ఈశాన్యం బరువు అని, ఆ దిక్కులో పిల్లర్ వేయకుండా ఇల్లు కట్టాం. మంచిదేనా?
-అడుగు శ్రీనివాస్, కోరుట్ల
ఈశాన్యం బరువు కావద్దని, పిల్లర్ లేకుండా ఇల్లు కట్టడం దోషం. నాలుగు కాళ్లు ఉండాల్సిన కుర్చీకి ఒక కాలు లేకపోతే ఎలా ఉంటుందో, ఆ ఇంటి యజమానుల పరిస్థితీ అలానే ఉంటుంది. ముందు మీరు స్ట్రక్చరల్ ఇంజినీర్‌తో ఇంటి స్ట్రెంత్ చూపించుకోండి. సరైన రిపేర్ చేయించండి. భూకంపాలు వచ్చినప్పుడు బీముల టైయింగ్ సరిగ్గా లేకుంటే నిర్మాణం ఓ పక్కకు ఒరిగిపోతుంది. లేదంటే కుంగుతుంది. పోతే, ఈశాన్యం బరువు అనేది ఇక్కడ అంశం కాదు. ఆరోగ్యం ప్రధాన అంశంగా ఉండాలని, ఆ దిశ మూతపడకుండా ఉండాలని అలా చెప్పారు. వాస్తు పరిభాష వేరేలా ఉంటుంది.
ఆగ్నేయంలో ఫౌంటెయిన్ ఎత్తుగా పెట్టుకోవచ్చా? అక్కడ గదిని కట్టొచ్చా? నీరు ఉండొచ్చా?
-సరస్వతి, ఎల్బీ నగర్
ఇల్లు, దాని పరిసరాలు మనిషిపై అనుక్షణం ప్రభావం చూపిస్తాయి. మన గృహమే మన శక్తికేంద్రం. ఆలయాలలో ‘జ్ఞానశక్తి’, ఇళ్లలో ‘సాధనా శక్తి’ లభించేలా నిర్మాణ విధానాలు రూపకల్పన చేశారు మన రుషులు. అయితే అవి దోషపూరితం కాకుండా గృహ విభజన జరగాలి. జాగ్రత్తలు పాటించాలి. తూర్పు ఆగ్నేయంలో ఫౌంటెయిన్ నిర్మించాలని అనుకుంటే కేవలం ఫౌంటెయిన్‌ను మాత్రమే ప్లాన్ చేయండి. ఆగ్నేయంలో గది కట్టి దానికి కాకుండా తూర్పు ఖాళీ భాగంలోని ఆగ్నేయం దిశన అటు తూర్పు దక్షిణంలోని ప్రహరీలను తాకకుండా ఎలివేటర్‌గా, అందంగా ఫౌంటెయిన్ వేసుకోండి. ఆగ్నేయంలో నీరు ఉండొద్దు అనేది కాదు. నైరుతిలో కూడా నీరు ఉండొచ్చు. అయితే ఆ దిశల్లో గొయ్యి చేసిన నీళ్ల సంపులు ఉండొద్దు. ఎత్తుచేసి నీళ్లతొట్లు దక్షిణం, పడమరల్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంటిమీద నైరుతిలో నీళ్ల ట్యాంకులే కదా అందరికీ!
n బాల్కనీ వాయవ్యంలో స్టోర్ చేసుకోవచ్చా?
-కె. ఆనంద్‌సాయి
సాధారణంగా ఇంటి చుట్టూ కింది భాగంలో ప్రదక్షిణం కోసం ఖాళీ వదులుతాం. అలానే అంతస్తులు ఎన్ని వచ్చినా సరే వాటి చుట్టూరా నడక కోసం బాల్కనీలు ఉండాలని శాస్త్రం చెప్పింది. అయితే చిన్న బాల్కనీలో వాయవ్యంలో గది కట్టినప్పుడు ఆ దిశ మూతపడుతుంది. పైగా వాయవ్యం మూతవల్ల వెనక ఉన్న పశ్చిమ బాల్కనీలోకి నడక ఆగిపోతుంది. అది ప్రదక్షిణ దోషం అవుతుంది. అయితే వాయవ్యంలో స్టోర్ దోషం మాత్రం కాదు. ఇకపోతే అలా కట్టుకునేందుకు అవకాశం లేనప్పుడు ఆలోచన మానుకోవడమే మంచిది.
