సైకలాజికల్ కౌన్సెలింగ్ గురించి సమాజంలో అనేక అపోహలు ఉన్నాయి. వీటి వల్ల చాలామంది అవసరమైనప్పుడు కూడా సహాయం తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఈ అపోహలను తొలగించి, వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అపోహల కారణంగా 50% మంది మానసిక సమస్యలను బయటికి చెప్పుకోవడానికి భయపడుతున్నారు. దీంతో 70 నుంచి 80 శాతం మందికి చికిత్స అందడం లేదు.
మన దేశంలో శారీరక ఆరోగ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం కౌన్సెలింగ్ పట్ల ఉన్న తప్పుడు అవగాహన. ప్రతీ పదిమందిలో ఇద్దరు మాత్రమే కౌన్సెలింగ్‌కి ముందుకు వస్తున్నారు. పిచ్చి అనే ముద్ర వేస్తారని 60 శాతం, గోప్యత భయంతో 25 శాతం, ఎక్కువ ఖర్చు అనే ఆలోచనతో 15 శాతం మంది కౌన్సెలింగ్‌కి దూరంగా ఉంటున్నారని ఓ సర్వేలో తేలింది. కౌన్సెలింగ్ చుట్టూ అల్లుకున్న కొన్ని అపోహలు ఇలా ఉన్నాయి.
వాస్తవం: ఇది అతిపెద్ద అపోహ. కౌన్సెలింగ్‌కు వెళ్లేవాళ్లు పిచ్చివారు కాదు. ఒత్తిడి, ఆందోళన, బంధాల్లో సమస్యలు, జీవితంలో తీసుకునే నిర్ణయాల పట్ల స్పష్టత లేని వారు కౌన్సెలింగ్ తీసుకుంటారు. జలుబు చేస్తే డాక్టరు దగ్గరకు వెళ్లినట్లే, మనసు ఇబ్బంది పడితే కౌన్సెలర్‌ను కలవడం సహజం.
వాస్తవం: కౌన్సెలర్లు మీకు ఏం చేయాలో సలహాలు ఇవ్వరు. మీ సమస్యను మీరే విశ్లేషించుకునేలా చేసి, సరైన నిర్ణయం తీసుకునే మానసిక శక్తిని మీకు అందిస్తారు. వారు మీకు ఒక మార్గదర్శిలా ఉంటారు తప్ప, నిర్ణేతలుగా ఉండరు.
వాస్తవం: స్నేహితులు, కుటుంబ సభ్యులు మీపై ప్రేమతో మద్దతు ఇస్తారు, కానీ వారు నిష్పక్షపాతంగా ఉండకపోవచ్చు. కౌన్సెలర్లు శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ పొందిన వారు. వారు మీ సమస్యను శాస్త్రీయంగా విశ్లేషించి, గోప్యతను పాటిస్తూ పరిష్కారం చూపుతారు.
వాస్తవం: కౌన్సెలింగ్‌లో వాడే ‘టాక్ థెరపీ’ వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మనం మనసు విప్పి మాట్లాడినప్పుడు మెదడులోని ఒత్తిడి హార్మోన్లు తగ్గి, ప్రశాంతతనిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
వాస్తవం: కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశం ఒక వ్యక్తిని స్వతంత్రుడిగా మార్చడం. సమస్యలను ఎదుర్కొనే నైపుణ్యాలను నేర్పించి, కొంత కాలం తర్వాత మీ సమస్యలను మీరే పరిష్కరించుకునేలా సిద్ధం చేస్తారు.
మనసు తేలికవ్వడం: ఎవరికీ చెప్పలేని విషయాలను ఒక ప్రొఫెషనల్ వ్యక్తితో పంచుకోవడం వల్ల గుండె మీద ఉన్న భారం తగ్గుతుంది.
స్పష్టత: గందరగోళంలో ఉన్న మనసుకు ఒక సరైన మార్గం కనిపిస్తుంది.
ఆత్మవిశ్వాసం: మీలోని బలాలను మీరు గుర్తించేలా కౌన్సెలింగ్ సాయపడుతుంది.
