Tom and Jerry | టామ్ అండ్ జెర్రీ! తరం మారినా ఈ పేరుకు ఉన్న ఆకర్షణ అంతా ఇంతా కాదు. అది అసలు పేరు మాత్రమే కాదు… ఓ ఉద్వేగం! ఓ మూడు తరాల వారికి బాల్యాన్ని గుర్తుచేసే సరదా. 70-80 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ మనసుకు ఊరట కావాలంటే మరిపించే మందు. మీ రంగురంగుల కార్టూన్లకి మా బాల్యం ఏమాత్రం తీసిపోదని, ఇప్పటి తరానికి గర్వంగా చూపించే సాక్ష్యం. తెర మీద ఇప్పటికీ చురుగ్గా పరుగులు తీసే టామ్, జెర్రీలకు 85 ఏళ్లు అంటే నమ్మడం కష్టం. ఓ చిన్న ఆలోచన ఎంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టింది, ఎన్ని కడుపులు నింపింది, ఎందరి ఇళ్లలో నవ్వులు పూయించింది, క్లాసిక్‌గా ఎలా చరిత్రలో నిలిచిపోయింది అనేందుకు సజీవ సాక్ష్యం టామ్ అండ్ జెర్రీ. పైకి కార్టూన్‌గా కనిపించే ఈ దృశ్యాలను సృష్టించడం వెనుక అపారమైన శ్రమ ఉంది, ప్రపంచయుద్ధాన్ని సైతం దాటిన తెగువ ఉంది. వాటన్నిటినీ తలుచుకునేందుకు ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది?
సంగీతానికి ఏ జీవి అయినా పరవశిస్తుంది కానీ, మనిషి మాత్రమే ఆస్వాదించగలిగేది కథ! పైగా ఆ కథకు చలనం జోడిస్తే మరింత రసవత్తరంగా మారుతుంది. ఇప్పుడంటే దాన్ని యానిమేషన్ అంటున్నాం కానీ… మనకు ఆ ప్రక్రియ ఎప్పుడో పరిచయం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలోనే దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట మొదలైంది. రకరకాల మార్పులు, చేర్పులు దాటుకుని వందేళ్ల క్రితమే ఆ యానిమేషన్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. 1923లో డిస్నీ సోదరులు ఏకంగా ఓ స్టూడియో ప్రారంభించడంతో… కార్టూన్ చిత్రాలకు ఉజ్వల భవిష్యత్తు మొదలైంది. మిక్కీ మౌస్ వంటి పాత్రల రాకతో, ప్రజలకు ఓ కొత్త వినోదరంగాన్ని పరిచయం చేసినట్టు అయ్యింది. పాపులర్ సినిమాలకు దీటుగా కార్టూన్లను ప్రదర్శించడం మొదలుపెట్టారు.
ఇదంతా గమనించిన ప్రముఖ సినీ, టీవీ రంగ సంస్థ మెట్రో గోల్డ్విన్ మేయర్ (ఎంజీఎం) అధినేత, తన స్టూడియో నుంచి కూడా కార్టూన్ చిత్రాలు రావాలని సంకల్పించాడు. తన దగ్గర పనిచేస్తున్న కథకుడు, కార్టూనిస్ట్ జోసెఫ్ బార్బరాను పిలిచి తన ఆలోచన చెప్పాడు. బార్బరా జీవితాన్ని కాచి వడబోసినవాడు. ఇటలీ నుంచి పొట్టచేతపట్టుకుని వచ్చిన కుటుంబం తనది. కళతో పాటు కష్టమూ తెలిసినవాడు. మధ్యతరగతి జీవుల అభిరుచులూ తనకు ఎరుకే. తనతోపాటు చేరిన హన్నాతో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ‘నిరంతరం కొట్టుకునే రెండు పాత్రలతో ఎన్ని కథలైనా నడిపించవచ్చు’ అనే సూత్రం వాళ్ల మెదడులో మెదలింది. దానికోసం కుక్క, నక్క లాంటి రకరకాల జంతువులను అనుకున్నాక… పిల్లి, ఎలుక దగ్గర ఆలోచన ఆగింది.
