శ్వేత రక్కసి రహస్యాన్ని విప్పిన ఇన్స్పెక్టర్ రుద్ర.. నల్లమల డెత్గేమ్ను వెనుకుండి నడిపిస్తున్నది ఎవరో తనకు తెలుసని చెప్పగానే.. అందరూ షాక్ అయ్యారు. ‘అది ఎవరు?’ అంటూ ముక్తకంఠంతో ప్రశ్నించారు శరత్, జయ, స్నేహిల్, శివుడు, రామస్వామి అండ్ మిగతా టీమ్. దీంతో హైదరాబాద్ టూ నల్లమల మధ్య జరిగిన ప్రతీ విషయాన్ని రుద్ర ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘నల్లమలలో మిస్టరీ మరణాలు సంభవిస్తున్నట్టు ఓ మీడియా మిత్రుడి ద్వారా తనకు తెలిసిందని డీఎస్పీ సత్యనారాయణ సార్ చెప్పారు. సీఐ శరత్ సార్ కూడా ఈ కేసును సాల్వ్ చేయలేకపోతున్నారని ఆయనే నన్ను ఇక్కడికి పంపించారు. సాయంగా ఉంటారని మిమ్మల్ని కూడా నాతో తీసుకొచ్చా. అప్పుడు వచ్చీరాగానే, నారాయణాద్రుల స్వామీజీ ఆశ్రమానికి చేరాం. ఆయన గుట్టును రట్టు చేశాం’ అని రుద్ర అంటుండగానే.. ‘రుద్ర ఒక విషయం మరిచిపోయావ్.. నారాయణాద్రుల స్వామీజీ గురించి శివుడు ఏం చెప్పాడో గుర్తుందా?? ఇంట్లో దుష్టపీడలను ఆయన వదిలిస్తాడని, ఆయనంటే గూడెం వారికి ఎంతో గురి అంటూ పొగిడాడు’ అంటూ గతంలో శివుడు అన్న మాటలను గుర్తు చేశాడు సీఐ శరత్. అవునన్నట్టు సన్నగా నవ్వాడు రుద్ర. దీంతో అందరి దృష్టి శివుడిమీదకు మళ్లింది.
అందరూ ఒక్కసారిగా చూడటంతో భయంతో తల దించుకొన్నాడు శివుడు. రుద్ర చెప్పడం కొనసాగించాడు. ‘క్షీరసాగర మథనం, రక్తహస్తం, రక్తపిశాచీ’ ఇలా నారాయణాద్రుల స్వామీజీ చేసిన ప్రతీ మోసాన్ని ఎలాగోలా బయటపెట్టాం. పాపం… తన మాటలు నిజమని నమ్మించడానికి ఓ అమాయకురాలిని ఆ స్వామీజీ చంపించాడు. అది బయటపెట్టాలనుకొన్న నన్ను కూడా చంపడానికి ప్రయత్నించాడు’ అని రుద్ర అంటుండగానే.. ‘ఆ.. అవును. ఇంతలో శరత్ గారు స్వామీజీని షూట్ చేసి నిన్ను కాపాడాడు’ అంటూ జయ అందుకుంది. దానికి అందరూ అవునన్నట్టు తలూపారు.
రుద్ర మళ్లీ కొనసాగించాడు. ‘నల్లమలలోకి ఎంటర్‌కాగానే, భయంకర డ్రోన్ పక్షి, జ్వాలా తటాకం, శ్వేతరక్కసి ఉదంతాలతో మనల్ని ఇక్కడి నుంచి తరిమేయాలని ఓ ముఠా బాగా ప్రయత్నించింది. వాళ్లకు మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే కావాలి’ అని రుద్ర అనగానే.. ‘బ్రో.. మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లాలని మొదటి నుంచి కోరుకొంటున్నది రామస్వామి బాబాయే.. కాదంటావా?’ కలుగజేసుకొన్నాడు స్నేహిల్. ‘యెస్.. ఎగ్జాక్ట్లీ..’ అంటూ రుద్ర అనగానే.. అందరి దృష్టి రామస్వామి మీదకు మళ్లింది. దీంతో రామస్వామి గుండెలు గుబేల్మన్నాయి.
