అతిగా ఆలోచించడం.. అన్ని రోగాలకు ఆధారం!
ఓవర్ థింకింగ్.. అదేనండి అతిగా ఆలోచించడం అనేది నేటి ఆధునిక జీవనశైలిలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఒక చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ, పదే పదే దాని గురించే ఆలోచిస్తూ మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. సైకాలజీ ప్రకారం అతిగా ఆలోచించడం అనేది ఒక సాధారణ అలవాటు మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని లోతైన మానసిక కారణాలు ఉంటాయి.
మన్తరంగం
ఓవర్ థింకింగ్.. చెక్ పెట్టేయ్ బాస్
యాంగ్జయిటీ-భయం: భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే ఆందోళన, అభద్రతా భావం ఓవర్ థింకింగ్‌కు ప్రధాన కారణాలు. జరగని, ఊహాజనితమైన ప్రమాదాలను ఊహించుకుంటూ మెదడు ఒత్తిడికి గురవుతుంది.
గత అనుభవాలు (ట్రామా): గత చేదు అనుభవాలు, పరాజయాలు, అవమానాలు మనసుపై బలమైన ముద్ర వేస్తాయి. ‘మళ్లీ అలాంటి తప్పు జరగకూడదు’ అనే రక్షణ భావనతో మెదడు పాత సంఘటనలను పదేపదే విశ్లేషిస్తుంది.
పర్ఫెక్షనిజం: ప్రతి పని పరిపూర్ణంగా ఉండాలి అనుకునే వారిలో ఈ సమస్య ఎక్కువ. చిన్న లోపం జరిగినా తట్టుకోలేక అతిగా ఆలోచిస్తారు.
అనాలసిస్ పెరాలిసిస్: ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు లాభనష్టాలను విపరీతంగా లెక్కించడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది. ఏ నిర్ణయమూ తీసుకోలేక సమయం వృథా అవుతుంది.
కంట్రోల్ కోల్పోతాననే భయం: జీవితంలోని ప్రతి పరిస్థితిని తమ నియంత్రణలోనే ఉంచుకోవాలనే కోరిక ఉన్నవారికి, పరిస్థితులు అనుకూలించనప్పుడు ఆందోళన పెరిగి ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుంటారు.
మెదడులో ఏం జరుగుతుంది?
– ఓవర్ థింకింగ్ అనేది కేవలం ఒక మానసిక అలవాటు మాత్రమే కాదు; దాని వెనుక స్పష్టమైన న్యూరోలాజికల్ ప్రాసెస్, మెదడులోని వివిధ భాగాల పనితీరు ఉన్నాయి.
– మన మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. ఇది పాత జ్ఞాపకాలను తలచుకోవడానికి, భవిష్యత్తును ఊహించుకోవడానికి సహాయపడుతుంది. ఓవర్ థింకింగ్ సమయంలో డీఎంఎన్ అతిగా పనిచేయడం వల్ల మెదడు గతంలోని తప్పులను, భవిష్యత్తు ఆందోళనలను ఆపకుండా ప్లే చేస్తూనే ఉంటుంది.
– అమిగ్డాలా మెదడులోని ‘భయం-భావోద్వేగ కేంద్రం’. పరిస్థితి ప్రమాదకరంగా ఉందో లేదో ఇది పసిగడుతుంది. ఓవర్ థింకింగ్‌లో అమిగ్డాలా చిన్న ఆలోచనను కూడా పెద్ద ముప్పుగా భావించి ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ రెస్పాన్స్‌ను ట్రిగ్గర్ చేస్తుంది.
– మానసిక స్థిరత్వాన్ని ఇచ్చే సెరోటోనిన్ స్థాయులు పడిపోయినప్పుడు ఒకే ఆలోచన మైండ్‌లో లూప్లాగా తిరుగుతుంటుంది.
– మీరు ఒక విషయం గురించి పదేపదే ప్రతికూలంగా ఆలోచిస్తున్నప్పుడు, ఆ ఆలోచనా మార్గానికి చెందిన న్యూరాన్లు బలపడతాయి. ఫలితంగా, మెదడులో ఓవర్ థింకింగ్‌కు సంబంధించిన న్యూరల్ పాత్‌వేస్ ‘హైవే’ లాగా మారిపోతాయి. కాలక్రమేణా ఏ చిన్న సమస్య వచ్చినా, మెదడు సహజంగానే అతిగా ఆలోచించే మార్గాన్నే ఎంచుకుంటుంది.
ఇలా చెక్ పెట్టండి..
