ఎత్తయిన కొండలు.. అందమైన పచ్చిక బయళ్లు.. ఎటుచూసినా ఆహ్లాదకరమైన వాతావరణం. చల్లని పిల్లగాలులు గిలిగింతలు పెట్టేవేళ.. నచ్చిన ఆహారం తింటూ, నిశీధిలోని నక్షత్రాలను లెక్కిస్తూ ఉంటే.. ఆ అనుభూతి వర్ణనాతీతం. ఇప్పటివరకూ పండు వెన్నెలను ఆస్వాదిస్తూ మిద్దెలమీద, మంచాలపై పడుకొని చుక్కలు లెక్కబెట్టిన వారంతా.. ఆసక్తి ఉంటే ఉత్తరాఖండ్‌లోని చమోలికి వెళ్లి పెద్దపెద్ద టెలిస్కోపులతో వింతైన తారలను దగ్గరినుంచీ చూడొచ్చు. కొత్తవీ కనుక్కోవచ్చు.
అంతరిక్షం ఓ చిక్కుముడి. ఈ సువిశాల విశ్వంలో మనం ఎక్కడున్నామో.. ఇతర గ్రహాలు ఎక్కడున్నాయో? ఆ గ్రహాల్లో జీవరాశి ఉందో లేదో?.. అన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలే. అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ‘ఖగోళ పర్యాటకం’ (ఆస్ట్రో టూరిజం) వైపు అడుగులు వేస్తున్నది. ఎత్తయిన కొండలపై కొత్త తరహా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నది. మరింతమందిని ఆకర్షించేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీ’లు ఏర్పాటు చేస్తూ.. వేలాది నక్షత్రాలను దగ్గరి నుంచీ చూసే భాగ్యాన్ని కల్పిస్తున్నది. ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్తే మీరూ ఓ కొత్త నక్షత్రాన్ని కనుక్కోవచ్చు.
నాలుగు ప్రదేశాలను ‘ఖగోళ గ్రామాలు’గా మారుస్తున్నది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. వీటిల్లో బేనీతాల్, నైనీతాల్ సమీపంలోని తక్లూలా, దేవస్థల్ గ్రామాలు, అల్మోరాలోని బిన్సర్ వన్యప్రాణుల అభయారణ్యం, ముస్సోరి జార్జ్ ఎవరెస్ట్ ఎస్టేట్ సమీపంలోని కార్టోగ్రఫీ మ్యూజియాలను నక్షత్ర వీక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. పెద్ద పెద్ద టెలిస్కోప్‌లు, రాత్రిళ్లు ఆకాశాన్ని స్పష్టంగా చూడగలిగే ‘నైట్‌విజన్’ గోపురాలను నిర్మిస్తున్నారు. ఖగోళ పర్యాటకుల కోసం ప్రత్యేకంగా గుడిసెలు ఏర్పాటు చేస్తున్నారు. రుచికరమైన భోజనాలు ఉంటాయి, సంగీత కచేరీలు నిర్వహిస్తారు.
ఖగోళ పర్యాటకులను ఆకట్టుకునేందుకు బేనీతాల్లో ఈమధ్య ‘ఆస్ట్రో విలేజ్ పార్టీ’లు నిర్వహించారు. సరస్సులు, పండ్లతోటలు, ఫిషింగ్ స్పాట్ల మధ్య పార్టీకి వచ్చిన పర్యాటకులు సేదదీరారు. నక్షత్రాలను అతి దగ్గరగా చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఫోన్లలో ఎన్నో వింతలను బంధించారు. నక్షత్రాలను, నక్షత్రరాశులను ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు.
ఈ సరికొత్త ఆలోచనకు ఆద్యుడు ఖగోళశాస్త్ర అభిమాని, ఫొటోగ్రాఫర్ రామాశిశ్ రే. ఈయన 2015లో ‘స్టార్ స్కేప్స్’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. భీమ్‌తాల్‌లో ఖగోళ వేధశాలను, బాగేశ్వర్ జిల్లా కౌసాని దగ్గర మరో వేధశాలను ఏర్పాటుచేశాడు. అదే అనుభూతిని ఔత్సాహికులకు అందించాలని ‘ఖగోళ పర్యాటకం’ ఆలోచనను ప్రభుత్వం ముందుంచాడు. ప్రభుత్వం కూడా సరేననడంతో నాలుగు ఖగోళ గ్రామాలను ఏర్పాటు చేస్తున్నారు. మున్ముందు ఖగోళ వేడుకలకు ఆదరణ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు రామాశిశ్ రే. ఓ కొత్తలోకంలో ప్రవేశిం చాలని ఎవరు మాత్రం కోరుకోరు?