తాటిచెట్టు మన జీవితాల్లో భాగమైంది. ఈ చెట్టు వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యం కలిగినది. చరిత్రలో అనేకసార్లు ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. తాటి చెట్టులోని అన్ని భాగాలు ఉపయోగపడతాయి. తెలుగు భాషా ప్రయోగాల్లో ఉదాహరణగా తాటి చెట్టు పేరుని ప్రస్తావిస్తాం. మరీ పొడుగ్గా ఉన్న వ్యక్తిని తాటి చెట్టు అంతా ఉన్నాడు అంటాం. తాటాకు చప్పుళ్లకు భయపడమని చాలా సందర్భాల్లో అనుంటాం. పూర్వం తాటాకులపైనే గ్రంథాలు రాసేవారు. తాటాకులను పాయలు పాయలుగా చీల్చి, ఎండబెట్టి తాళపత్రాలు తయారు చేస్తారు.
తాటి ఆకులు పాకలు, పందిళ్లు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. చాపలు, బుట్టలు, విసనకర్రలు, గొడుగులు ఇలా ఎన్నో తయారు చేసుకోవచ్చు. చివరికి దంత దావనం తర్వాత తాటాకుతో నాలుక శుభ్రం చేసుకోవడానికి కూడా తాటాకును వాడేవాళ్లు. తాటిచెట్టు నిటారుగా దాదాపు 30 అడుగులు పెరుగుతుంది. తాటి మొద్దులను ఇంటి నిర్మాణంలో దూలాలుగా ఉపయోగిస్తారు. తాటాకులు… కాడలకు 120 డిగ్రీల కోణంలో గుండ్రంగా విస్తరించి ఉంటాయి.
తాటికాయలను ముంజలు అంటారు. కొబ్బరికాయను కొట్టినట్లుగా చీల్చితే ఇందులో నాలుగు భాగాలుగా గుజ్జు ఉంటుంది. ఎండాకాలంలో తాటి ముంజలు చలువ చేస్తాయని తినడం మనందరికీ తెలిసిందే. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి డిహైడ్రేషన్ నివారిస్తాయి. కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలను పోగుడుతుంది. ఈ పండు అనాదిగా మన సంస్కృతిలో ఆహారంలో భాగమైంది. తాటి చెట్టు అనగానే ముందుగా మన తెలంగాణ ప్రఖ్యాత చిత్రకరుడు కాపు రాజయ్య గుర్తొస్తారు. గౌడన్న ఈ తాటి చెట్టు ఎక్కుతున్నట్లుగా కల్లు గీసినట్టుగా ఆయన గీసిన చిత్రాలు ప్రఖ్యాతి చెందినవి.
తాటాకు చెట్టు బొమ్మ చిత్రించడం ఒక కళ అయితే ఈ చెట్టు ఎక్కడం ఇంకో గొప్ప కళ. తాటి చెట్టు నుంచి తీసిన పానీయాన్ని కల్లు అంటారు ఇది ఒక రకమైన ప్రకృతి సిద్ధంగా లభించే ఆల్కహాలిక్ పానీయం. ఈ చెట్టు గాలిని శుద్ధి చేస్తుంది అంటారు. తాటి గింజల నుండి నూనె తయారు చేస్తారు. తాటి మొక్కలను తైగలంటారు. వీటిని కాల్చుకుని తింటారు. తాటి బెల్లం రక్తంలో హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. జలుబు, దగ్గు నివారించడంతోపాటు, బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చిన్న పేగుల్లో పేరుకుపోయే విష పదార్థాన్ని తాటి బెల్లం తొలగిస్తుంది. చక్కెరకు తాటి బెల్లం ప్రత్యామ్నాయం.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు