సీ॥ కార్తాంతికాకృతి గైకొని యొకచోట
జ్యోతిరాగముల రీతులెన్ను
నొకచోట వేకి, వెచ్చకు నగదంకారుడై
మందులిచ్చుచు నలవు నెఱపు
పరమ పాశుపతరూపము దాల్చి ఒకచోట
శైవతత్త్వార్థ విస్తరము గఱపు
నొకచోట, బౌరాణిక కులాగ్రగణ్యుడై
యితిహాసముల దెల్పు నెన్నియైన
తే॥ యోగియై యోగశాస్త్రంబులొక్కచోట
యోగవిదులకు నుపదేశ మొనరజేయు
గపటనటనానటుండైన కంసవైరి,
యాత్మ నిశ్చితమగు కార్యమైనదనుక!
ఈ పద్యం హరిభట్టారక ప్రణీతంబైన ఉత్తర భాగ నారసింహ పురాణం అనే ప్రాచీన కావ్యం లోనిది. ఇతని కొడుకైన రాఘవ మనీషి ఈ కృతిని ప్రోలుగంటి రంగప్రధానికి అంకితమిచ్చాడు. నారసింహునికి, శరభరూపంలో ఉన్న శంకరునికి మధ్య యుద్ధం, ప్రహ్లాదుడు ఇంద్రుడిపై, విష్ణువుపై పోరుకు దిగడం లాంటి అంశాలతో కూడిన ప్రహ్లాద చరిత్రలోని ఉత్తరభాగం ఇది. ప్రహ్లాదుడు ఇంద్రుడిని జయించి అమరావతిని స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ప్రహ్లాదుణ్ని జయించడానికి విష్ణువు ముందుగా వృద్ధుడి వేషంలో రాక్షసుల రాజ్యం చేరుకుంటాడు. అక్కడ రాక్షస వీరులైన కాలనేమి, శూర్పకర్ణుడు, వృశ్చిక రోముడు లాంటి వారితో ప్రియంగా మెలుగుతూ కపట భూసురోత్తముడు ఏవిధంగా ఉన్నాడో కవి ఈ పద్యంలో వివరించారు.
కార్తాంతికుడు అంటే జ్యోతిష్యుడు. ఆ ఆకృతిలో జ్యోతి రాగముల రీతులు ఎన్నుతున్నాడు. జ్యోతి అంటే నక్షత్రం, రాగం అంటే యోగశాస్త్రంలో పంచక్లేశాలైన అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, మరణభయం వంటి వాటిలో మధ్యలోనిది. అక్కడ రాక్షసులకు జ్యోతిషం చెబుతున్నాడన్నది ఉపరితల అర్థం కాగా, వాళ్ల భవిష్యత్తు అతని చేతిలోనే ఉన్నదనడం శ్లేష. ‘వేకి, వెచ్చకు నగదంకారుడై మందులిచ్చుచు’ అనడంలో వేకి అంటే జ్వరం, జ్వరంతో వెచ్చబడ్డప్పుడు రాక్షసులకు వైద్యుడిగా (అగదంకారుడు) ఔషధాలు అందిస్తాడు. వైద్యుడంటే నారాయణుడే.
‘పరమ పాశుపతరూపము దాల్చి శైవతత్త్వార్థ విస్తరము గఱపుతాడు’ అంటే పశుపతియైన శివుడి వేషంలో శైవతత్త్వ విశేషాలు వివరిస్తాడన్నది ఒక అర్థమైతే, రాక్షస వంశం పట్ల పాశుపతాస్త్రమై శివుని తత్త్వమైన లయం కలుగజేస్తాడని శ్లేష. ‘పౌరాణిక కులాగ్రగణ్యుడై యితిహాసముల దెల్పు నెన్నియైన’ అనడంలో పురాణ ప్రవచనం చెప్పే బ్రాహ్మణ కులంలో అగ్రగణ్యుడుగా అన్ని ఇతిహాసాలు చెప్పే సామర్థ్యం కలవాడు. అంతరార్థంలో పౌరాణికులు దేవతలు వారి అగ్రగణ్యుడు విష్ణువు, విష్ణువుగా కొత్త చరిత్రలు సృష్టిస్తాడు. ఆ బ్రాహ్మణుడు యోగిగా యోగశాస్త్రం ఉపదేశిస్తాడు.
యోగి అంటే శ్రీకృష్ణ భగవానుని సంబోధన అంటూ భగవద్గీత ఏడు రకాల యోగాలను వివరిస్తుంది. రాక్షసులకు సాధారణ యోగాభ్యాసం చేయించడం ఉపరితల అర్థం కాగా, శ్రీకృష్ణుడిగా రాక్షస సంహారం చేయడం శ్లేష. చివరికి అతనెవరో ‘కపటనటనా నటుండైన కంసవైరి’ అని నేరుగా చెబుతున్నాడు. అతను ఏ వేషంలో ఎప్పటివరకు ఉంటాడంటే తను ఆత్మలో అనుకున్న కార్యం నెరవేరేదాక అని.. ఇక్కడ కపట భూసురుని వేషంలో విష్ణువు నిశ్చయించుకున్న కార్యం రాక్షస సంహారమేకదా.. అది జరగబోతుందని సూచన.
-చేపూరి శ్రీరాం, హన్మకొండ