మొదటి సినిమాతోనే ‘సీత’గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు, తర్వాత ఉత్తరాదిలోనూ వరుస
అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బుల్లితెర నటిగా యాక్టింగ్ మొదలుపెట్టి వెండితెరపై తొలుత చిన్న పాత్రలే చేసింది. కెరీర్లో ఒడుదొడుకుల నుంచి పాఠాలు నేర్చుకుంది. ఇటీవల కల్కి సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించిన మృణాల్ తన గురించి పంచుకున్న కబుర్లు…
చిన్నప్పటినుంచి ఏ పనినైనా ఛాలెంజింగ్‌గా తీసుకోవడం అలవాటు. కాలేజీ రోజుల్లో ఓ వ్యక్తి నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. దాన్ని సవాలుగా తీసుకుని నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయమే ఈరోజు నన్ను మీముందు ఇలా నిలిపింది.
దాదాపు 18 ఏండ్ల వయసులోనే ఆడిషన్స్‌లో పాల్గొని మొదటి అవకాశం అందుకున్నా. బుల్లితెర మీద కొన్ని సీరియల్స్‌లో నటించినా వెండితెరపైనా రాణించాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. కల్కిలో నటించమని అడిగినప్పుడు కనీసం కథ, పాత్రకు సంబంధించిన ఏ విషయాలూ అడగలేదు. నాకు లైఫ్ ఇచ్చిన వైజయంతీ మూవీస్ నుంచి ఆఫర్ రావడమే అదృష్టంగా భావించా. అందుకే రెమ్యునరేషన్ కూడా వద్దని చెప్పాను. ఓ గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.
ఒక సినిమాకి సంతకం చేసేటప్పుడు ఆ కథ, అందులో నా పాత్రపైనే దృష్టి పెడతాను. జయాపజయాల ఎక్కువగా ఆలోచించను. కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాకపోవచ్చు. పేరు ప్రతిష్ఠలే కాదు, కష్టనష్టాలు కూడా నటీనటుల జీవితంలో భాగం. చేసిన ప్రతి తప్పునీ స్వీకరించగలిగినప్పుడే అది పునరావృతం కాకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
నేను ఎంచుకునే కథలు విలువలతో కూడుకునేవిగా ఉండాలని ఆశిస్తాను. ప్రతి సినిమా సమాజాన్ని ప్రభావితం చేయడమే లక్ష్యం కానప్పటికీ.. మంచి సందేశం అందించే కథలంటే ఇష్టపడతాను. ఆ ఉద్దేశంతోనే ‘లవ్ సోనియా’, ‘సూపర్ 30’ సినిమాల్లో నటించాను. ఎంచుకునే పాత్రల్లో రిస్క్ ఉంటేనే అది నన్ను నేను నిరంతరం మెరుగుపర్చుకునేందుకు దోహదపడుతుందని నమ్ముతాను.
కెరీర్ ఆరంభం నుంచీ చాలామంది నటీనటులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాను. వహీదా జీ, మధుబాల, స్మితా పాటిల్ వంటి నటులు తమ ప్రతిభతో పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. వాళ్లే నాకు స్ఫూర్తి. ప్రస్తుతం నేను నటించిన ‘పూజా మేరీ జాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. మరిన్ని ప్రాజెక్టులు త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి.
భాషతో సంబంధం లేకుండా ప్రపంచ ప్రేక్షకులను అలరించాలనేదే నా ముందున్న లక్ష్యం. నా కెరీర్లో తెలుగు ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాలకు ఇక్కడి ప్రేక్షకులు అందించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ‘కల్కి 2898ఎ.డి’లో అతిథి పాత్రలో నటించినందుకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.