మాడల్ కావాలనుకున్న తన కోరికకు తండ్రి ఆలోచనను జోడిస్తూ హీరోయిన్ అయింది ఆ నటి. పుట్టిన గడ్డపై మమకారంతో తన
సినీ ప్రస్థానాన్ని మలయాళంలో మొదలు పెట్టింది. ఆపై కోలీవుడ్‌లో వరుస హిట్లతో తమిళనాట సూపర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది మాళవికా మోహనన్. టాలీవుడ్లో మొదటి సినిమాతోనే ప్రభాస్ సరసన చాన్స్ కొట్టేసింది. ‘రాజాసాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఈ మలబారు భామ పంచుకున్న కబుర్లు ఇవి..
పచ్చని ప్రకృతికి చిరునామాగా ఉండే కేరళ నా పుట్టిల్లు. కాలేజ్ డేస్‌లో ఉన్నప్పటి నుంచి మాడల్‌గా స్థిరపడాలని కలలు కనేదాన్ని. కానీ, మా నాన్న సినిమాటోగ్రాఫర్ కావడంతో ఆ ప్రభావం నామీద పడింది. మెల్లగా సినిమాలంటే ఇష్టం ఏర్పడటంతో 2013లో తెరంగేట్రం చేశా. నా తొలి చిత్రం మలయాళంలో వచ్చిన ‘పట్టం పోల్’.
నిజానికి ఆరేండ్ల కిందటే నేను తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించే సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాను. కానీ, కారణాంతరాల వల్ల ఆ చిత్రం షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు మీ ముందుకొస్తున్నా.
మలయాళంలో నేను చేసిన ‘హృదయపూర్వం’ నాకు చాలా ఇష్టం. ఓటీటీలో తెలుగులోనూ ఉంది. అలా తెలుగువారికి పరిచయమయ్యాననే చెప్పాలి. అందులో మోహన్‌లాల్ సార్‌తో కలిసి నటించడం నిజంగా గొప్ప అనుభూతి. ఆ సినిమా టీమ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
‘రాజాసాబ్’ షూటింగ్‌కు ముందు ప్రభాస్‌ను నేరుగా కలిసింది లేదు. ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు.. ఇతరులతో అంతగా కలవరేమో అనిపించింది. కానీ, షూటింగ్‌కు వెళ్లాక నా అభిప్రాయం మారిపోయింది. సెట్లో ప్రభాస్ చాలా కలివిడిగా ఉంటారు. అందరితో సరదాగా మాట్లాడేస్తుంటారు. షూటింగ్ మొత్తంలో ఆయన డల్‌గా ఉండటం నేనెప్పుడూ చూడలేదు.
2025 నాకెంతో ప్రత్యేకం. మూడు ఇండస్త్రీల నుంచి మూడు అద్భుతమైన సినిమా అవకాశాలు దక్కాయి.
ఈ ఏడాదీ అదే గ్రేస్ కొనసాగనుంది. ‘రాజాసాబ్’, ‘సర్దార్ 2’ సినిమాల విడుదల కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.
ప్రస్తుతం అప్డేట్ అంటే సోషల్ మీడియాలో చురుకుగా ఉండటమని చెబుతున్నారు. ఆ విషయంలో నేను
ఫుల్ అప్డేట్గా ఉంటాను. చాలా యాక్టివ్‌గా పోస్టులు చేస్తుంటాను.
అన్ని తరహా పాత్రలు చేయాలన్నది నా కోరిక. కథలో వైవిధ్యం ఉండాలి. నా పాత్ర ప్రత్యేకంగా అనిపించాలి. పరుగుల రాణి పీటీ ఉష బయోపిక్ చేయాలన్నది నా కల. నేను ట్రాక్ రన్నర్‌గా ఉన్న సమయంలోనే ఆమె గురించి చాలా తెలుసుకున్నాను.