ఓవర్ థింకింగ్ లూప్‌లో చిక్కుకున్నప్పుడు మెదడు ‘ఫైట్ ఆర్ ఫ్లయిట్’ స్థితిలోకి వెళ్తుంది. ఈ సమయంలో హార్ట్‌రేట్ పెరుగుతుంది, శ్వాస వేగంగా మారుతుంది. ఈ ఉచ్చు నుంచి మెదడును తక్షణమే బయటికి తీసుకొచ్చే శ్వాస వ్యాయామాలు, సోమాటిక్ పద్ధతులు ఉన్నాయి.
బాక్సెస్ బ్రీతింగ్: ఈ పద్ధతి మనసును కేంద్రీకరించడానికి, నాడీ వ్యవస్థను వెంటనే రిలాక్స్ చేయడానికి సైనిక దళాలు, అథ్లెట్లు కూడా ఉపయోగిస్తారు. మీ ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకుంటూ 4 సెకన్లు లెక్కించండి. పీల్చిన గాలిని అలాగే లోపల ఉంచుకుని 4 సెకన్లు ఆపుకోండి. నోటి ద్వారా నెమ్మదిగా గాలిని వదులుతూ 4 సెకన్లు లెక్కించండి. గాలి పూర్తిగా వదిలిన తర్వాత, మళ్లీ గాలి పీల్చే ముందు 4 సెకన్లు అలాగే ఉండండి. ఈ సైకిల్‌ను 4 నుంచి 5 సార్లు పునరావృతం చేయండి.
ఫిజియాలజికల్ నిట్టూర్పు: నాడీ శాస్త్రవేత్తల ప్రకారం, ఓవర్ థింకింగ్ ఆపడానికి ఇది అత్యంత వేగవంతమైన శ్వాస పద్ధతి. ముక్కు ద్వారా ఒక లోతైన శ్వాస తీసుకోండి. గాలి పీల్చిన వెంటనే, ఎలాంటి విరామం లేకుండా ముక్కు ద్వారానే మరోసారి చిన్నగా అదనపు గాలిని పీల్చుకోండి (దీనివల్ల లంగ్స్ పూర్తిగా నిండుతాయి). ఆ తర్వాత నోటి ద్వారా చాలా నెమ్మదిగా, దీర్ఘంగా గాలిని బయటికి వదలండి. దీన్ని కేవలం 2 లేదా 3 సార్లు చేస్తేనే గుండె దడ తగ్గి, మెదడు ప్రశాంతమవుతుంది.
టెంపుల్ మసాజ్: మీ చూపుడు వేలు, బొటనవేలితో చెవి తంతులను పట్టుకుని, అతి మెత్తగా కిందికి లాగుతూ వృత్తాకారంలో తిప్పండి. అదే సమయంలో, మీ కణతలను వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇది వాగస్ నెర్వ్ బ్రాంచ్‌లను ఉత్తేజపరిచి తక్షణ రిలాక్సేషన్ ఇస్తుంది.
డైవర్షన్ ఆఫ్ టెంపరేచర్-కోల్డ్ వాటర్ షాక్: మెదడు అతిగా ఆలోచిస్తున్న లూప్‌లో ఉన్నప్పుడు దానిని ఆపడానికి ఇదొక అద్భుతమైన ట్రిక్. ఒక గిన్నెలో చల్లని నీరు తీసుకోండి లేదా ఐస్ క్యూబ్స్ పట్టుకోండి. మీ ముఖాన్ని కొన్ని సెకన్ల పాటు చల్లని నీటిలో ముంచండి లేదా ఐస్ క్యూబ్‌ను మీ ముఖంపై, చేతి మణికట్టుపై రుద్దుకోండి. ఇది హార్ట్ రేట్‌ను అమాంతం తగ్గించి, ఓవర్ థింకింగ్ లూప్‌ను క్షణాల్లో బ్రేక్ చేస్తుంది.
బటర్‌ఫ్లై ట్యాపింగ్: మీ చేతులను ఛాతిపై శిలువలా పెట్టుకోండి (కుడి చేయి ఎడమ భుజం మీదికి, ఎడమ చేయి కుడిభుజం మీదికి). సీతాకోకచిలుక రెక్కలు కదిలినట్లుగా, మీ చేతులతో మీ భుజాలను లేదా ఛాతిని ఒకదాని తర్వాత ఒకటిగా లయబద్ధంగా తట్టండి. దీన్ని 1 నుంచి 2 నిమిషాలు చేస్తూ, మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది భావోద్వేగాలను అదుపులోకి తెస్తుంది.
ఆలోచించడం మనిషికి సహజమైన గుణమే అయినప్పటికీ, అది హద్దులు దాటి మనశ్శాంతిని, ఉత్పాదకతను దెబ్బతీస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కౌన్సెలింగ్ ద్వారా ఆలోచనలపై నియంత్రణ సాధించి, ప్రశాంతమైన జీవనశైలిని పొందవచ్చు.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

