‘మసాలా దోశకు ఆర్డర్ ఇస్తే ఉల్లి దోశ వడ్డిస్తావేందయ్యా’ అని వెయిటర్ని గద్దిస్తే.. ‘సారీ సార్..’ అంటూ వెనక్కి వెళ్తాడు వెయిటర్. కావాల్సిన దోశ తెచ్చి ఇస్తానంటాడు. సరే, అనుకుంటూ వెయిట్ చేస్తే.. మన టైమ్ వేస్ట్ అయిపోతుంది. మసాలా దోశ కోసం ఆశపడి అక్కడే కూర్చుంటే బతుకు ఆశ.. దోశ.. అప్పడం అయిపోద్ది. ‘ఒక పొరబాటుకు యుగములు పొగిలేవ’ని ఆత్రేయ అన్నట్టు కొందరు వెయిటర్లు అలవాటుగా చేసే పొరపాట్లు ఎన్నో అవకాశాలు చేజార్చొచ్చు. మనిషన్నాక మిస్టేక్స్ కామన్. కానీ, రోబో డిక్షనరీలోనే పొరపాటుకు చోటే లేదు. అందుకే, వెయిటర్లుగా రోబోలకు చోటిచ్చి జై కొడుతున్నారు కొరియన్లు.
దక్షిణ కొరియాలో గుమీ నగర పాలక సంస్థ కార్యాలయంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్న రోబో ఆత్మహత్య చేసుకుందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. గుమీ నగర పాలక సంస్థ ప్రచార కార్యక్రమాలు, కార్యాలయ విధుల నిర్వహణలో మాత్రమే కాదు, తరచి చూస్తే దక్షిణ కొరియాలో అన్ని రంగాల్లోనూ రోబోల వినియోగం విశేషంగా కనిపిస్తుంది. దక్షిణ కొరియాలో పారిశ్రామిక రంగంలో పదిమంది కార్మికులకు ఒకటి చొప్పున రోబోని ఉపయోగిస్తున్నారు. ఆటోమొబైల్ తయారీ రంగంలో ఎక్కువగా రోబోల వాడకం తెలిసిందే. రోబోలు యంత్రాల మాదిరిగానే పని ప్రదేశంలో ఒకేచోట ఉండి పనిచేస్తాయి. అయితే రెస్టారెంట్లలో వెయిటర్లుగా పనిచేసే రోబోలు అలా కాదు. కస్టమర్ అడిగింది తేవడానికి కిచెన్‌కి వెళ్తాయి. అక్కడ వండింది పట్టుకొచ్చి అడిగిన కస్టమర్‌కు కచ్చితంగా తెచ్చి పెడతాయి. ఇలా వచ్చిపోయే క్రమంలో పదార్థం నేలపాలు కాకుండా జాగ్రత్తగా మసలుకుంటాయి. ఇరుకుదారిలో చొరవగా కదలడం మనుషులకేమో గానీ.. ఈ సర్వర్ రోబోలకు పవర్‌తో పెట్టిన విద్య.