అప్పటికే ఎంజీఎం సంస్థ నుంచి వచ్చిన కార్టూన్లు అంతగా జనాలను ఆకట్టుకోలేదు. మరోవైపు వాల్ట్ డిస్నీ కార్టూన్ల రాజ్యానికి రారాజుగా చెలరేగుతూ ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంటూ ఉంటే, ఎలాగోలా ఉనికిని నిరూపించుకోవాలనే కసిలో వచ్చింది ‘పుస్ గెట్స్ ద బూట్’ (Puss Gets the Boot) అనే చిత్రం. ఓ జానపద కథ ఆధారంగా రూపొందించిన ఆ కార్టూన్ జనాలను ఆకట్టుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అసలది స్టూడియో అధికారులకే నచ్చలేదు. అందుకే ఇక ఈ పిల్లి, ఎలుక ఆటలు ఆపేసి వేరే కార్టూన్ల మీద దృష్టి పెట్టమంటూ హన్నా, బార్బరాలకు చెప్పేశారు కూడా. అసలు వాళ్ల పేర్లు కూడా ఆ టైటిల్ కార్డులలో కనిపించనంత ఆషామాషీగా చిత్రాన్ని విడుదల చేశారు. కానీ విచిత్రం. పుస్ గెట్స్ ద బూట్ జనాలకు తెగ నచ్చేసింది.
ఏకంగా ఆస్కార్ అవార్డు నామినేషన్ సైతం దక్కించుకుంది. అవే పాత్రలతో మరిన్ని కార్టూన్లు రావాలంటూ ఉత్తరాలు మొదలయ్యాయి. అప్పుడిక వాటికి పేర్లు పెట్టాలనే ఆలోచన మొదలైంది. అవును! ఆ తొలి చిత్రంలో పిల్లి పేరు జాస్పర్. అసలు ఎలుకకు పేరే లేదు. అందుకే వాటికి మంచి పేర్లు సూచించమంటూ ఓ పోటీని నిర్వహించారు. అందులో అందరికీ నచ్చిన పేరే టామ్ అండ్ జెర్రీ. నిజానికి ఆ పేర్ల వెనుక సారూప్యత ఏం లేదు. లైఫ్ ఇన్ లండన్ అనే పుస్తకంలోని పాత్రలంతే! కానీ ఎప్పుడైతే అవి కార్టూన్లుగా తయారయ్యాయో… దాగుడుమూతలకు, సరదా కొట్లాటలకు మారుపేరుగా చేరిపోయాయి.
టామ్ అండ్ జెర్రీ తొలి కార్టూన్లన్నీ హన్నా, బార్బరా ద్వయం రూపొందించినవే. ఒకటి కాదు రెండుకాదు… ఏకంగా పదిహేనేళ్ల పాటు 114 కార్టూన్లను తయారుచేశారు. ఇందులో ఏడు కార్టూన్లు ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నాయి. ఇంతవరకూ ఏ కార్టూన్ యానిమేషన్ పాత్ర ఇన్ని అవార్డులను గెలుచుకోలేదు. ఒక్కో కార్టూన్ కోసం పెద్దగా ప్రహసనం ఏమీ ఉండేది కాదు. స్క్రిప్టు కూడా లేకుండా ఆడుతూపాడుతూ లాగించేసేవాళ్లు. ఒకరు స్టోరీ బోర్డ్ చూసుకుంటే, మరొకరు యానిమేషన్, ఒకరు సంగీత పర్యవేక్షణ చేస్తే మరొకరు పాత్రల తీరుతెన్నులు… ఇలా బాధ్యతలు పంచుకుంటూ కార్టూన్‌ను త్వరగా పూర్తిచేసేవారు. వాటిని థియేటర్లలో రిలీజ్ చేయగానే కాసుల వర్షం కురిసేది. ఇక టామ్ అండ్ జెర్రీలకు తిరుగులేదు అనుకునే సమయంలో ఇంటింటా టీవీలు మొదలయ్యాయి.
వాటిలోనే కార్టూన్లు చూసే అలవాటు పెరిగింది. ప్రేక్షకులను హాళ్లకు రప్పించే ప్రయత్నాలు పెద్దగా పారలేదు. దాంతో యానిమేషన్ మీద పెద్దగా ఖర్చు పెట్టకూడదని ఎంజీఎం సంస్థ నిర్ణయించుకుంది. ఫలితంగా 1957లో ఏకంగా తన యానిమేషన్ స్టూడియోనే మూసేసింది. టామ్ అండ్ జెర్రీలు ఆగిపోవడంతో తమ బతుకు పరుగు కూడా ఆగిపోయిందని నిరాశపడలేదు హన్నా, బార్బరా. ఇద్దరి పేర్లూ కలిపి ఓ యానిమేషన్ స్టూడియో స్థాపించారు. మారుతున్న మార్కెట్, పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త పాత్రలను సృష్టించారు. యోగిబేర్, స్మర్ఫ్స్, ఫ్లింట్ స్టోన్స్, స్కూబీ డూ.. ఇవన్నీ వారి కల్పనే!
