చూసే మనసు, స్పందించే హృదయం ఉండాలేగానీ.. నిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుంచీ సున్నితమైన హాస్యాన్ని సృష్టించవచ్చు. కష్టాలు, ఇబ్బందులకూ హాస్యాన్ని రంగరించవచ్చు. అలాంటి కథలతో నవ్వుల్ని పండించిన రయితలున్నారు. చంద్రప్రతాప్ కంతేటి కూడా.. ఆ కోవకు చెందినవారే! ‘నవ్వు నలభై విధాల గ్రేటు!’ అంటూ తన జీవితంలో జరిగిన పాత జ్ఞాపకాలను, నిత్యజీవిత సంఘటనలను నవ్వుల పువ్వులుగా పూయించారు.
‘కరుణశ్రీ వల్ల నాకెన్నో తలనొప్పులు’ కథ.. కలంపేరు అంటే ఏమిటో తెలీనివారు పడే అవస్థల గురించి చెబుతుంది. లుంగీల కోసం తన హీరో కృష్ణ ఎలాంటి సూపర్ ఐడియా కలిగించాడో.. ‘అప్పట్లో కృష్ణగారే నన్నాదుకున్నారు’లో వివరించారు. చిన్నప్పుడు మనలో చాలామంది పెద్దవాళ్లను అనుకరించడం, వారు చేసే పనులే చేయడం పరిపాటి. ముఖ్యంగా పెద్దవాళ్లు నటీనటులో, గాయకులో అయితే చెప్పనక్కర్లా. తన తండ్రి బుర్రకథా సంవిధానం నచ్చిన రచయితకు ఢక్కీ పగిలాక ఎదురైన అనుభవం తెలుసుకోవాలంటే.. ‘ఢక్కీ పగిలింది.. తందానతానా’ కథ చదవాల్సిందే! నేటి సినీ నటీనటుల వస్త్రధారణా, సాహిత్యం, పాత్రికేయులు.. వీటిని సునిశితంగా విమర్శించే కథ ‘అందం ఉన్నది చూపించడానికి కాదా!’. ఇలా మొత్తం 25 కథలూ ఏకబిగిన చదివిస్తాయి.
వయసు మళ్లినవారిని ఒక్కసారిగా బాల్యంలోకి తీసుకెళ్తాయి. అలాగే, తెలివిమీరిన వారిని నేటికాలంలో వారు ఏం కోల్పోయారో ఆలోచింపజేస్తాయి. చంద్రహాసం నుంచి, వెన్నెల హాసం, వెన్నెల హాసం-2.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వెన్నెల హాసం-3 మన ముందుకు వచ్చింది. వెన్నెలహాసం ట్యాగ్‌లైన్ ‘హాస్యాత్మ కథ’ సార్థక నామధేయమైంది. త్వరలోనే వెన్నెల హాసం-4 కూడా వస్తుందనీ, మరిన్ని హాస్య గుళికలను మనకందిస్తుందనీ ఆశిస్తూ.
రచయిత : చంద్రప్రతాప్ కంతేటి;
పేజీలు: 189;, వెల: రూ.250
ప్రతులకు: తపస్వి మనోహరం
ఫోన్ : 78934 67516
-డా. వి.వి. వేంకట రమణ