అంతెత్తు కొండలు.. ఇంతింతే కనిపిస్తాయి. మహావృక్షాలు కూడా.. మరుగుజ్జుల్లా మారిపోతాయి. ఏనుగులేమో.. ఎలుకల్లా; పులులేమో.. పిల్లుల్లా అనిపిస్తాయి.అదంతా మినిమలిస్ట్ ఫొటోగ్రఫీ మాయాజాలం. ఫ్రేమ్ మొత్తాన్నీ నెగెటివ్ (ఖాళీ) స్పేస్‌తో నింపేసి.. ప్రధాన సబ్జెక్ట్‌ను చిన్నగా ఏ మూలకో నెట్టేయడమే మినిమలిస్ట్ ఫొటోగ్రఫీ. ఇదో ప్రత్యేకమైన ఫొటోగ్రఫీ శైలి.
ఫొటోగ్రఫీ ఓ ప్రత్యేకమైన శైలి. ఇందులో మామూలు సబ్జెక్ట్‌ను కూడా మినిమలిస్టిక్ (చిన్న)గా మార్చేసి.. అద్భుతమైన కళాఖండంగా చూపిస్తుంది. పొలం గట్టుపైన ఒంటరి చెట్టు, నీలాకాశంలో ఎగిరే పక్షి, సరస్సులో తేలియాడే పడవ, మంచు దుప్పట్లో తిరిగే దున్న, నది ఒడ్డున ఒంటరి భవనం.. ఇవే ఈ ఫొటోగ్రఫీలో కాన్వాసులు. ఇలాంటి చోట అధిక నెగెటివ్ స్పేస్ దొరుకుతుంది. సబ్జెక్ట్‌ను చిన్నగా చూపిస్తూ.. ఫొటోలను అద్భుతంగా మలిచే అవకాశం కలుగుతుంది. ఫ్రేమ్‌లో చాలా తక్కువ విషయాలు ఉంటాయి. కాబట్టి, ప్రధాన సబ్జెక్ట్‌ను చిన్నగా చూపించినా.. వీక్షకుల దృష్టిమొత్తం దానిమీదే పడుతుంది. అయితే, కొన్ని అంశాలపై పట్టుసాధిస్తే.. మినిమలిస్ట్ ఫొటోగ్రఫీలో ఆరితేరొచ్చు. స్మార్ట్‌ఫోన్‌తోనే.. అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు.
చివరగా.. మినిమలిస్ట్ ఫొటోగ్రఫీ మీ క్రియేటివిటీని మెరుగుపరుస్తుంది. సరైన కాంతి, కంపోజిషన్, ఎడిటింగ్ టెక్నిక్స్ ఉపయోగించి.. అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చు. వెంటనే మొబైల్ తీసుకోండి.. చుట్టుపక్కల ప్రాంతాలను నిశితంగా గమనించండి. రోజూచూసే సబ్జెక్ట్‌నే దూరం నుంచి క్యాప్చర్ చేయండి. పెద్దపెద్ద నిర్మాణాలను కూడా.. బుల్లిబుల్లి అద్భుతాలుగా మార్చేయండి. అయితే, నగరాలు, పట్టణాల్లో మినిమలిస్టిక్ ఫొటోగ్రఫీ అంత అనుకూలంగా ఉండదు. పల్లెలు, అటవీప్రాంతాలు, కొండలు, బీచ్‌లు, సరస్సులు, ఎడారి ప్రాంతాలు.. ఈ రకమైన ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి. ఆయా ప్రాంతాలను సందర్శించినప్పుడు.. మినిమలిస్ట్‌గా ‘క్లిక్’మనిపించడం మొదలుపెట్టండి.
-ఆడెపు హరికృష్ణ