హన్నా బార్బరా శకం తర్వాత టామ్ అండ్ జెర్రీలకు గడ్డుకాలమే వచ్చింది. పాత కార్టూన్లను ఆదరిస్తున్నా, కొత్త సరుకు రాకపోవడంతో ప్రేక్షకుల నుంచి ఒత్తిడి పెరిగింది. దాంతో ఎంజీఎం సంస్థ తక్కువ ధరలో ఓ 13 టామ్ అండ్ జెర్రీ కార్టూన్లను రూపొందించేందుకు ఓ విదేశీ సంస్థతో కాంట్రాక్టు కుదుర్చుకుంది. చెకొస్లొవేకియాలో తయారైన ఈ కార్టూన్లు, అంతర్యుద్ధ వాతావరణం మధ్య దొంగచాటుగా నిర్మించాల్సి వచ్చేది. జీన్ డైచ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాల నుంచి డబ్బులు బాగానే వచ్చాయి. కానీ హన్నా, బార్బరా ఫలితంతో పోలిస్తే… ఇవి మరీ నాసిరకంగా కనిపించేవి. టామ్ అండ్ జెర్రీ పాత్రలు మాత్రమే కాకుండా యానిమేషన్, కథ పరంగా కూడా అవి హన్నా, బార్బరా చిత్రాలకు దీటుగా నిలబడలేకపోయాయి. ఆ తర్వాత చక్ జోన్స్ ఆధ్వర్యంలో వచ్చిన మరికొన్ని కార్టూన్లు సైతం అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
ఇక అటుతిరిగీ, ఇటుతిరిగీ ఈ కార్టూన్ల బాధ్యత మళ్లీ హన్నా, బార్బరాల మీదే పడింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ద్వయం టామ్ అండ్ జెర్రీ కార్టూన్లను రూపొందించడం మొదలుపెట్టింది. కానీ, పిల్లల కార్టూన్లలో హింస మీద తాజా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని… టామ్ అండ్ జెర్రీలు కలిసిమెలిసి సాహసాలు చేస్తున్నట్టు ఈ కార్టూన్లను నిర్మించారు. అవీ అంతగా ఆకట్టుకోలేదు. వెరసి… 1940, 50ల నాటి ఆ 114 చిత్రాలనే అభిమానులు తిప్పితిప్పి చూస్తున్నారు. ఆ పాత్రల మీద హక్కులు కూడా చేతులు మారి వార్నర్ బ్రదర్స్‌కు చేరుకున్నాయి.
టామ్ అండ్ జెర్రీ హవా థియేటర్లలో మొదలై, టీవీలకు తాకి ఆగిపోలేదు. నేరుగా డీవీడీ రూపంలోనూ మంచి ఆదరణ పొందాయి. 1942 నుంచే కామిక్ బుక్స్ రూపంలో పిల్లలను అలరించాయి. వార్తాపత్రికల్లో కామిక్ స్ట్రిప్స్గానూ పలకరించాయి. ఈ పాత్రలతో తయారుచేసిన వీడియో గేమ్స్‌కి కూడా పిల్లలు ఫిదా అయిపోయారు. టామ్ అండ్ జెర్రీల వయసును తగ్గిస్తూ నిర్మించిన టామ్ అండ్ జెర్రీ కిడ్స్ ఆదరణ పొందాయి. విశేషం ఏమిటంటే… టామ్ అండ్ జెర్రీలతో పూర్తిస్థాయి చలనచిత్రాలను కూడా రూపొందించారు. ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించే ఉద్వేగభరిత సన్నివేశాలతో గంటకు పైగా నిడివితో వీటిని విడుదల చేశారు.
ఆ సిరీస్‌లో రెండో చిత్రం రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. మూడో చిత్రం ‘టామ్ అండ్ జెర్రీ: ద ఫర్బిడెన్ కంపాస్’ త్వరలోనే రానుంది. నిజ ప్రపంచంలో టామ్ అండ్ జెర్రీల్లాగా కొట్టుకునే అమెరికా, చైనాలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఈ చిత్రం మీద చైనా చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటివరకూ అన్ని రంగాల్లోనూ ఆధిపత్యాన్ని సాధిస్తున్న చైనా, చిత్ర నిర్మాణ రంగంలో హాలీవుడ్‌ని దాటలేకపోయింది. కానీ ఇప్పుడిప్పుడే అందులోనూ పోటీపడే ప్రయత్నం చేస్తున్నది. ఈ చిత్ర విజయాన్ని అందుకు గీటురాయిగా భావిస్తున్నది.
