రుద్ర కరెక్ట్ సమాధానం చెప్పడంతో ఆగంతకుడు హనీని విడిచిపెట్టాడు. రుద్ర బృందం ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లింది. హనీ కాస్త తేరుకున్నాక.. అసలేం జరిగిందంటూ ప్రశ్నించింది. ‘సార్.. నిన్న సాయంత్రం యోగా క్లాస్ నుంచి ఇంటికి బయల్దేరా. రోజూ స్కూటీ తీసుకొచ్చేదాన్నే. అయితే, కాస్త వాకింగ్ చేద్దామని ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తున్నా.. ఇంతలో ఓ కారు నా ముందు ఆగింది. అందులోంచి ఓ పాప దిగింది. ఎక్కడికి వెళ్లాలి? అంటూ చేతులతో సైగ చేసింది. నేను ఆ పాప చేయిని అలాగే చూస్తూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకొన్నా’ చెప్తూ ఆగిపోయింది హనీ.
‘తర్వాత?’ కాస్త టెన్షన్‌గా అడిగాడు రుద్ర. ‘కండ్లు తెరిచేసరికి నాతోపాటు మరో ముగ్గురు అమ్మాయిలు ఓ మూతబడ్డ ఫ్యాక్టరీలో కట్టేసి కనిపించారు. కొద్దిసేపయ్యాక ఆ పాప మళ్లీ నా దగ్గరికి వచ్చింది. ముఖంమీద ఉన్న బుర్ఖాను చేతితో తీయబోతూ చేతులతో ఏదో సైగ చేయబోతుండగా.. నేను నిద్రలోకి జారిపోయా.. తర్వాత నెక్లెస్ రోడ్డు మీద ఉన్నా’ అంటూ ఆందోళనగా చెప్పింది హనీ.
‘మీతోపాటు ఆ ఫ్యాక్టరీలో ఉన్న అమ్మాయిలు మీకు ముందే తెలుసా?’ అంటూ రుద్ర అడిగిన ప్రశ్నకు తెలియదన్నట్టు తలాడించింది హనీ. సీసీటీవీలో రికార్డ్ అయిన బుర్ఖా పాప ఫుటేజీని హనీకి రుద్ర చూపించాడు. తనను కిడ్నాప్ చేసింది ఆ పాపేనని హనీ నిర్ధారించింది. ‘పదేండ్లు కూడా లేని ఈ చిన్నపాప తనకంటే పెద్దవారైన నలుగురు అమ్మాయిలను ఎలా కిడ్నాప్ చేయగలిగింది? పజిల్స్‌తో పోలీసులనే ఎలా ఆడిస్తుంది? ఈ తతంగం వెనుక కచ్చితంగా ఎవరో ఉన్నారు’ అంటూ మనసులో అనుకున్న రుద్ర.. హనీని ఇంటిదగ్గర దిగబెట్టమని కానిస్టేబుల్‌ను పురమాయించాడు. హనీ ఇంటికి వెళ్లడానికి బయల్దేరుతుండగా ఆమె చేతి బ్యాగ్ జిప్ కాస్త తెరిచి ఉండటాన్ని చూసిన రుద్ర.. హనీని ఆగమన్నాడు.
‘ఒకసారి మీ బ్యాగ్‌లో ఏముందో చూడొచ్చా?’ హనీని అడిగాడు రుద్ర. సరేనంటూ బ్యాగ్ ఇచ్చింది. అందులో ఓ చీటీ కనిపించింది. దాన్ని తెరుస్తున్న రుద్ర ముఖంలో ఒకింత ఆందోళన కనిపిస్తున్నది. రామస్వామి సహా కానిస్టేబుల్స్ అందరి గుండెలు పరిగెత్తసాగాయి. ‘హలో రుద్రా! మొత్తానికి ఒక అమ్మాయిని కాపాడేశావ్. రెండో అమ్మాయిని కాపాడే క్లూ నీకు కావాలంటే నేను ఇస్తున్న పజిల్‌ను సాల్వ్ చెయ్యి. ఈ చీటీతో పాటే హనీ బ్యాగ్‌లో నా ఫొటో పెట్టాను. మెడ నుంచి పొట్ట వరకు మాత్రమే ఆ ఫొటోలో కనిపిస్తాను. టైటానిక్‌లో హీరో-హీరోయిన్లు చేతులు చాచిన పోజులో నేను కూడా భలేగా ఉన్నాను కదూ. ఇప్పుడు నీకు పజిల్ ఏంటంటే? ‘నా హైట్ ఎంత?’ నిన్ను ఎక్కువ కష్టపెట్టకుండా.. రెండు ఆప్షన్లతోపాటు మరో క్లూ కూడా ఇస్తాను. మొదటి ఆప్షన్ నా హైట్ ఆరడుగులు. రెండో ఆప్షన్ నా హైట్ మూడడుగులు. నీకు ఇస్తున్న క్లూ.. నువ్వు సేకరించిన సీసీటీవీ పుటేజీలో కనిపించిన బుర్ఖా పాపను కూడా నేనే! ఇంకో విషయం..