‘సార్.. నాకు ఏ పాపం తెలియదు. అందరూ బాగుండాలని కోరుకొంటా. అసలు ఇంతకు ముందు ఎన్నడూ నల్లమల వచ్చి ఎరుగను. నాకు, ఈ నల్లమల డెత్‌గేమ్‌కు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ అప్పటివరకూ ధైర్యంగా ఉన్న రామస్వామి కన్నీటిపర్యంతమయ్యాడు. ఇంతలో జయ జోక్యం చేసుకొన్నది. రుద్ర, స్నేహిల్ను ఉద్దేశిస్తూ.. ‘ఒరేయ్.. మీకేమైనా పిచ్చా?? ఎన్నో ఏండ్లుగా రామస్వామి గారు మన డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. ఒరేయ్ రుద్ర.. పోలీసుగా నీకు ఓనమాలు నేర్పిందే ఆయన. అలాంటి వ్యక్తిపై అభాండాలు వేయడానికి మీ ఇద్దరికీ నోరెలా వచ్చిందిరా?’ అంటూ జయ మండిపడింది.
ఆమెను మధ్యలో వారించిన రుద్ర.. ‘ఆంటీ.. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే, ఎవరు మంచివాళ్లో.. ఎవరు కాదో? అర్థం చేసుకోవడం చాలా కష్టం. శ్వేత రక్కసి గుట్టును రట్టు చేయడంలో భాగంగా చెరువు గట్టున దొరికిన కొంత సోడియమ్ పాలి అక్రిలేట్ పౌడర్‌ను ఎవరికీ కనిపించకుండా గ్లాస్లో నేను సేకరించా. ఈ క్రమంలోనే ఆ తెల్లని ఇసుక మీద పోలీసు జీపు టైర్ మార్కులు కనిపించాయ్. అలాగే, షూ ముద్రలను కూడా చూశా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? పోలీసు జీపులో సోడియమ్ పాలి అక్రిలేట్ బస్తాలను తెచ్చారు. అయితే, టైర్ ముద్రలు పడతాయని గ్రహించలేకపోయారు’ అంటూ రుద్ర బాంబు పేల్చాడు. దీంతో అందరూ రామస్వామి వైపునకు అనుమానంగా చూస్తూ ఉండిపోయారు. అందరూ ఒక్కసారిగా చూడటంతో ఆ అవమానాన్ని తట్టుకోలేక నేలపై కూలబడిపోయాడు రామస్వామి.
‘ఆంటీ.. అమాయకులమీద నిందలు వేయడం నాకు రాదు. మనం ఊహించినదానికంటే చాలా పెద్ద కుట్ర ఇక్కడ రహస్యంగా జరుగుతుంది. మన డిపార్ట్మెంట్లో మనతో వెన్నంటి ఉన్న వ్యక్తులే ఇంతకాలం మనల్ని మోసం చేశారు. ఆ అమాయక బాలికను కూడా చంపించడంలో ఓ పెద్ద కుట్ర ఉంది. నారాయణాద్రుల స్వామీజీని నేను అరెస్ట్ చేసి నిజాలను బయటకు రాబడతాననే భయంతోనే..’ అంటూ రుద్ర చెప్తున్నాడో లేదో.. అప్పటివరకూ బాధగా ఉన్న ఓ వ్యక్తి.. గట్టిగా నవ్వాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘వావ్.. రుద్ర! నీ తెలివితేటలు అమోఘం. మొత్తానికి నల్లమల డెత్గేమ్ను ఎవరు ఆడిస్తున్నారో చక్కగా కనిపెట్టావ్. ఎస్ యువార్ రైట్. ఆ వ్యక్తిని నేనే. అయితే, కొంచెం ఆలస్యం చేశావ్. దాని ఫలితమే.. ఇప్పుడు మీ అందర్నీ నేను నా స్థావరానికి తీసుకుపోతున్నా’ అంటూ రుద్ర టీమ్‌ను తన అనుచరుల సాయంతో ఆ వ్యక్తి బంధించాడు. జరిగిన పరిణామానికి అందరూ షాకయ్యారు. ఇంతకీ, నల్లమల డెత్గేమ్ను ఎవరు ఆడిస్తున్నారో మీరు కనిపెట్టారా?
…? రాజశేఖర్ కడవేర్గు