జరిగిన కథ : ప్రత్యూషవేళ జంతుకోష్టంలో విక్రమ, ధీరలతో వ్యూహాలు రూపొందించుకుంటున్నాడు జాయపుడు. ముమ్మడి నాయకుడితో కలిసి అక్కడికి వచ్చాడు పుళిందపుడు. ముమ్మడిని జాయపకు
పరిచయం చేస్తూ.. పొలవాసనాడు మండల సైన్యాధ్యక్షుని కుమారుడని చెప్పాడు. ఇటీవల కామితదేవుడితో ముమ్మడికి తగవులు పెరగడం గురించీ ప్రస్తావించాడు. మళ్లీ పుళిందపుడే.. ‘ఇటీవల మీరు కూడా..’ అని ఏదో చెప్పబోతుండగా, భుజంపట్టి ఆపాడు ముమ్మడి.
“మీరు.. వాడికి వత్తాసుగా పొలవాసనాడుకు ఆడ మలయాళంతో వెళ్లడం అంత సమంజసం కాదు సేనానీ..”
దృఢంగా, కరుకుగా చెప్పాడు ముమ్మడి. ఆయన అంత కరుకుగా చెప్పడం ఆశ్చర్యపరచింది జాయపుణ్ని. ఏమనాలో తెలియలేదు. రాజనగరి కులీన కుర్రకారు వాగ్ధోరణి దాదాపుగా అలాగే ఉంటుంది. మళ్లీ ముమ్మడే అన్నాడు.. “మహావీరుడని మహామండలీశ్వరులే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు మిమ్మల్ని. కానీ, మీరు పోయిపోయి ఓ వేశ్యాగృహాన్ని రక్షించడానికి వచ్చారంటే..” వ్యంగ్యంగా అర్ధోక్తిలో ఆపాడు. పుళిందపుడు కూడా ముసిముసిగా నవ్వాడు. కావాలని తనను రెచ్చగొట్టడానికే వచ్చినట్లుగా భావించి చివ్వున లేచాడు జాయపుడు.
అప్పుడే ధీర తొండమెత్తి దీర్ఘంగా ఘీంకరించింది. విక్రమ కోష్టం పైభాగానికి తగిలేలా ముందుకాళ్లను
ఎత్తి సకిలించింది.
జాయపుణ్ని ఎవరు అవమానంగా మాట్లాడినా విక్రమ, ధీర గుర్తిస్తాయి. తమ అసంతృప్తిని ఘనంగా చాటుతాయి. వాటిపై చెయ్యి వేసి నిమురుతూ అన్నాడు జాయపుడు. “అయితే..? వెళ్లాను. అవసరం అయితే మళ్లీ వెళతాను.. అయితే??”. “మనమంతా రాజనగరి నివాసులం. ఒకరికొకరు సహకరించుకోవాలి సేనానీ” అన్నాడు పుళిందపుడు. “తప్పకుండా! కానీ, అది ధర్మసమ్మతం, న్యాయ సమ్మతమైన అంశాలలో. అధికారానికి పోటీ పడేచోట నాకు న్యాయం అనిపించిన వైపు నిలుస్తాను. అయినా వేశ్యాగృహాలపైనా తమరి ప్రతాపం?” అన్నాడు జాయపుడు వ్యంగ్యంగా ఉగ్రంగా చివ్వున లేచాడు ముమ్మడి. మళ్లీ అదే వేగంతో జవాబిచ్చాయి విక్రమ, ధీర. అతణ్ని పట్టి కూర్చోబెట్టాడు జాయపుడు. “సహాయం కోరి వచ్చినవారు సహాయాన్ని అర్థించాలి.. జబ్బలు మర్దించకూడదు!”. సాత్వికుడుగా కనిపించే జాయపుని మాటల ఘాటు అలా ఉంటుందని ఇద్దరూ ఊహించలేదు.