ఈ రోజు సాయంత్రం 4 గంటలలోపు నా హైట్ ఎంతో కరెక్ట్‌గా చెప్పాలి. తప్పు చెప్తే, సంపూర్ణ ఆహారాన్ని ఆమె తన జీవితంలో ఎప్పటికీ తినలేదు. ఆన్సర్‌ను ఫ్లెక్సీ కొట్టించి ఎక్కడ డిస్ప్లే చెయ్యాలో తెలుసా? సిటీలో సెలెబ్రిటీలు ఉండే ప్రాంతం పేరునే ఆ బస్టాండ్‌కు పెట్టారు. అయితే, ఆ బస్టాండ్ మాత్రం సెలెబ్రిటీలు ఉండే ప్రాంతంలో కాకుండా వేరేచోట ఉంటుంది. ఆ బిల్డింగ్ మీద ఆ ఫ్లెక్సీని వేలాడదీయ్.. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ..’ అని రాసి ఉంది. చీటీ చదివిన రుద్ర ఒక్కసారిగా కుర్చీలో కూలబడిపోయాడు. అప్పటికే సమయం 2 గంటలు దాటింది. ఇంకో రెండు గంటల్లో సైకో పజిల్స్ సాల్వ్ చేయాలి.
ఎలా అంటూ ఆలోచిస్తున్న రుద్రతో.. ‘సార్.. ఆ సైకో పాప చాలా తెలివైన వ్యక్తి అనుకున్నా. కానీ, ఇంత ఈజీగా బురిడీ కొట్టించవచ్చని అనుకోలేదు. ఆమె హైట్ మూడడుగులు అని సీసీటీవీ ఫుటేజీని చూస్తే ఎవరైనా చెప్తారు. ఇదో పజిల్.. దాన్ని మనం సాల్వ్ చేయడమూ..’ అంటూ సన్నగా నవ్విన రామస్వామి.. ‘మూడు అడుగులు’ అంటూ ఫ్లెక్సీ కొట్టించమని ఓ కానిస్టేబుల్‌ను పురమాయించాడు. ఇంతలో జోక్యం చేసుకొన్న రుద్ర.. ‘హనీ.. నువ్వు స్పృహకోల్పోయే ముందు ఆ పాప చేతులను అలాగే చూస్తూ ఉన్నా అన్నావుగా.. ఎందుకు?’ అని ప్రశ్నించాడు. ‘ఏమో సార్.. ఆ పాప చేతులు మాత్రం మనలాగే చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే అలాగే పరీక్షగా చూస్తూ ఉండిపోయా’ అంటూ హనీ బదులిచ్చింది.
‘బాబాయ్.. సైకో హైట్ మూడడుగులు కాదు. ఆరడుగులు. అపూర్వ సహోదరులు సినిమాలో కమల్‌హాసన్ మోకాళ్లవరకూ కాళ్లను మడతబెట్టి మరుగుజ్జులాగా కనికట్టు చేసినట్టే.. ఈ సైకో కూడా మనల్ని చిన్న పాపలాగా బుర్ఖా వేసుకొని పక్కదారి పట్టించాడు. పొడవాటి చేతులు చాచిన ఈ ఫొటోలోని సైకోను చూడు’ అంటూ ఆ ఫొటోను రామస్వామికి చూయించాడు. సీసీటీవీ ఫుటేజీలో 3 అడుగులు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్న సైకో హైట్ ఆరడుగులని రుద్ర ధ్రువీకరించడం.. అదీ మెడ నుంచి పొట్టవరకు మాత్రమే కేవలం చేతులు మాత్రమే కనిపిస్తున్న ఫొటోను కీలక ప్రూఫ్‌గా రుద్ర భావిస్తుండటం రామస్వామితోపాటు మిగతా కానిస్టేబుల్స్‌కు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా అనిపించింది. దీంతో రామస్వామి కాస్త ధైర్యం తెచ్చుకొని.. ‘రుద్ర బాబూ.. మీరు బాబాయ్ అంటూ ప్రేమగా పిలుస్తారన్న చనువుతో చెప్తున్నా.
