బిగ్ బిలియన్ సేల్.. ఫెస్టివల్ సేల్.. బెస్ట్ డీల్స్!! ఆన్లైన్ అంగళ్లలో పండుగొచ్చిందంటే సందడే సందడి. ‘60% డిస్కౌంట్!!’ అంటూ ఒకరు.. ‘భారీ ఎక్చ్సేంజ్ ఆఫర్!!’ అంటూ ఇంకొకరు.. ఇలా ప్రకటనలు వెల్లువెత్తుతాయి. ఇంకేముంది ఉత్సాహంగా షాపింగ్ మొదలుపెడతారు చాలామంది. నచ్చినవాటిని సెలెక్ట్ చేసుకోవడం, పేమెంట్ చేయడం నిమిషాల్లో జరిగిపోతుంది. అంతా సవ్యంగా జరిగితే ఓకే! కానీ, ఈ ఆఫర్ల వెనుక ‘డీప్ ఫేక్’ గాలం ఉండొచ్చు! దానికి చిక్కితేనే.. అకౌంట్ ఖాళీ అవుతుంది.
ధీరజ్, పండుగల ఆఫర్లలో సందట్లో సడేమియాలా ఎంటర్ అవుతున్నారు సైబర్ నేరగాళ్లు. వీరి ఆగడాలు ఏ రేంజ్లో ఉంటున్నాయంటే.. ఇటీవల మెకాఫీ (McAfee) చేసిన సర్వే ప్రకారం.. భారతదేశంలో 45% మంది వినియోగదారులు ఫేక్ ఆఫర్ల ఉచ్చులో పడి డబ్బు పోగొట్టుకున్నారట. గత అక్టోబర్ 1 నుంచి 28 వరకు జరిగిన ఫెస్టివ్ సీజనే అందుకు సాక్ష్యమని మెకాఫీ నెటిజన్లను అలర్ట్ చేస్తున్నది. బాధితులలో దాదాపు సగం మంది ఒక్కొక్కరు వేలల్లో పోగొట్టుకున్నారట. దీనికి కారణం విప్లవాత్మకంగా దూసుకొస్తున్న ‘ఏఐ’. కృత్రిమ మేధను ఆసరాగా చేసుకున్న స్కామర్లు.. డీప్‌ఫేక్ అస్ర్తాన్ని వినియోగదారులపై సంధిస్తున్నారు. తాము చూస్తున్నది, వింటున్నది అంతా నిజమే అన్నంతగా కన్జ్యూమర్లను బోల్తా కొట్టిస్తున్నారు.
మెకాఫీ సర్వేలో నెటిజన్ల అందోళన చాలా స్పష్టం కనిపిస్తున్నది. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 78% మంది తాము ఆన్లైన్ షాపింగ్‌లో మోసాలకు గురయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే.. ఏఐ మాటున సాగిస్తున్న ఈ డీప్‌ఫేక్ మోసాలు జోరుని అర్థం చేసుకోవచ్చు. మెకాఫీ ఈ పండుగ సీజన్లో 24,000కి పైగా అనుమానాస్పద, హానికరమైన యూఆర్ఎల్ లింక్‌లను బ్లాక్ చేసిందట. ఇంతలా సైబర్ నేరగాళ్లు డీప్‌ఫేక్‌తో గోల్మాల్ చేస్తున్నారంటే కారణం.. వినియోగదారుల బలహీనతే. ఆఫర్ల పేరు వినగానే.. నిజమా? కాదా? అని ఆలోచించకుండానే క్లిక్ చేసేస్తున్నారని ఈ సర్వేలో తేలింది. 66% మంది యూజర్లు ఆఫర్లపై మోజు చూపిన్నారట. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఉచ్చు పన్నుతున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. లాంటి అధికారిక సైట్లను పోలిన నకిలీ సైట్లను క్రియేట్ చేస్తున్నారు. వాటిపై అదిరే డిస్కౌంట్లతో ఆఫర్లు పెట్టి కొనుగోలుదారుల్లో అత్యాశను తట్టి లేపుతున్నారు. ఈ నకిలీ సైట్లలో 99% నమ్మలేని డిస్కౌంట్ ఆఫర్లే ఉంటున్నాయి.
పండుగ వేళ ఏ రంగానికైనా కొత్త శోభ వస్తుంది. బిజినెస్‌కు ఇది అనువైన సమయం. డబ్బులు ఖర్చుచేయడానికి జనం అస్సలు వెనకాడరు! ఇదే అదునుగా వినియోగదారుల సెలబ్రేషన్స్‌ని.. హ్యకర్లు సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. సుమారు 800 ఈ-మెయిల్స్ విశ్లేషించిన మెకాఫీ ఇదే విషయాన్ని తేల్చింది. వీటిలో చాలావరకూ ఈ ఫిషింగ్ బాపతే ఉన్నాయట. ఏఐ సపోర్ట్‌తో నకిలీ వెబ్సైట్లు, సెలెబ్రిటీ ఎండార్స్మెంట్లను సృష్టిస్తూ ఈ ఫిషింగ్ ప్రయత్నాలు చేస్తున్నారట. డీప్‌ఫేక్స్‌తో హ్యాకర్లు వేసే గాలాలు పలు రకాలుగా ఉంటున్నాయి. వస్తువుల డెలివరీలో సమస్య ఉందనీ, సెక్యూరిటీ వార్నింగ్స్ పేరుతో, డెబిట్/ క్రెడిట్ కార్డు ఇష్యూస్ అంటూ స్కామర్లు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసే డీప్‌ఫేక్ అప్‌డేట్స్‌తోనూ ఆన్లైన్ స్కామ్స్ చోటు చేసుకుంటున్నాయని మెకాఫీ చెబుతున్నది.