అతనిలోని అసహనాన్ని అతని పెంపుడు జంతువులు ప్రదర్శిస్తున్నాయి. ఉద్వేగంతో కట్టేసిన చోట ఆగకుండా తిరుగాడుతున్నాయి. ఇద్దరూ లేచారు. కట్టలు తెంచుకున్న క్రోధంతో ఉన్న ముమ్మడిని బయటికి లాక్కుపోతున్నాడు పుళిందపుడు. కాస్త శాంతించాయి విక్రమ, ధీర. దూరంగా వెళ్లాక పుళిందపుణ్ని విడిపించుకుని వేగంగా వెనక్కి వచ్చాడు ముమ్మడి. దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి.. నాతో పెట్టుకోకు.. జాయపసేనానీ!” అన్నాడు. పుళిందపుడు వెనక్కి వచ్చి ముమ్మడిని బలవంతంగా తీసుకుపోయాడు. ఇలాంటి సన్నివేశాలు జాయపునికి అనుభవంలో లేవు. అతణ్ని రెచ్చగొట్టినట్లు మాట్లాడినవారు లేరు. అతను ధర్మయుద్ధంలోనే శత్రువులు అనే వాళ్లను ఎదుర్కొన్నాడు.. ముక్కలుముక్కలు చేశాడు. ఇప్పుడూ చేయగలడు. కానీ, ఇక్కడ మిత్రులు.. పక్కింటి నివాసులు అన్నవాళ్లు తన వద్దకు వచ్చి ఇలా రెచ్చగొట్టేలా తూలనాడతారని జాయపుడు ఊహించలేదు. రాజనగరి ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నది. ఈ రాజరిక కులీనులతో సంఘర్షిస్తున్న, సున్నిత కళాకారుడైన జాయపుడు రానురానూ రాచరికతత్వానికి దగ్గరవుతాడో.. దూరమవుతాడో.. చూడాలి!
ఉదయం వ్యాయమశాలలో కార్యకలాపాలు ముగించుకుని బయల్దేరిన జాయపునికి దూరంగా ఇంద్రాణి కనిపించింది. సాధారణ చీరే ధరించి పైన ఓ వస్త్రం వల్లె వాటుగా కట్టి వ్యాయామానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నది. అతణ్ని చూసి నవ్వి.. తనవైపు రావాల్సిందిగా కంటితో చెప్పి వెనుదిరిగింది. జాయపునికి మరోమార్గం లేదు. ఆమె వెనుక నడిచాడు. రాజనగరి ఉద్యానవనం. మధ్యవయస్కులైన మహిళలు, యుద్ధాలకు దూరంగా ఉన్న పురుషులు ఎక్కువగా అక్కడ వ్యాయామాలు చేస్తుంటారు. అక్కడ ఎవరు ఎవరితో మాట్లాడినా ఎవ్వరూ పట్టించుకోరు. కాసేపు అటూ ఇటూ నడక సాగించి ఇద్దరూ దగ్గరగా వచ్చారు.
“జాయపసేనానులకు అభివందనం! ఏమిటి.. వేశ్యావాటికల రక్షణకు నడుం బిగించినట్లున్నారు?”.
ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి.. ఆ సంగతి ఈమెకు ఎందుకు?! లిప్తకాలంలో తేరుకున్నాడు. నవ్వి.. “జాయపునిలాంటి కళాకారునితో ఓ గాయని మాట్లాడే అంశం ఇదేనా?”. ఆమె క్షణకాలం తత్తరపడింది. ఏదో అనబోయేంతలో జాయపుడే అన్నాడు.. “తమరికి కూడా ఆసక్తి ఉంటే చెప్పండి. ఈసారి తమరిని కూడా తోడ్కొని వెళతాం!”. మరేదో అనబోయింది. మళ్లీ జాయపుడే.. “ఊ.. కొత్తపాట ఏదైనా లిఖించారా.. ఈచల్లని ఉదయపువేళ మీపాట వినడం.. ఓహ్! నాకు దక్కిన వరం.. ఏది పాడండి పాడండి”. ఆమె ఉక్కిరిబిక్కిరయ్యింది. లేచింది.
“ఇవ్వాళ కాకపోయినా రేపటి వరకూ ఎదురు చూస్తాను. రేపు ఇక్కడే కలుద్దాం. సరేనా??”. పొమ్మన్నట్లు చెప్పి.. తనూ కదిలాడు. ఇంద్రాణి బొమ్మలా నిలబడిపోయింది. కానీ, అప్పుడే అతనికి మరో స్త్రీ తారసపడింది.ఆమె జలజాంబ. రాజనగరి నివాసి.. మధ్య వయస్కురాలు. కాస్త బొద్దుగా ఉన్నా.. ఆభరణాల అలంకరణలో ఆకర్షణీయంగానే ఉంది. జాయపుణ్ని చూసి పలకరింపుగా నవ్వింది. జాయపుడు కూడా అభివాదం చేశాడు. ఆమె దగ్గరగా వచ్చి తాకుతూ.. “జాయప సేనానులకు వందనాలు..” అన్నది. ఆమె చూపులు అతణ్ని నఖశిఖ పర్యంతం తడుముతున్నాయి.. అల్లుకుంటున్నాయి.. చుట్టుకుంటున్నాయి. “తమరి కోసం మా ఇంటి ద్వారాలెప్పుడూ తెరచి ఉంటాయి.
