Photography | ప్రకృతి అందాలను కెమెరాలో బంధించడమే.. ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీ! గంభీరమైన పర్వతాలు మొదలుకొని ప్రశాంతమైన సరస్సులు, పచ్చని అడవులు, పచ్చిక బయళ్లు.. అన్నీ ఈ కేటగిరీలోకే వస్తాయి. స్మార్ట్‌ఫోన్‌తోనూ అద్భుతమైన ల్యాండ్‌స్కేప్ ఫొటోలు తీసుకోవచ్చు. అందుకోసం కొన్ని టిప్స్, మరికొన్ని టెక్నిక్స్ ఫాలో అయిపోతే చాలు..
నేచురల్ లైట్లో.. ఆరుబయట తీసే ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీలో.. నేచురల్ లైట్దే కీలక పాత్ర. ‘గోల్డెన్ అవర్స్’ అని పిలుచుకునే తెల్లవారుజాము, సంధ్యా సమయాల్లో.. సూర్యుడి నుంచి వచ్చే కాంతి పరిసరాలను ఆహ్లాదకరంగా మారుస్తుంది. అలాంటి సమయాల్లో ‘నేచురల్ లైట్’ను వాడుకుంటూ ఫొటోలు తీసుకోండి. ఒకవేళ మధ్యాహ్న సమయంలో షూటింగ్ చేస్తుంటే.. నీడలు, ఓవర్ఎక్స్పోజర్ ఇబ్బంది పెడుతుంది. దీనిని నివారించడానికి.. షేడెడ్ ప్రాంతాలు, మేఘాల నీడలు పడే ప్రదేశాలను చూసుకొని.. అక్కడ మీ ఫొటోలు తీయటానికి ప్రయత్నించండి.
అవగాహన అవసరం..
ఫొటోగ్రఫీలోకి వెళ్లేముందు.. మీ ఫోన్ కెమెరా గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండటం అవసరం. అందులో ఉండే ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేటి ఆధునిక స్మార్ట్ఫోన్లు.. బిల్ట్-ఇన్ సెట్టింగ్స్, అనేక రకాల టూల్స్‌తో వస్తున్నాయి. ఇవి ప్రకృతిని అత్యంత నాణ్యతతో ఫొటోలను తీయడంలో మీకు సహాయపడతాయి. వాటిలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి..
వైడ్ యాంగిల్ లెన్స్ : ఇప్పుడొస్తున్న అన్ని స్మార్ట్ఫోన్లలో ‘వైడ్ యాంగిల్’ మోడ్ ఉంటున్నది. ఇందులోకి వెళ్తే.. ఫొటోలో ఎక్కువ స్థలం కనిపిస్తుంది. విశాలమైన ప్రకృతి దృశ్యాలను బంధించడానికి ‘వైడ్ యాంగిల్’ మంచి ఆప్షన్.
నైట్ మోడ్ : తెల్లవారుజామున, సంధ్యా సమయంలో కాంతి తక్కువగా ఉంటుంది. కానీ, ఆ సమయంలోనే ఆకాశం ఎరుపురంగు పులుముకొని.. మరింత అందంగా కనిపిస్తుంది. అలాంటి సన్నివేశాలను ఫొటో తీయాలంటే.. నైట్ మోడ్‌ని ఉపయోగించండి.
ప్రో/మాన్యువల్ మోడ్ : ఐఫోన్, గూగుల్ పిక్సెల్ వంటి కొన్ని ఫోన్లు ఐఎస్ఓ, ఎక్స్పోజర్, ఫోకస్ వంటి సెట్టింగ్‌లపై మాన్యువల్ కంట్రోల్‌ని అందిస్తాయి. వివిధ లైటింగ్ పరిస్థితులలో మెరుగైన ఫొటోలను తీయడంలో ఇవి కీలకంగా పనిచేస్తాయి. అందుకే మాన్యువల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
హెచ్డీఆర్ (హై డైనమిక్ రేంజ్) : ఈ ఫీచర్ ఫొటోలోని లైట్‌ని బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది. నీడలు, వెలుగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ డీటెయిల్స్‌ని కోల్పోకుండా చూస్తుంది.
3 కంపోజిషన్ టెక్నిక్స్‌తో..
మీ ఫొటోలో సీన్ ఎంత ముఖ్యమో.. ఆ ఫొటోని ఫ్రేమ్ చేసే విధానం కూడా అంతే ముఖ్యం. కంపోజిషన్ టెక్నిక్‌లు మీ ఫొటోలు మరింత బ్యాలెన్స్డ్గా, ఆకర్షణీయంగా రావడానికి సహాయపడతాయి. కంపొజిషన్ని సమర్థంగా ఉపయోగించడం కోసం కింది చిట్కాలు పాటించండి.
