ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన సహజం. కానీ, జీవితమే సమస్యగా తోచేంత తీవ్ర ఆందోళన ఉంటే మాత్రం చికిత్స తప్పనిసరి. ఇలాంటి‘యాంగ్జయిటీ సిండ్రోమ్’ ఉన్నప్పుడు సుదీర్ఘమైన మానసిక వైద్యమే దిక్కు. అది కూడా ఎంతవరకు ఫలితం చూపుతుందో చెప్పలేం. చికిత్స ఖరీదూ ఎక్కువే. ఇందుకు ఓ సులభమైన ఉపాయం ఉందని అంటున్నారు గోథెన్ బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఓమోస్తరు నుంచి కఠిన వ్యాయామం చేసినప్పుడు.. ఆందోళన
తీవ్రత తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు వారు దాదాపు 300 మంది అభ్యర్థులను ఎంచుకున్నారు. వీరిలో సగం మంది కనీసం పదేండ్ల నుంచీ ఆందోళనతో బాధపడుతున్నవారే. దాదాపు 12 వారాల పాటు క్రమం తప్పకుండా వీరితో వ్యాయామం చేయించారు. ఆశ్చర్యకరంగా… ఆయా వ్యక్తులలో ఆందోళన పాలు తగ్గినట్టు తేలింది. పైగా సాధారణ వ్యాయామం చేసినవారికంటే, కాస్త కఠినమైన వ్యాయామం చేసినవారిలో మరిన్ని సత్ఫలితాలు కనిపించాయి. శరీరం ఓ హార్మోన్ల కుంపటి కాబట్టి… శారీరక పరిస్థితులు, ఉద్వేగాల మీద కచ్చితమైన ప్రభావం చూపుతాయి. అదే ఈ ఫలితాలకు కారణమని అంటున్నారు పరిశోధకులు.