అదిగో.. ఆ కనిపించే ఇల్లే! దయచేయండి. కొంచెం పానీయం స్వీకరించి వెళ్లవచ్చు!” అన్నదామె. దాదాపుగా చేయిపట్టి నడుస్తున్నది. జాయపునికి వెళ్లక తప్పని పరిస్థితి కల్పించింది. వెళ్లాడు. లోపలికి వెళ్లగానే ఎదురుగా ఉన్న పరిచారికలు.. నపుంసక పరిచారికల్లా ఉన్నారు.. లోపలికి వెళ్లిపోవడం అతనికి ఆశ్చర్యంగా తోచింది. “రండి రండి.. లోపలికి వెళదాం! కాస్త విశ్రాంతిగా మాట్లాడుకోవచ్చు..” అన్నదామె. లోపలికి వెళుతూ అన్నాడు.. “మీవారు.. అదే సేనానులవారు??”. “వారు నగునూరునాడు మహామంత్రివర్యులు. ఎక్కువ కాలం అక్కడే ఉంటారు. వారికి పదిమంది భార్యలు. అందులో నా సంఖ్య ఐదు. అప్పుడప్పుడూ.. ఎప్పుడో ఓసారి ఇక్కడికి వస్తుంటారు”. “పిల్లలు..??”. “చెప్పానుగా.. ఎప్పుడో ఓసారి వస్తూంటారని. ఇక పిల్లలేం పుడతారు?”.
ఈ తరహా సంభాషణ కూడా జాయపునికి కొత్త. పల్యంకంపై కూర్చున్నాక అతని ఒడలంతా నిమురుతున్నది ఆమె. “చెమటతో తడిసినట్లుంది. గొప్పవీరులు కదా. వ్యాయామాలు కూడా ఉధృతంగా చేస్తారేమో.. నన్ను మీ స్నేహితురాలిగా భావించండి..” అన్నది. ‘స్నేహితురాలా!’.. ఈ పదం ఏ మహిళా.. ఏ యువతి ఎక్కడా ఎప్పుడూ అతనితో ప్రస్తావించలేదు. ఆమె ప్రవర్తన ఇబ్బందిగా ఉంది. ఆమె తన ధోరణిలో చెప్పుకొంటూ పోతున్నది. అప్పుడప్పుడూ.. ఎప్పుడైనా మీరు కోరుకున్నప్పుడు.. మీకు కోరికలు జనించినప్పుడు.. ఇక్కడికి రావచ్చు మిత్రుడా! మీకోసం ఈ ఇంటిద్వారాలు.. ఈ పడకటింటి ద్వారాలూ ఎప్పుడూ తెరచే ఉంటాయి”.
ఆమె ఏమీ నర్మగర్భంగా మాట్లాడటంలేదు. స్పష్టంగానే అతణ్ని కోరుతున్నది. ఇలాంటి వాళ్లు కూడా
“అలాగే.. తప్పకుండా..” అన్నాడు. ఆమె ముఖంలో సంతోష సముద్రాలు ఎగసి దూకాయి.
“మీబోటి వీరులంటే నాకు వల్లమాలిన ఇష్టం. ఎంతసేపూ పనివారలతో ఎలా సరిపుచ్చుకోనూ!? మీబోటి అద్భుత శరీరులతో సయ్యాటలాడితే నాకూ నాట్యం వస్తుంది!”. ఇక అక్కడ ఉంటే ఏమేం వినాల్సి వస్తుందోనని చప్పున కదిలాడు జాయపుడు. ఆమె ముఖద్వారం వరకూ తాకుతూ చేయిపట్టి విడువకుండా నడుస్తూ వచ్చింది. “మా శ్రీవారు రాజధానిలో పనులుంటేనే ఇక్కడికి వస్తారు.. అప్పుడు బాగా నిద్రపోయి వెళ్లిపోతారు. నన్ను అర్థం చేసుకోండి సేనాని”. చేయి విడిచింది. ఆమె అర్థమైంది. ఆమెపై అతనికి జాలి కలిగింది.
ముమ్మడి, పుళిందపుడు జంతుకోష్టంలో కలిసిన తర్వాత జాయపునికి పుళిందపునిపై కూడా సందేహాలు తలెత్తాయి. తొలినుంచి జాయపునికి అక్కడ స్నేహితులే కాదు.. మంచి వ్యక్తిత్వమున్నవాడు అనిపించిన వారెవ్వరూ లేరు. పుళిందపుడు మాత్రమే ఎక్కువగా కలుస్తూ మాట్లాడుతుంటాడు. కాబట్టి అతనితో కొంత మాటలు కలుపుతాడు. పుళిందపుడు కూడా జాయపుణ్ని ఓ నాట్యకారునిగానే గుర్తిస్తాడు కానీ.. అతని యుద్ధ నైపుణ్యాలు గుర్తించడు. ఏదో వీధుల్లో బతికేవాడిగా మాటల మధ్య ప్రకటిస్తుంటాడు. అక్కడ ఎక్కువమంది చక్రవర్తి బావ మరిదిగా మాత్రమే గుర్తిస్తారు.