సంబంధాల మెరుగుదల: ఇతరులతో ఎలా వ్యవహరించాలి, కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి వంటి నైపుణ్యాలు అలవడతాయి.
ఆరోగ్యం: మానసిక ప్రశాంతత వల్ల నిద్ర బాగా పడుతుంది. దీనితో శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మానసిక సమస్యలు కూడా శారీరక సమస్యల వంటివే. అపోహలను నమ్మి చికిత్సను దూరం చేసుకుంటే సమస్య మరింత జటిలమవుతుంది. కౌన్సెలింగ్ అనేది బలహీనత కాదు, అది మీ మానసిక ఆరోగ్యం పట్ల మీకు ఉన్న బాధ్యత. మీకు లేదా మీకు తెలిసిన వారికి మానసిక ఆందోళన కలిగించే విషయాలు ఉంటే, వెనుకాడకుండా ప్రొఫెషనల్ కౌన్సెలర్‌ను సంప్రదించండి.
కౌన్సెలింగ్ మంచి ఫలితాలను ఇవ్వాలంటే, సరైన సైకాలజిస్ట్‌ను ఎంచుకోవడం ముఖ్యం. అందరు సైకాలజిస్టులూ మీ వ్యక్తిత్వానికి, మీ సమస్యకు సెట్ కాకపోవచ్చు. కాబట్టి, సరైన నిపుణుణ్ని ఎంచుకోవాలి. అందుకు కొన్ని చెక్ పాయింట్స్ ఇవి.
మొదట సదరు సైకాలజిస్టు నిజంగా అర్హత కలిగిన వారేనా? కాదా? అనేది చూడండి. సైకాలజీలో కనీసం పీజీ అయినా ఉండాలి. ఒకవేళ మీకు క్లినికల్ డిప్రెషన్ లేదా తీవ్రమైన ఆందోళన ఉంటే.. ఆర్సీఐ గుర్తింపు పొందిన కోర్స్ చేసిన వారిని ఎంచుకోండి.
సైకాలజీలోనూ చాలా రకాలు ఉంటాయి. అందులో, మీ సమస్య ఏమిటో, అందుకు తగిన వారినే ఎంచుకోండి. పిల్లల సమస్యలకు చైల్డ్ సైకాలజిస్ట్, భార్యాభర్తల గొడవలకు మ్యారేజ్/రిలేషన్షిప్ కౌన్సెలర్, కెరీర్ టెన్షన్‌కు కెరీర్ కౌన్సెలర్, వ్యసనాలకు రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్‌లను ఎంచుకోవాలి.
ప్రతి సైకాలజిస్ట్ ఒకే పద్ధతిని వాడబోరు. కొందరు మాట్లాడటం (టాక్ థెరపీ) ద్వారా, మరికొందరు ఆలోచనా తీరును మార్చడం (సీబీటీ) ద్వారా చికిత్స చేస్తారు. మీకు ఏ పద్ధతి కంఫర్టబుల్‌గా ఉంటుందో కనుక్కోండి.
మొదటి సెషన్లోనే మీరు వారితో ఎంత ప్రశాంతంగా ఉన్నారో గమనించండి. మీరు చెప్పేది వారు శ్రద్ధగా వింటున్నారా? మిమ్మల్ని జడ్జ్ చేయకుండా ఉన్నారా? మీరు మీ రహస్యాలను వారితో పంచుకోగలరా? వంటి అంశాలను పరిశీలించండి. సైకాలజిస్ట్ మీ స్నేహితుడిలా కాకుండా, ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో మిమ్మల్ని గైడ్ చేయాలి.
ఒకవేళ మొదటి ఒకట్రెండు సెషన్ల తర్వాత మీరు ఆ సైకాలజిస్ట్‌తో కనెక్ట్ అవ్వలేకపోతే వేరొకరిని సంప్రదించడంలో తప్పు లేదు. మీ మానసిక ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదని గుర్తుంచుకోండి.