డూప్లెక్స్ ఇల్లుకు ఉత్తరం అంతా స్లాబ్ (హాలో) వేయకుండా కట్టొచ్చా? లేక ఈశాన్యంలో డ్రాయింగ్ రూము కట్టాలా?
-వి. కృష్ణమోహన్
ఉత్తర భాగమంతా హోల్ (సీ త్రూ) చేసి కట్టడం వల్ల మేడమీది ఇల్లు దక్షిణం నడకలతోనే నిండిపోతుంది. గృహంలో అన్ని మూలలకు వెళ్లగలిగే అవకాశం ఉండాలి. ఇంటి డూప్లెక్స్ భాగం అతిగా పెంచి కట్టవద్దు. ఉత్తరం మధ్యలో కానీ, తూర్పు మధ్యలో కానీ ఉండొచ్చు. ఒకటికి మించి సీ త్రూలు ఉన్న ఇల్లు ఇల్లులా ఉండదు. మీ ప్లాన్‌లో ఒకటి వాయవ్యం ఈశాన్యం ఉత్తరం కలుపుకొని ఉంది. మరోటి ఈశాన్యంలో పడకగది పెట్టి ఉత్తరం, మళ్లీ వాయవ్యం కలిపి హాలో చేశారు. అది మంచిది కాదు. ఉత్తరం మాత్రమే ఇంటికి మధ్యభాగం చేయండి. వాయవ్యం, ఈశాన్యాలు వాడుకునే గదులు పెట్టండి. కింది ఈశాన్యంలో డ్రాయింగ్ రూము, పైన స్టడీ రూము చేసుకోండి.
రెండు గదుల మధ్యలో రెండు టాయిలెట్లు పెట్టి వాడుకోవచ్చా? -కె. తరుణిక, సిద్దిపేట
రెండు గదులు మాత్రమే ఒకదాని వెనుక ఒకటి వేసి, వాటి మధ్య రెండు బాత్రూమ్స్ని అటాచ్డ్గా చేసుకొని వాడుకోవడం వల్ల ఆ గదులు శాస్త్రబద్ధంగా ఉండవు. ఎన్ని గదులు వేసుకున్నా వాటిలో ఎవరి టాయిలెట్లు వారికి ఉండాలి. అంటే వరుసగా కట్టిన గదులకు ఉత్తర, ఈశాన్యాలలో ద్వారాలు వచ్చే విధంగా అమర్చుకోవాలి. ప్రతి గదిలో తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్ ఇండిపెండెంట్‌గా కట్టాలి. అప్పుడు ప్రతి గది నాలుగు దిశలతో మంచి వెంటిలేషన్ వచ్చే టాయిలెట్లతో కూడి ఉంటుంది. రెండు గదుల మధ్య దేని టాయిలెట్ దానికే వచ్చినా, ముందు (తూర్పు) గదికి నైరుతి పోతుంది. వెనుక (పశ్చిమం) గదికి ఈశాన్యం పోతుంది. పైగా అలాంటి టాయిలెట్లకు తగినంత గాలి, వెలుతురు రాదు. నిదుర గదులు హాయిగా ఆహ్లాదంగా ఉండాలి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాస్తు : దక్షిణం పిశాచ స్థానం అంటే ఏంటి? ఆ స్థలాన్ని వదిలేసి ఇల్లు కట్టాలని అంటారు? ఎందుకు?
వాస్తు: ఒకే ఇంట్లో రెండు వంట గదులు ఉండవచ్చా?
వాస్తు : గుట్ట మీద ఇల్లు కట్టవచ్చా? ఒకవేళ ఇల్లు కడితే దిశలు చూడాలా?
వాస్తు- రోడ్డు ఎత్తుగా ఉంటే దాని ప్రభావం ఇంటిమీద ఉంటుందా?