్తున్నది.
చపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు రావడానికి మహబూబాబాద్ జిల్లా మల్యాలలోని జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.భాసర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీనికి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట రైతుల కృషి కూడా తోడైంది. చపాట మిర్చి పూర్వాపరాలు, సాగు విస్తీర్ణం, మారెటింగ్ రికార్డులను భాస్కర్ పక్కాగా రూపొందించారు. భౌగోళిక గుర్తింపు కోసం మల్యాలలోని ఉద్యాన పరిశోధన స్థానంలో ఈ పంట సాగుచేశారు. ‘తిమ్మంపేట మిర్చి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ’ ఆధ్వర్యంలో తిమ్మంపేట రైతులు కూడా ఈ మిర్చిని సాగుచేశారు. అలా చపాట పంటకు భౌగోళిక గుర్తింపు కోసం 2022లో దరఖాస్తు చేశారు.
జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్‌కు అవసరమైన అన్ని రికార్డులనూ అందించారు. తాజాగా చపాట పంటకు భౌగోళిక గుర్తింపు ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ధ్రువీకరణ పత్రం జారీ చేసింది. భౌగోళిక గుర్తింపుతో ఈ అరుదైన రకం మిర్చి.. భవిష్యత్తులో ఏ కార్పొరేట్ కంపెనీ పరం కాకుండా ఉంటుంది. ఏండ్లుగా సాగు చేస్తున్న రైతులకే వీటిపై హక్కులు దఖలుపడతాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి.. మార్కెట్లోనూ మంచి ధర వచ్చే అవకాశం ఉన్నది.
– పిన్నింటి గోపాల్