ప్రస్తుతానికి టామ్ అండ్ జెర్రీ కొత్త కార్టూన్ల నిర్మాణం ఆగినా… పదేపదే అవే అవే పాత భాగాలను చూస్తూ మురిసిపోయే అభిమానులకు లోటు లేదు. అవి వారి బాల్యాన్ని గుర్తుచేయడమే కాదు, ప్రస్తుతపు ఒత్తిడిని దాటే ఔషధం కూడా. అందులో హింస ఎక్కువ అని విమర్శకులు అంటున్నా… వాటిని ఆ దృష్టితో చూసినవారు తక్కువ. అందులోనూ నాటి తరంలో! పైగా ఈ పాత్రల వెనుక వినోదం పంచాలనే ఉద్దేశమే కానీ, వాటికి ప్రేక్షకులను వ్యసనపరులుగా మార్చాలనే అత్యాశ కనిపించదు.
ఇప్పటి కొన్ని కార్టూన్లు అలా కాదు. పసిపిల్లలను సైతం తెరకు బానిస చేసేలా రంగురంగుల మెరుపులతో, వేగంగా కదిలే దృశ్యాలతో, ఎప్పటికప్పుడు మారిపోయే సన్నివేశాలతో… పిల్లల మనస్తత్వానికి ఎరవేసి, వాళ్లను కట్టిపడేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ లౌక్యం టామ్ అండ్ జెర్రీలకు లేదు కాబట్టి… అవి సరదా కొట్లాటలుగానే మిగిలాయి. అవి ఏడుస్తూ, మనల్ని నవ్విస్తున్నాయి. మనుషుల్లో ఆపాటి బాల్యం నిలిచి ఉన్నంతవరకూ, మరో వెయ్యేళ్ల వరకూ అవి చిరంజీవులే!
టామ్, జెర్రీ మధ్య కొట్లాటను రసవత్తరంగా మార్చేందుకు కొత్తకొత్త సందర్భాలు, పాత్రలను సృష్టించేవాళ్లు. హన్నా, బార్బరాల కథలన్నీ ఇంటి చుట్టూ తిరిగినా… రకరకాల జీవులు ఆ ఆటను రక్తి కట్టించేవి. వాటిలో స్పైక్ అండ్ టైక్ గురించి ముందు చెప్పుకోవాలి. స్పైక్ ఓ బుల్డాగ్. దాని కొడుకు టైక్ జోలికి వస్తే ఊరుకోని స్పైక్‌కి టామ్‌ని ఎరగా వేస్తుంటుంది జెర్రీ. ఈ స్పైక్, టైక్లు ఎంతగా పాపులర్ అయ్యాయంటే… ప్రత్యేకంగా వాటితోనే కొన్ని కార్టూన్లను కూడా నిర్మించారు. ఇక మరో ముఖ్య పాత్ర బుచ్. గుప్పు గుప్పున పొగ వదులుతూ టామ్‌ని చూడగానే పళ్లు కొరికే నల్ల పిల్లి ఈ బుచ్. ఇక టామ్ పక్కనే తిరిగే ఆవారా పిల్లలకు కూడా పేర్లున్నాయి.
అవి లైట్నింగ్, టాప్సీ, మీట్హెడ్! అసలు జెర్రీనే ప్రమాదంలో ఉంది అనుకుంటే, తన వెర్రితనంతో దాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టే ఓ అనాథ ఎలుక కూడా ఉంది. దాని పేరు నిబిల్స్. పిల్లుల పాలిట సింహస్వప్నంలా ఉండే ఓ ఎలుక కూడా ఉంది. అదే మజిల్స్. క్వాకర్ అనే బాతు, కుకూ అనే పక్షి, గోల్డ్ ఫిష్ అనే చేప, జంబో అనే ఏనుగు… ఇవన్నీ కూడా జెర్రీ సాయంతో టామ్ నుంచి తప్పించుకుంటూ ఉంటాయి.
టామ్ అండ్ జెర్రీ ఎంతగా అలరించిందో… అంత తీవ్రమైన విమర్శలను కూడా మూటకట్టుకుంది. ఇవి తీసిపారేసేవి ఏం కాదు!