రూల్ ఆఫ్ థర్డ్స్ : అన్ని స్మార్ట్ఫోన్లలో ‘గ్రిడ్స్’ ఆప్షన్ ఉంటుంది. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేసుకుంటే.. మూడు నిలువు రేఖలు – మూడు అడ్డ గీతలు ఫ్రేమ్‌ను తొమ్మిది సమాన భాగాలుగా విభజిస్తాయి. ఫొటోలు మరింత ఆకర్షణీయంగా రావాలంటే.. ప్రధాన అంశాన్ని (ఉదా : చెట్టు, గుట్ట, నది) ఈ రేఖల్లో ఒకదాని వెంట లేదా.. రెండు గీతలు కలిసేచోట వచ్చేలా చూసుకోండి.
లీడింగ్ లైన్ : ఫొటోను చూడగానే.. అందరి దృష్టీ మెయిన్ సబ్జెక్టుపైకి మళ్లించడానికి లీడింగ్ లైన్లు ఉపయోగపడతాయి. చెట్ల వరసలు, నది గట్లు, రోడ్డుపై గీతలు, ఫెన్సింగ్ లాంటివే.. లీడింగ్ లైన్లుగా ఉపయోగపడతాయి.
ఫ్రేమింగ్ : మీ ఫొటోలు మరింత ఆకర్షణీయంగా రావాలంటే.. మెయిన్ సబ్జెక్ట్‌తోపాటు అదనంగా వేరే ఏదైనా సబ్జెక్ట్‌లో భాగంగా వచ్చేలా చూసుకోండి. చెట్ల కొమ్మలు, తలుపులు, ఆర్చ్‌వేలు వంటివి ఫొటోల్లో వస్తే.. సబ్జెక్ట్‌పై మరింత ఫోకస్ పెరుగుతుంది.
ప్రకృతిని గౌరవించండి : ప్రకృతి అందాలను చిత్రీకరించేటప్పుడు, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. నిర్ణీత మార్గాల్లో ఉండటం, వన్యప్రాణులను గౌరవించడం, సహజ పరిసరాలకు భంగం కలిగించకుండా బాధ్యతాయుతమైన ఫొటోగ్రఫీని ప్రాక్టీస్ చేయండి.
ఒక్కో సీజన్ ఒక్కోలా..
ప్రకృతి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీ కోసం.. ఒక్కో సీజన్ దానికదే ప్రత్యేకమైన అవకాశాలను అందిస్తుంది. వసంతంలో పొగమంచుతో నిండిపోయే ఉదయాలు.. శిశిరంలో రాలిపడే ఆకులు.. శ్రావణంలో ఆకాశంలో తేలియాడే మేఘాలు.. ఇలా, ఒక్కో సీజన్ మీ ఫొటోలకు ఏదో ఒక ప్రత్యేకతను తీసుకొస్తుంది. అందుకే, కాలానుగుణంగా ప్రకృతి ఎలా మారుతుందో గమనించండి. ఆయా తేడాలను చిత్రీకరించడానికి ఏడాది పొడవునా మీకు ఇష్టమైన ప్రదేశాలకు తిరిగి వెళ్లడం అలవాటు చేసుకోండి.
లాంగ్ ఎక్స్‌పోజర్‌తో ప్రయోగాలు..
నిర్దిష్టమైన ల్యాండ్‌స్కేప్ షాట్ల కోసం.. లాంగ్ ఎక్స్‌పోజర్‌తో ప్రయోగాలు చేయొచ్చు. కదిలే నీళ్లు, జలపాతాలు, మేఘాలను మరింత అద్భుతంగా చూపించవచ్చు. ఐఫోన్, హువావే లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లు బిల్ట్-ఇన్ లాంగ్ ఎక్స్పోజర్ మోడ్‌లను కలిగి ఉంటాయి. అవసరమైతే.. Slow Shutter Cam (ఐఫోన్), Long Exposure Camera 2 (ఆండ్రాయిడ్) వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను కూడా వాడొచ్చు.
మొబైల్ ఫొటోగ్రఫీ నేడు చాలా అభివృద్ధి చెందింది. అధునాతన సాంకేతికతతో, ప్రకృతి అద్భుతాలను చిత్రీకరించడానికి మీ ఫోన్ శక్తిమంతమైన సాధనంగా మారుతుంది. చిన్నచిన్న టెక్నిక్స్‌ను ఉపయోగించుకుంటూ.. అద్భుతమైన ల్యాండ్‌స్కేప్, ప్రకృతి ఫొటోలను సృష్టించండి. అధునాతన ఫీచర్లతో మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఫ్రేమ్స్‌లో బంధించండి. ఎడిటింగ్తోనూ సరికొత్త ప్రయోగాలు చేయండి. మీ కాలనీ పార్కులో వాకింగ్‌కు వెళ్లినా, అడవుల్లో ట్రెక్కింగ్ చేస్తున్నా.. అక్కడి ప్రకృతి అందాలను బంధించడానికి ఇప్పుడు మీ జేబులోని స్మార్ట్‌ఫోన్ చాలు. నేచర్, ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీ గురించి మీకు ఒక అవగాహన వచ్చిందని ఆశిస్తూ..
-ఆడెపు హరికృష్ణ