ప్రియ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. తరచూ ఇంట్లో తల్లిదండ్రులతో తగాదా పడుతుంది. నాకు అది కొనివ్వలేదు, ఇది కొనివ్వలేదు అంటూ సాధిస్తుంది. పార్టీలు, సినిమాలకంటూ బయటికి వెళ్తానని ఒకటే గోల! నిన్నటివరకు చెప్పిన మాట విన్న కూతురు ఇప్పుడు మాట వినడం లేదని పేరెంట్స్ బాధపడుతున్నారు. ఇక లాభం లేదని కౌన్సెలింగ్ కోసం నా దగ్గర తీసుకొచ్చారు. రెండు సెషన్స్ తర్వాత నాకు విషయం
అర్థమైంది. ఇంట్లో పరిస్థితి ఇలా మారడానికి ప్రియ ఒక్కతే కారణం కాదు, పేరెంట్స్ పాత్ర కూడా ఉంది. ఆమె ఇంటర్లోకి రాగానే వీళ్ల ప్రవర్తన మారిపోయింది. అంతకుముందు లేని రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చేశాయి. తనపై నిఘా ఎక్కువైంది. దీంతో తిక్కరేగి ప్రియ మాట వినటం మానేసింది.
ఒక టీనేజ్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. పిల్లలు టీనేజ్‌లోకి అడుగు పెట్టగానే ఎక్కడ తమ కంట్రోల్ తప్పుతారనే భయంతో తల్లిదండ్రులు అంతకుముందు లేని రూల్స్ పెట్టి వారిని మరింత గందరగోళ పరచడంతో సమస్య తలెత్తుతుంది. అప్పటిదాకా అమ్మతో అన్ని విషయాలు చెప్పిన కూచి ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. నాన్న తోడు వస్తే గాని బయటకు వెళ్లని అమ్ములు, ఫ్రెండ్స్‌తో వెళ్తానంటుంది. ఇది టీనేజ్‌లో చాలా సహజం. ఇది అర్థం చేసుకోలేని కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛ ఇస్తే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటారనే భయంతో రూల్స్ పెట్టి వారికి మరింత దూరమవుతారు. టీనేజ్‌లో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఈ సమయంలో వారికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరం. పేరెంట్స్ కూడా టీనేజ్ నుంచి వచ్చినవారే కాబట్టి, ఆ వయసులో ఉండే భావోద్వేగాలను అర్థం చేసుకొని మసలుకుంటే పిల్లలతో ఎలాంటి సమస్య రాదు.
ఇటీవల ఓ పేరుపొందిన పాఠశాలలో టీనేజీ పిల్లలను మీరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటని అడిగితే, ‘మమ్మల్ని మా పేరెంట్స్ నమ్మకపోవడమే’ అని చెప్పారు. టీనేజర్స్, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం ఇదే. టీనేజ్ ప్రభావంతో పిల్లలు ఒక్కోసారి శ్రుతి మించి ప్రవర్తిస్తారు. అప్పుడు వారు చెయ్యి దాటి పోతున్నారని అర్థం చేసుకుంటే పొరపడినట్లే. లైఫ్‌లో సర్దుకుపోవడానికి ప్రయత్నించే క్రమంలో చేసే తప్పులుగానే పరిగణించాలి. వారితో మాట్లాడి అవసరమైన సపోర్ట్ ఇవ్వాలి.
టీనేజర్స్, పేరెంట్స్‌కి భేదాలు వచ్చేది స్వేచ్ఛ విషయంలోనే. స్వేచ్ఛ దాని హద్దులపై తల్లిదండ్రులు సరైన వివరణ ఇవ్వకపోవడంతో సమస్య ప్రారంభమవుతుంది. టీనేజర్స్‌కు చాలా స్పష్టంగా గైడ్‌లైన్స్ ఇస్తే ఎలాంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు. టీన్ పేరెంటింగ్ అంటే ఏడు చెరువుల నీళ్లు తాగడం అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ మూడు ‘సీ’లతో సమస్యను సానుకూలంగా అధిగమించవచ్చు. అవి కేరింగ్, కన్సిస్టెన్సీ, క్లారిటీ.
కేరింగ్: చాలామంది తల్లిదండ్రులు టీనేజర్స్ ఇంకా ఎదిగే దశలో ఉన్నారని, వారికి తమ సపోర్ట్ అవసరం అనే విషయం మర్చిపోతుంటారు. పొద్దస్తమానం వారి ప్రవర్తనను వేలెత్తి చూపిస్తూ, వారిలో నెగెటివ్ ఫీలింగ్స్ పెంచుతారు. ఈ వయసులోనే వారిపై మరింత శ్రద్ధ చూపాలనే విషయాన్ని విస్మరిస్తారు. నిన్ను ఎంతగా నమ్మాం, ఇలా చేస్తావనుకోలేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు వారి ప్రవర్తనను విమర్శించినట్టుగా పిల్లలు భావిస్తారు. దీంతో సమస్య మరింత ముదురుతుంది. సున్నితమైన వారి మనసు గాయపడుతుంది.
కన్సిస్టెన్సీ: పేరెంట్స్ చాలా సహజంగా చేసే పొరపాటు అప్పుడప్పుడు రూల్స్ సడలించడం. రాత్రి 10 గంటలకల్లా ఇంటికి రావాల్సిన పిల్లవాడు 10:30కి వస్తే అరగంటే కదా అని ఊరుకుంటారు. దీంతో టీనేజర్లకు మరో అరగంట వెసులుబాటు ఉందని సందేశం వెళ్తుంది, అది ఇంకో అరగంట ఆలస్యానికి దారితీస్తుంది. రూల్స్ విధించాలని నిర్ణయించుకున్నప్పుడు, అందులో ఎలాంటి సడలింపులు ఉండకూడదు. మీరు అలా సర్దుబాటు చేస్తూ ఉంటే వారు కట్టుబాట్లను అర్థం చేసుకోలేక కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది.
క్లారిటీ: టీనేజర్స్‌తో మాట్లాడేటప్పుడు మీ కమ్యూనికేషన్లో స్పష్టత ఉండేటట్టు చూసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ఓపిగ్గా వివరించాలి. అవి వారికి ఏ విధంగా ఉపయోగపడతాయో అర్థమయ్యేలా చెప్పాలి. బయట ప్రపంచంలో మసులుకునేటప్పుడు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు బౌండరీస్ ఎలా విధించాలో చెప్పాలి. వారి మాట, చేతల పర్యవసానం ఎలా ఉంటుందో వివరించాలి. ఎలాంటి సమస్య వచ్చినా తమతో చెప్పాలని, దాని పరిష్కారంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటామనే భరోసా ఇవ్వాలి.
టీనేజర్స్‌కి రూల్స్ విధించేటప్పుడు, వారి కెరీర్‌కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు. మీరు తీసుకునే నిర్ణయం వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించాలి. మరో మార్గం ఏదైనా ఉందేమో చెప్పమని ప్రోత్సహించాలి. మీరు సూచించిన మార్గం కంటే వారు చెప్పిన మార్గం బాగా అనిపిస్తే ఆ దిశగా వెళ్లడానికి అనుమతించాలి. టీనేజ్ జీవితంలో వచ్చే తొలి తుఫాన్ లాంటిది. ఇటువంటి క్లిష్ట సమయంలో వారిని ఒంటరిగా వదిలేయకండి. చిన్నప్పుడు మీ వేలు అందించి బుడిబుడి నడకలు నేర్పినట్టుగానే.. టీనేజ్ దశను కూడా దాటేందుకు వారికి చేయూతనివ్వండి.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261