ఫొటోగ్రఫీ అంటేనే.. కాంతి కదలికలను కెమెరాలో బంధించడం. అలాంటి కాంతిని నియంత్రించడం అత్యంత కీలకమైన విషయం. ఇందుకు సహాయపడేదే.. ఎక్స్పోజర్ ట్రయాంగిల్.ఈ త్రికోణంపై పట్టు సాధించడం ద్వారా.. ఫొటోలు అద్భుతంగా వస్తాయి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలో మూడు ప్రధానమైన అంశాలు.. అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ. ఈ మూడూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిని సమతుల్యం చేసుకుంటూ.. కెమెరా సెన్సర్‌కు చేరే కాంతి పరిమాణాన్ని నియంత్రించాల్సి ఉంటుంది. అంటే, ఒక సెట్టింగ్‌ను మార్చినప్పుడు.. కాంతిని సరైన స్థాయిలో ఉంచడానికి మిగిలిన రెండిటినీ సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడే సరైన ఎక్స్పోజర్ను పొందవచ్చు. దీనినే ‘ఎక్స్పోజర్ ట్రయాంగిల్’గా వ్యవహరిస్తారు.
అపర్చర్ (Aperture):
లెన్స్ గుండా వెళ్లే కాంతి పరిమాణాన్ని.. అపర్చర్ నియంత్రిస్తుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌ను అపర్చర్ నిర్ణయిస్తుంది. ఇది పెద్దదిగా ఉంటే.. ఎక్కువ కాంతి; చిన్నదిగా ఉంటే.. తక్కువ కాంతి వస్తుంది. అపర్చర్ను f-stopలో నిర్ణయిస్తారు.
ఐఎస్ఓ
కెమెరాలో ఐఎస్ఓ అనేది.. కాంతి సున్నితత్వాన్ని సూచిస్తుంది. తక్కువ ఐఎస్ఓ తక్కువ కాంతిని, ఎక్కువ ఐఎస్ఓ ఎక్కువ కాంతిని అందిస్తుంది. అంటే.. తక్కువ కాంతిలో ఫొటోలు తీయడానికి ఎక్కువ ఐఎస్ఓ అవసరం అవుతుంది. అయితే.. ఇది ఫొటోల్లో ‘నాయిస్’ను పెంచుతుంది.
షట్టర్ స్పీడ్ (Shutter Speed):
కెమెరా సెన్సర్‌పై ఎంతసేపు (సమయం) కాంతి పడాలో షట్టర్ స్పీడ్ నియంత్రిస్తుంది. ఫొటోలోని మోషన్ ఫ్రీజ్, మోషన్ బ్లర్‌ను కూడా షట్టర్ స్పీడే నిర్ణయిస్తుంది. తక్కువ షట్టర్ స్పీడ్.. ఎక్కువ కాంతిని అనుమతిస్తుంది. వేగవంతమైన షట్టర్ స్పీడ్.. తక్కువ కాంతిని కెమెరాలోనికి పంపిస్తుంది.
ఉదాహరణ:
చివరగా.. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది ఫొటోగ్రఫీకి ఫౌండేషన్ లాంటిది. అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ మధ్య సరైన సమతుల్యం సాధిస్తేనే.. ఫొటోలను మీరు కోరుకున్న విధంగా తీయొచ్చు. అన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే.. లైట్, బ్లర్, డెప్త్, మోషన్ ఫ్రీజ్/ బ్లర్ కలిగిన ఫొటోలు వస్తాయి.
-ఆడెపు హరికృష్ణ