గొడ్డలితో నరకడం, బాంబులతో పేల్చడం, విషం పెట్టడం… ఈ చేతల్ని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. టామ్, జెర్రీ మధ్య జరిగే గొడవలో ఇలాంటివి సర్వసాధారణం. అవి హాస్యం కోసమే అని సమర్థించుకున్నా వాటిని చూసే పసిపిల్లల మనసు మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయనీ, సరదాగా వాటిని ఆచరించేయవచ్చనే అభిప్రాయం కలిగిస్తాయనీ విమర్శ ఉంది.
టామ్ అండ్ జెర్రీ నాటి సమాజంలో నల్లజాతీయుల పట్ల వివక్ష చాలా తీవ్రంగా ఉండేది. తెలిసో, తెలియకో వాటిని తమ కార్టూన్లలో చొప్పించేశారు. పనివాళ్లని చూపించేటప్పుడు… నల్లవారి యాస, వేషాలతో చూపించేవాళ్లు. అందులో ముఖ్యంగా ‘మమీ టు షూస్’ అనే పాత్ర మీద తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఆ పాత్రను మార్చాల్సి వచ్చింది.
ఈ కథల్లో సిగరెట్ తాగే సన్నివేశాలు, అశ్లీల దృశ్యాలకు కూడా కొదవ లేదు. వాటి
కారణంగా ఎన్నో సందర్భాల్లో… మరీ ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో ఆ సన్నివేశాలు, అవి ఉన్న కార్టూన్లను నిషేధించారు.
టామ్ అండ్ జెర్రీలోని ఓ భాగంలో టామ్ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నది జరగకపోతే ఆత్మహత్య కూడా ఓ మార్గమే అని పసిపిల్లలకు సూచించినట్టు ఉంటుంది. ఇవే కాదు… ఈ సిరీస్‌లో జూదం, మద్యపానం లాంటి సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తాయి.
1 కొన్ని సినిమాల్లో కామెడీ లేదా పోరాట సన్నివేశాలు చూసి ‘ఇదేదో కార్టూన్ చిత్రాన్ని కాపీ కొట్టినట్టు ఉందే’ అనిపించడం సహజం. అది నిజమే అయినా ఎవరూ నామోషీకి ఒప్పుకోరు. ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ మాత్రం… తన చిత్రాల్లో చాలా పోరాట సన్నివేశాలకు స్ఫూర్తి టామ్ అండ్ జెర్రీ కార్టూన్ల నుంచి తీసుకున్నా అని చెప్పేశారు.
2 ఏళ్లుగా సాగుతున్న టామ్ అండ్ జెర్రీలలో చిన్నపాటి మార్పులు తెచ్చే ప్రయత్నం చేసేవారు హన్నా, బార్బరా. జెర్రీ కాస్త బరువు తగ్గడం, టామ్ నాలుగు కాళ్ల మీద నడవడం లాంటివన్నమాట.
3 ఈ కార్టూన్లలో అరుపులు, కేకలే ఎక్కువగా వినిపిస్తాయి. ఆ అరుపుల్లో కూడా అధిక భాగం, హన్నావే కావడం విశేషం. ఇక సంభాషణలు దాదాపు శూన్యం. అవి కూడా చిన్నాచితకా పాత్రల నుంచే ఎక్కువగా వినిపించేవి.
4 టామ్ అండ్ జెర్రీ ప్రేరణగా మరెన్నో కార్టూన్లు వచ్చాయి. వాటిలో రోడ్ రన్నర్ షో, ఆగీ అండ్ ద కాక్రోచెస్ లాంటి సిరీస్ అంతే విజయాన్ని
సాధించాయి కూడా!
5 సాంకేతికతలో వచ్చిన మార్పులను అభిమానులు టామ్ అండ్ జెర్రీకి కూడా అన్వయిస్తున్నారు. జిబ్లీ ైస్టెల్, యానిమేల రూపంలోనూ ఇవి కనిపిస్తున్నాయి.
6 టామ్ అండ్ జెర్రీ తొలి కార్టూన్లలో వినిపించే నేపథ్య సంగీతం కూడా కట్టి పడేసేలా ఉంటుంది. సంభాషణలు లేని లోటును భర్తీ చేస్తూనే ఆకట్టుకునేది. ఇందుకోసం అతి కష్టసాధ్యమైన ట్వల్వ్ టోన్ అనే పద్ధతిని వాడేవారట. ఒకేసారి అన్ని స్వరాలనూ వాయించే ఈ పద్ధతితో టామ్ అండ్ జెర్రీల కదలికలు ఉద్వేగభరితంగా కనిపించేవి.
– కె.సహస్ర