‘కలవరమాయే..’ సినిమాతో కుర్రాళ్ల మనసుల్లో కలవరం కలిగించింది. ‘టాక్సీవాలా’తో అందరి గుండెలకూ వలపు మీటరేసింది. ప్రియాంక జవాల్కర్ మహారాష్ట్ర ముద్దుగుమ్మే అయినా, పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోనే. దాదాపు రెండేండ్ల విరామం తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రియాంక గురించి..
మొదటి బొమ్మతోనే బ్రహ్మాండమైన గుర్తింపు రాకపోయినా ‘టాక్సీవాలా’లో క్రేజీస్టార్ విజయ్ దేవరకొండతో నటించే అవకాశం వచ్చింది. సినిమాల్లో చేస్తూనే ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశాను. నా సినిమాల్లో దుస్తులు నేనే డిజైన్ చేసుకుంటా.
మాది మహారాష్ట్ర. చాలా సంవత్సరాల క్రితమే మా కుటుంబం అనంతపురంలో స్థిరపడింది. నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం బాగా వచ్చు. అందుకే నేను తెలుగమ్మాయినే. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ తర్వాత, నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను.
నాకు బాల్యం నుంచీ సినిమాలంటే ఇష్టం. ముఖ్యంగా ‘జీన్స్’ చూసినప్పటినుంచీ ఆ ఇష్టం మరింత పెరిగింది. ఐశ్వర్యరాయ్ నటన చాలా నచ్చింది. అప్పుడు నా వయసు ఆరేండ్లు కావచ్చు. పెద్దయ్యాక సినిమాల్లో నటించాలని అప్పుడే నిర్ణయించుకున్నా. అమ్మతో చెబితే ‘ముందు చదువుకోవే తల్లీ! సినిమాలు తర్వాత చేద్దువు కానీ’ అని సర్దిచెప్పింది.
అమ్మకిచ్చిన మాటకు కట్టుబడి, చదువు పూర్తయ్యాకే ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. సినిమా అవకాశాలైతే రాలేదు కానీ, ఓ రెండు షార్ట్ ఫిల్మ్స్‌లో చాన్స్ వచ్చింది. ‘పొసెసివ్‌నెస్’, ‘ఇట్స్ ఎ గర్ల్ ఇష్యూ’ అనే లఘు చిత్రాల ద్వారా కెరీర్ ప్రారంభించాను. ఆ తర్వాత ‘కలవరమాయే..’ సినిమాలో అవకాశం వచ్చింది.
ఇటీవల విడుదలైన ‘తిమ్మరుసు’, ‘ఎస్.ఆర్.కల్యాణ మండపం’ మంచి విజయం సాధించాయి. ‘గమనం’ విడుదలకు సిద్ధంగా ఉంది. సీనియర్ హీరోయిన్లు శ్రియా సరన్, నిత్యామీనన్‌లతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఇద్దరి నుంచీ చాలా నేర్చుకున్నా.
నాకు మొదటి నుంచీ పెంపుడు జంతువు లంటే ప్రేమ. వాటితో ఉంటే, ఎంతటి ఒత్తిడినైనా జయించవచ్చు. లాక్డౌన్ వల్ల మనసుకు నచ్చిన పనులు చేస్తూ, ఆత్మీయుల మధ్య గడిపే అవకాశం దొరికింది. నాకు నచ్చినట్టు ఉండేందుకు ఇష్ట పడతాను.