(వీడిన నల్లమల రహస్యం)
కరెక్ట్ స్విచ్‌ను కనిపెట్టడంతో డెన్ తలుపులు ఓపెన్ అయ్యి ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్ బయటపడ్డారు. వాళ్లు బయటకు వచ్చారో లేదో.. రుద్ర కాలికి ఏదో తీగ తగిలి బయట ఉన్న ఇంకేదో డివైజ్ యాక్టివేట్ అయ్యింది. అందులో నుంచి శివుడి గొంతుతో వాయిస్ ఓవర్ ఇలా వచ్చింది. ‘రుద్ర సారూ. నమస్కారం. ఇప్పుడు నా మాటలు మీరు వింటున్నారంటే.. శరత్ సార్ పజిల్‌ను పరిష్కరించి మీరు బయటకు వచ్చారన్న మాట’ అంటూ సాగిపోయింది.
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా మీతోనే ఉన్నా. చదువురాని వాడిని. అయితే, నాకు కూడా కాస్తో కూస్తో తెలివితేటలు ఉన్నాయి. అందుకే, ఇంతకాలం మీతో తిరిగినా.. మీరు నన్ను కనిపెట్టలేకపోయారు. ఇన్నాళ్లూ మీతో శరత్ సార్ గేమ్ ఆడటం, మీరు, మీ సభ్యులు శరత్ సారు అడిగిన ప్రశ్నలకు కంగారు పడటం చూసిన నాకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. అయితే, శరత్ సారును మీరు ఓడించడాన్ని తట్టుకోలేకపోయా. అందుకే, మీ తెలివికి నేను కూడా ఓ పరీక్ష పెట్టాలనుకొన్నా. చనిపోయిన వాడు ఎలా పరీక్ష పెడతాడు? అనే పిచ్చి ప్రశ్నలు వద్దు. చనిపోయిన శరత్ సారు ఎలా మిమ్మల్ని ఇరకాటంలో పెట్టాడో.. నేను కూడా అలాగే! ఇక, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీరు తప్పుగా సమాధానం చెప్తే.. మీకూ, మీ టీమ్ వాళ్లకు ఏమీకాదు. అయితే, మీ ముందు చెట్టుకు వేలాడదీసిన స్పృహలేని ఆ 9 మంది అమాయకపు ఆడపిల్లలకే ప్రమాదం. మీరు సమాధానం తప్పుగా చెప్పిన మరుక్షణం.. విషం పూసిన బాణాలు వాళ్ల గుండెల్లో దిగుతాయి. అలా జరుగకూడదనుకొంటే.. నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చి.. ఒకే వయసు, ఒకే ఎత్తు ఉన్న ఆ తొమ్మిది మంది ఆడపిల్లలను కాపాడుకోండి. మీకు 2 నిమిషాల సమయం మాత్రమే ఇస్తున్నా..
మిమ్మల్ని అడుగుతున్న చిక్కు ప్రశ్న ఏమిటంటే.. చెట్టుకు వేలాడుతూ చూడటానికి ఒకేలా కనిపిస్తున్న ఈ తొమ్మిది మంది పిల్లల్లో 8 మంది బరువు సమానంగా ఉంది. ఒక్క ఆడపిల్ల బరువు మాత్రం మిగతావారి కంటే 300 గ్రాములు తక్కువగా ఉంది. వాళ్లను తూచేందుకు చెట్టు కింద బరువును తూచే పెద్ద త్రాసును ఉంచా. రెండుసార్లు మాత్రమే ఈ త్రాసు పనిచేస్తుంది. ఆలోపు తక్కువ బరువు ఉన్న అమ్మాయిని మీరు కనిపెట్టాలి. 2 నిమిషాలు దాటినా.. త్రాసును మూడోసారి వాడినా.. సరైన అమ్మాయిని గుర్తించలేకపోయినా.. ఆ మరుక్షణమే విషం పూసిన తొమ్మిది బాణాలు ఈ 9 మంది ఆడబిడ్డల గొంతుల్లోకి దూసుకుపోతాయి. అన్నట్టు తప్పు సమాధానం చెప్పినప్పటికీ మీకు మీ టీమ్ సభ్యులకు ఏమీ కాదు. ‘అదేంటీ? తప్పు సమాధానం ఇచ్చినప్పటికీ.. చంపకుండా వీడు మనకు వరం ఇస్తున్నాడేంటీ అనుకోవద్దు. పిల్లలను కాపాడలేకపోయామన్న బాధతో మీరు బతికినంతకాలం చావాలి. నన్ను.. నా శరత్‌ను విడగొట్టిన మీకు నేను వేస్తున్న శిక్ష ఇది. సెలవు’ అంటూ శివుడి వాయిస్ ఆగిపోయి.. టైమ్ స్టార్టయ్యింది.