సౌత్ కొరియాలో ఉపయోగిస్తున్న రెస్టారెంట్ రోబోలు ఇరుకైన దారుల్లో తెలివిగా నడుస్తాయి. మూల మలుపుల్లో చటుక్కున మలుగుతాయి. హఠాత్తుగా ఎవరైనా అడ్డుపడితే చప్పున ఆగిపోతాయి. దారి వదిలేదాకా వినమ్రంగా వేచి ఉంటాయి. ఆ దారి ఇప్పటిలో అందుబాటులోకి రాదు అనుకుంటే.. తమ దారి మార్చుకొని ముందుకు సాగిపోతాయి. ఇలా సర్వర్ రోబోలు.. చీమల్లా తిరుగుతూనే ఉంటాయి. ఒకదానికొకటి ఎదురుపడ్డప్పుడు బెదురు చూపులు చూసుకోవు. ఏది తప్పుకోవాలో, ఏది సాగిపోవాలో ప్రోగ్రామింగ్ చూసుకుంటుంది. కాబట్టి.. బాహాబాహీకి అవకాశం ఉండదు. క్రమశిక్షణతో పనిచేసే ఈ రోబోలతో సర్వింగ్ సూపర్‌గా ఉందంటున్నారు రెస్టారెంట్ యజమానులు. వీటిని చూసేందుకు కూడా కస్టమర్లు వస్తున్నారనీ ఆనందంగా చెబుతున్నారు. సర్వర్ రోబోలకు వస్తున్న ఆదరణ చూసిన రెస్టారెంట్ల యజమానులు వేలం వెర్రిగా మరమనుషులకు ఆర్డర్ ఇస్తున్నారట. అందుకే, ప్రపంచంలో అత్యధిక రోబో సాంద్రత ఉన్న దేశంగా దక్షిణ కొరియా పేరు సాధించింది! రోబోల వినియోగంలో, రోబోల తయారీ, అభివృద్ధిలో ఆ దేశం దూసుకుపోవడానికి ఇదీ ఒక కారణం.
డైనింగ్ టేబుల్ మీద కూర్చోగానే సర్వర్ వచ్చినట్టే రోబో వచ్చేస్తుంది. ఆ రోబో మీద ఉన్న ట్యాబ్‌లో కావాల్సిన ఆహారాన్ని ఎంటర్ చేస్తే నేరుగా ఆర్డర్ కిచెన్‌కి చేరిపోతుంది. రోబో పాకశాలకు చేరుకునేలోపే.. అక్కడ వంటల తయారీ మొదలవుతుంది. ఆర్డర్ అయ్యే దాకా వేచి చూసే ఈ యంత్రుడు.. వంటకాలు పూర్తికాగానే వాటిని లోడ్ చేసుకొని హుటాహుటిన బయల్దేరుతాడు. దారి తప్పకుండా, మర్చిపోకుండా చకచకా నడుస్తూ వినియోగదారుడి టేబుల్ దగ్గరికి చేరుకుంటాడు. రోబో సర్వర్లు ఆర్డర్లు మార్చిన దాఖలాల్లేవని యజమానుల మాట. భారీ రెస్టారెంట్లలో మాత్రమే కాదు మెక్‌డొనాల్డ్ తిండి అంగళ్లలోనూ సర్వర్ రోబోలు కను‘విందు’ పంచుతున్నాయి. టేక్ అవేల్లో ఆర్డర్ల డెలివరీ కూడా ఈ రోబోలే చేస్తున్నాయ్.
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఆటోమేటిక్ కాఫీ మేకర్లు మన దగ్గర ఉన్నట్టుగానే జపాన్‌లో రోబో కాఫీ మేకర్లు కనిపిస్తాయ్. రెడీమిక్స్ని వేడి నీళ్లలో కలిపి ఇవ్వడం కాదు. కాఫీ షాప్‌లో వంట మనిషి ఎలా తయారు చేసి ఇస్తాడో అదే దీరుగా ఈ రోబోలు పని చేస్తాయి. కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ, షుగర్ లెస్ ఇలా ఎన్నో రకాల కాఫీలు వడివడిగా కాచి.. కస్టమర్లు ఎక్కువ సమయం వేచి ఉండకుండా సేవలు అందిస్తున్నాయి. కాఫీ వడగట్టి ఇచ్చిన తర్వాత.. గిన్నెను తళతళ మెరిసేలా కడిగి పక్కన పెడతాయి కూడా! ఎవరు, ఎంత కచ్చితంగా ప్రోగ్రామింగ్ చేశారో కానీ, డ్యూటీకి ఎక్కిన మరుక్షణం నుంచి ఈ మరమనుషులు అరమరికల్లేకుండా పనిలో అల్లుకుపోతున్నాయట. ఈ వింతలన్నీ చూస్తుంటే.. ప్రపంచవ్యాప్తంగా హోటళ్లలో రోబో సర్వర్లు ‘ఆర్డర్ ప్లీజ్..’ అనే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.