పుళిందపుడే కాదు.. రాజనగరి కులీనవర్గానికి జాయపుణ్ని గొప్ప నాట్యకారుడిగా గుర్తించడానికి, గౌరవించడానికి అభ్యంతరం లేదు. కానీ, అతణ్నొక యుద్ధవీరుడిగా సుతరామూ అంగీకరించరు. వెలనాడు యుద్ధం, అందులో జాయపుని అరివీర పరాక్రమం గణపతిదేవుడు, రేచర్ల రుద్రయ, చౌండసేనాని లాంటి కాకతీయ మహామహులు ఎంతగా అభినందించినా.. ఆ యుద్ధంలో పాల్గొన్న తోటి సేనానులు ఎందరు మెచ్చుకున్నా.. పుళిందపుని బృందం అది సామాన్య అంశం అన్నట్లు విని ఊరుకున్నారు. ఏనాడూ జాయపుణ్ని ఆ యుద్ధ విశేషాలు అడిగిన పాపాన పోలేదు.
కనీసపు ప్రస్తావన తేకుండా అదేదో సాధారణ సైనికుడు కూడా చేయగలిగిన అంశంగా భావించడం జాయపుణ్ని ఆశ్చర్యపరుస్తుంది. అలాంటిది ఇప్పుడు ముమ్మడి వ్యతిరేకవర్గంతో జాయపుడు చేయి కలిపినట్లు భావిస్తూ ముమ్మడి ఓటమిని తమ ఓటమిగా కుమిలిపోతున్నారు. ఏమాత్రం విచక్షణతో ఆలోచించినా జాయపుడు పొలవాసనాడు వేశ్యాగృహాన్ని కాపాడటం సబబుగానే కనిపిస్తుంది. కానీ, జాయపుడు ఈ విషయంలో తొందరపడ్డాడని పుళిందపుడు కూడా భావించడం జాయపుణ్ని
జాగరూకుణ్ని చేసింది.
అనుమకొండలో ఓ జైనబసది గ్రంథాలయం.. జాయపుడు ఏదో గ్రంథాన్ని పరిశీలిస్తున్నాడు. ఓవైపు సంధ్య చీకట్లు కమ్ముకుంటున్నాయి. బసది పరిచారకుడు వచ్చి.. “తమరి కోసం ఎవరో పెద్దలు వచ్చారు మహాసేనాని..” అన్నాడు. ఆశ్చర్యపోయాడు జాయపుడు. తాను జైనబసదిలో ఉన్నట్లు ఎవరికి ఎట్లా తెలిసింది అనుకుంటూ బయటికి వచ్చాడు. పుళిందపుడు!! భృకుటి ముడివేసి చూసి ఆనక ఆశ్చర్యంగా నవ్వి..
“మిత్రమా.. మీరా!? ఇక్కడికి ..??”. పుళిందపుడు కూడా నవ్వాడు. “ఈ దగ్గరలోనే మా వాణిజ్య కార్యాలయం ఉన్నది మిత్రమా.. మీరు ఇటువైపు రావడం చూసి వెంటనే వచ్చాను” అన్నాడు. “అలాగా.. రండి దయచేయండి” అన్నాడు జాయపుడు లోపలికి తిరుగుతూ.
ఆపాడు పుళిందపుడు. “వొద్దు వొద్దు. గ్రంథాలయం కదా! మనం మాట్లాడుకుంటే ఇతరులకు ఆటంకం. అలా బయటికి నడుస్తూ మాట్లాడుకుందాం!”. ఇద్దరూ ఆ వీధిలో నడుస్తున్నారు.. చీకట్లు మరింత చిక్కబడుతున్నాయి. “ఎలా ఉంది మీ నాట్యాభ్యాసం..?”. రాజనగరి వాసులెప్పుడూ జాయపునితో నాట్యాంశాలే మాట్లాడతారు. అతని బుద్ధి తెలిసినా.. నాట్యం గురించి అడిగితే జాయపునికి లేని ఉత్సాహం వస్తుంది. గురుకులంలో కొత్త నాట్యాలపై జరుగుతున్న పరిశోధనలు చెబుతూ నడుస్తున్నాడు జాయపుడు. నడుస్తూ వింటున్నాడు పుళిందపుడు. అప్పుడొక ఊహాతీతమైన సంఘటన జరిగింది.
(సశేషం)