వెంటనే.. పిల్లలను చెట్టు మీద నుంచి కిందకు దించి మెషీన్ దగ్గరకు తీసుకురమ్మని కానిస్టేబుల్స్‌ను పురమాయించాడు రుద్ర. పిల్లలను కానిస్టేబుల్స్ దించుతుండగా.. ‘ఒరేయ్..తక్కువ బరువు ఉన్న అమ్మాయిని కనిపెట్టాలంటే, 9 మందిని తూచాలి. అయితే, త్రాసుతో తూచడానికి మనకు రెండుసార్లే చాన్స్ ఉంది. ఎలా చేద్దాంరా’ అంటూ స్నేహిల్ ఆందోళన చెందుతుండగా.. ‘ఒరేయ్.. రుద్ర. మనకు ఏమైనా పర్వాలేదు. పాపం.. ఆ పిల్లలను ఎలాగైనా కాపాడాలిరా..’ అంటూ ఫోరెన్సిక్ ఇంచార్జీ జయ అంటుండగానే.. ‘రుద్ర బాబూ.. ఎలాగైనా వాళ్లను కాపాడండి’ అంటూ గద్గద స్వరంతో జతకలిశాడు రామస్వామి.
ఏం చేయాలో అర్థంకాక ఆకాశంలోకి చూశాడు రుద్ర. శివుడి నుదుట కనిపించే మూడు రేఖలను పోలినట్టు వెండి రంగులో మేఘాలు కనిపించాయి. అంతే.. రుద్ర మెదడులో ఓ మెరుపులాంటి ఆలోచన. ‘ఈ పిల్లలను బలి తీసుకోవాలని కోరుకొన్న ఆ శివుడి దుష్టకోరికను ఆ పరమశివుడు అడ్డుకోబోతున్నాడు. మేఘాల రూపంలో దారిచూపాడు’ అంటూ రుద్ర గట్టిగా అరిచాడు. తనకు వచ్చిన ఐడియాను టీమ్ మెంబర్స్‌తో పంచుకోగానే అందరూ ‘ఓం.. నమశ్శివాయ..!’ అంటూ ఆకాశాన్ని చూస్తూ చేతులు జోడించి దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. ఆశ్చర్యం. మేఘాల రూపంలో ఆ మహాదేవుడు చూయించిన దారితో శివుడు ఇచ్చిన చిక్కు ప్రశ్నను రుద్ర ఎంతో సునాయాసంగా ఛేదించాడు. అలా 9 మంది ఆడపిల్లలను కాపాడాడు. టీమ్ అందరూ ఎంతో సంబురపడ్డారు. ఇంతలో రామస్వామి మాట్లాడుతూ.. ‘రుద్ర బాబూ.. దెయ్యాలు ఉన్నాయేమో తెలుసుకొందామని నల్లమలకు వచ్చాం. అయితే..’ అంటూ రామస్వామి పూర్తిచేయకముందే.. ‘దెయ్యం కనిపించలేదు గానీ.. మేఘాల రూపంలో పరమశివుడు సాక్షాత్కారమయ్యాడు’ అంటూ స్నేహిల్ అన్నాడు. అంతే, అక్కడ నవ్వులు విరబూశాయి. నల్లమల రహస్యాన్ని ఛేదించిన రుద్ర అండ్ టీమ్ ఆ సమాచారాన్ని, శివరత్ సృష్టించిన మారణహోమాన్ని డీసీపీ సత్యనారాయణకు ఫోన్లో వివరంగా చెప్పారు. ఆ తర్వాత టీమ్‌తో కలిసి హైదరాబాద్‌కు బయల్దేరాడు రుద్ర. అది పక్కనబెడితే, తక్కువ బరువు ఉన్న అమ్మాయిని రుద్ర ఎలా గుర్తించాడో కనిపెట్టారా?
పెద్ద త్రాసులో రెండు సార్లు మాత్రమే తూకం వేయడానికి అవకాశం ఉంది. దీంతో 9 మంది అమ్మాయిలను మూడు గ్రూప్‌లు అంటే ఏ, బీ, సీగా విభజించాడు రుద్ర. శివుడి నుదుటి రేఖల్లా ఆకాశంలో కనిపించిన మేఘాలను చూశాకే రుద్రకు ఈ ఆలోచన తట్టింది. అంతే.. తొలుత ఏ గ్రూప్, బీ గ్రూప్‌ను తూకం వేశాడు రుద్ర. త్రాసులోని పళ్లాలు సమానంగా ఉండటంతో తక్కువ బరువు ఉన్న అమ్మాయి సీ గ్రూప్‌లో ఉన్నట్టు గుర్తించాడు. రెండోసారి తూకం వేయడానికి సీ గ్రూప్‌లోని ఇద్దరు అమ్మాయిలను ఎంచుకొని తూకం వేశాడు. ఇద్దరూ సమాన బరువు ఉన్నారు. దీంతో మిగిలిన అమ్మాయే బరువు తక్కువగా ఉన్న బాలిక అని గుర్తించాడు రుద్ర.