ఇది ఓ అమ్మాయి ప్రాణానికి సంబంధించిన విషయం. ప్రతీసారి మీరే కరెక్ట్ అనుకోవడం పొరపాటు కూడా కావొచ్చు’ అంటూ భయంగానే చెప్పాడు. ‘బాబాయ్.. బందీలుగా ఉన్న ఆ ముగ్గురు నాకు చెల్లెళ్ల లాంటివారే. ఓ అన్నగానే కాదు ప్రజలను రక్షించే పోలీసుగా వారిని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ సైకో హైట్ ఆరడుగులు. ఫ్లెక్సీ కొట్టించండి. మనకు సమయంలేదు. వెంటనే మిల్కీని కాపాడాలి. త్వరగా బస్టాండ్‌కు పదండి’ అంటూ కానిస్టేబుల్స్‌ను ఆదేశించాడు. చేసేదేమీలేక రామస్వామి అండ్ కో గమ్యస్థానానికి కదిలారు.
అప్పటికే సమయం మధ్యాహ్నం 3.50 కావొస్తోంది. ‘ఆరడుగులు’ అంటూ కొట్టించిన ఫ్లెక్సీని రుద్ర బస్టాండ్ మీద వేలాడదీశాడు. సమయం నాలుగు గంటలు కాగానే ఓ కారు బస్టాండ్ ఎంట్రెన్స్ దగ్గరికి వచ్చి ఆగింది. మిల్కీని దించేసి వెళ్తున్న ఆ కారును అప్పటికే అక్కడ కాపలాగా ఉన్న పోలీసులు పట్టుకొన్నారు. రుద్ర ముఖంలో నవ్వు కనిపించింది. కాగా, సైకో హైట్ ఆరడుగులు అని రుద్ర అంత కరెక్ట్‌గా ఎలా కనిపెట్టాడు? సైకో నెక్ట్స్ టార్గెట్ మిల్కీ అని రుద్ర ఎలా పసిగట్టాడు? ఇంతకీ రుద్ర ఆ ఫ్లెక్సీని ఏ బస్టాండ్‌లో వేలాడదీసినట్టు? మీరు చెప్పగలరా???
ఎవరైనా మనుషులు వ్యతిరేక దిశలో చేతులు దూరంగా చాపితే, ఆ రెండు చేతుల మధ్య దూరం ఆ మనిషి హైట్‌కు సమానంగా ఉంటుంది. ఫొటోలో సైకో చాచిన చేతుల మధ్య దూరం మూడడుగులకు డబుల్‌గా ఉండటంతో రుద్రకు డౌట్ వచ్చింది. దాన్ని నిర్ధారించుకోవడానికే హనీని చేతుల విషయం అడిగాడు. సీసీటీవీలోనూ గమనించాడు. పైగా.. సైకో ఆప్షన్లో ఆరడుగులు అని కూడా హింట్ ఇవ్వడంతో దానికే రుద్ర ఫిక్స్ అయ్యాడు. ఇక, రుద్ర ఫ్లెక్సీ వేలాడదీసిన బస్టాండ్ ‘జూబ్లీ బస్టాండ్’. పేరులో జూబ్లీ ఉన్నప్పటికీ, ఈ బస్టాండ్ జూబ్లీహిల్స్‌లో కాకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుంది. అందుకే అదే సైకో చెప్పిన స్పాట్‌గా రుద్ర ఫిక్స్ అయ్యాడు. ఇక, సైకో చీటీలో.. ‘సంపూర్ణ ఆహారాన్ని ఆ మరుక్షణం నుంచి ఆమె తన జీవితంలో అస్సలు తినలేదు’ అంటూ రాశాడు. పాలను (మిల్క్) సంపూర్ణ ఆహారం (కంప్లీట్ ఫుడ్) అంటారు. దీన్నిబట్టే సైకో నెక్ట్స్ టార్గెట్ మిల్కీ అని రుద్ర ఈజీగా కనిపెట్టాడు. కాగా, పోలీసులకు కిడ్నాపర్ కారు దొరకడంతో రుద్ర దర్యాప్తును ముమ్మరం చేశాడు.
– రాజశేఖర్ కడవేర్గు