హైదరాబాద్ సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన మెట్రో ఫేజ్-1పై ఉన్న రూ.13,600 కోట్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌తో ఒప్పందం చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఐఆర్ఎఫ్సీ ప్రతినిధులను కలిసి రుణ మంజూరుకు అంగీకారపత్రాలను అందజేశారు. దీంతో ఎల్అండ్టీ నుంచి హెచ్ఎంఆర్ఎల్కు బదిలీ అయిన రూ.13,600 కోట్ల రుణాలను ఐఆర్ఎఫ్సీ నుంచి టర్మ్ లోన్‌గా తీసుకుంటున్నది. ఈ రుణం 20 ఏండ్ల పరిమితితో ప్రతి 3నెలలకోసారి వాయిదాలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని ఐఆర్ఎఫ్సీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఒప్పంద పత్రాలను బదిలీ చేసుకున్నారు.