దర్శనం-నిదర్శనం
సీ॥ మెఱుపు చెంగటనున్న మెఱుగారు మ్రబ్బుమై సొగసుగా డాల్ నేలచూలి మెరయ కుందనపుందళుకుల తీరుమై చాయ లక్ష్మనుండొకవంక లలిని జూప హొంబట్టు పుట్టంబు హొయలైన రెట్టెంబు భుజముపై మొలయందు పొల్పుదెల్ప చందురు బురణింపజాలు నెమ్మొగము పై నుదుటి బొట్టింతయునుమ్మలింప
సీ॥ మెఱుపు చెంగటనున్న మెఱుగారు మ్రబ్బుమై
సొగసుగా డాల్ నేలచూలి మెరయ
కుందనపుందళుకుల తీరుమై చాయ
లక్ష్మనుండొకవంక లలిని జూప
హొంబట్టు పుట్టంబు హొయలైన రెట్టెంబు
భుజముపై మొలయందు పొల్పుదెల్ప
చందురు బురణింపజాలు నెమ్మొగము పై
నుదుటి బొట్టింతయునుమ్మలింప
తే॥ హొన్ను బొమ్మడికముదల నొఱుపు దెలుప
గండపెండేరమందెల నిండు తేజు
లడుగుదమ్ముల హవళింప జెడని ఠీవి
కన్నులకు గానబడియె ముంగలను కలను
ఈ పద్యం కవినాథ నల్లంతిఘళ్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనరసింహాచార్యుల శుద్ధాంధ్ర రామాయణ సంగ్రహం అనే అచ్చతెనుగు పద్య కావ్యంలోనిది. వీరు సుప్రసిద్ధ కవివరేణ్యులు, పండితులు డాక్టర్ కోవెల సుప్రసన్నాచార్యుల మాతామహులు. శ్రీ కైవల్య పదము తప్ప వేరేదీ ఆశించని కవినాథ ఠంయాల గారు అచ్చతెనుగు కావ్యాలు, నిరోష్ట్యము, నిర్వచనము, ప్రబంధము, క్షేత్ర మాహాత్మ్యం, నాటకం, యక్షగానం, అష్ట ప్రహరి, శతకాలు, తిరునామాలు.. మొదలగు వివిధ ప్రక్రియల్లో దాదాపు 30 రచనలు చేశారు. శ్రీవైష్ణవ సంప్రదాయ తాత్త్విక అంశాలు, ఓరుగంటి నాటి సాంఘిక చరిత్ర వీరి కావ్యాలలో కనిపిస్తాయి. సింగరాచార్యుల అర్చిరాది ప్రబంధం ద్విపద ఇప్పుడు అలభ్యం.
‘మెరుపు చెంగటనున్న మేఘంబు కైవడి’ అనే భాగవత పద్యాన్ని పోలిన ఈ పద్యం ఆచార్యుల వారు అచ్చ తెనుగు కబ్బము అల్లాలి అనుకున్నప్పుడు స్వప్నంలో శ్రీ సీతారామచంద్రమూర్తి అమ్మవారితో, లక్ష్మణునితో సహా కవికి ప్రత్యక్షమైన సన్నివేశం. ఇది ఒక దివ్య అనుభూతి ఆవిష్కృతమైన అలౌకిక భావన. ఆచార్యుల మనోవీధిలో స్వామి దర్శనభాగ్యం మహత్తరమై వారి అనన్య ఆధ్యాత్మికతకు, కాంక్షించిన శరణాగతికి సాక్ష్యమై నిలిచింది. ఈ భావనే వారితో ఈ కావ్యాన్ని అలవోకగా రాయించింది.
స్వామి ముగ్ధమోహన సౌందర్యం కవిని ఆశ్చర్యంలోనూ, ఆనందంలోనూ ముంచెత్తింది. ముందు అమ్మవారిని దర్శించారు. నేల చూలి అంటూ, ఆకాశంలో విద్యుల్లతలాగా అమ్మవారు సొగసుతో మెరిసిపోయారు. లలిత దేహ విభవంతో లక్ష్మణుడు బంగారు తళుకుల ఛాయలీనుతున్నాడు. హొంబట్టు పుట్టము (పట్టువస్త్రం) స్వామి భుజముల నుంచి హొయలు జూపుతూ జాలువారుతున్నది. పురణింప, ఉమ్మలింప లాంటి అందమైన తెలుగు పదాలతో నాలుగో పాదం విలసిల్లింది. చందురుడిని మించిన సొగసుతో గల నెమ్మొగముపై బొట్టు తళతళలాడింది. కానీ, ఉమ్మలింప అంటే బాధ, దుఃఖం అని నిఘంటు అర్థం. అది ఇక్కడ ఎలా పొసగిందో కొంత ఆలోచించాలి.
హొన్ను అంటే బంగారం. ఇక కాలియందెల గండపెండేరాలు నిండుగా వెలుగగా, అడుగుదమ్ములు (పాద పద్మాలు) హవళించ (ఒప్పగా) చెడని ఠీవిని స్వామి కన్నులకు కనబడ్డారు. చెడని ఠీవి అనడంలో స్వామి వారి నిత్యవైభవం గోచరిస్తుంది. అది కవిగారికి అనుభవైకవేద్యం. సకల భువనాలు నిండిన శాశ్వత మహద్వైభవం. ఇలాంటి రమణీయమైన పద్యమణిహారమై ఈ అచ్చతెనుగు కబ్బం పఠితులను ఆనందాశ్చర్యాలకు లోనుచేస్తూ పఠింపజేస్తుంది.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

