అఘోరాలు.. అద్భుతాలు. సాధువులు.. సాధనలు.పూజలు.. దానాలు. పుణ్యస్నానాలు.. తర్పణాలు..త్రివేణి సంగమంలో సాక్షాత్కరించనున్న దృశ్యమిది.12 ఏండ్ల తర్వాత వస్తున్న మహాక్రతువు. భారతీయత వైభవాన్ని చాటిచెప్పే సందర్భం. సనాతన ధర్మం గరిమకు అద్దంపట్టే అద్భుత వేదిక. జీవన వాహిని గంగ.. పావన తరంగిణి యమున.. అంతర్వాహిని సరస్వతి.. కలగలసిన క్షేత్రం ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు సిద్ధమైంది.
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న వేడుక ఓ అద్భుతం.భారతీయతను అర్థం చేసుకోవాలంటే.. దేశమంతా తిరగాల్సిన పనిలేదు. ఊరూరూ చూడాల్సిన అవసరం లేదు. భారతదేశ ఆత్మ దర్శించుకోవడానికి అనువైన సందర్భం కుంభమేళా. మన సంస్కృతి- సంప్రదాయాలను తెలుసుకోవడానికి ఇంతకుమించిన సందర్భం మరొకటి దొరకదు. 12 ఏండ్ల తర్వాత జరుగుతున్న ఆధ్యాత్మిక తిరునాళ్లు ఇవి. అందుకే, ఈ జలజాతర సందర్భంగా దోవలన్నీ ప్రయాగ్‌రాజ్‌కు దారితీస్తున్నాయి. 45 రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి సుమారు 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా!
ఆధ్యాత్మిక చైతన్యం..
కుంభమేళా అనగానే పుణ్యస్నానాలు చేసి, దానాలు ఇస్తే సరిపోతుందనే భావన ఉంటుంది చాలామందికి. పితృదేవతల రుణం తీర్చుకునే అరుదైన అవకాశం ఇది. అంతేకాదు, కిక్కిరిసిన నదీ తీరంలో అంతులేని ఆధ్యాత్మికత వికసిస్తుంది. ఎంత వెతికినా జాడ దొరకని నాగా సాధువులు లక్షలుగా ఇక్కడికి తరలివస్తారు. హిమాలయాల్లో, అడవుల్లో, గుహల్లో సమాజానికి దూరంగా ఉండే సాధువులు, సన్యాసులు, యతులు అందరూ కుంభమేళా వేదికగా కలుసుకుంటారు. ఎవరు ఎక్కడున్నా.. కుంభమేళా ప్రారంభం అయ్యేనాటికి అక్కడికి చేరుకుంటారు. వీరిలో వివిధ సంప్రదాయాలకు చెందినవాళ్లు ఉంటారు. శాస్త్ర చర్చలు, సాధన ప్రక్రియలు లాంటి అంశాలపై అందరూ అభిప్రాయాలు పంచుకుంటారు. ఎప్పుడూ జన సంచారానికి దూరంగా ఉండే ఈ తపస్సంపన్నులను సామాన్యులు కలిసే అద్భుత అవకాశం కుంభమేళాతో దక్కుతుంది. నిర్జన ప్రదేశంలో ఉండే సాధువులు సామాన్యుల మధ్యలోకి రావడం, ప్రత్యేకంగా వేదికలు ఏర్పాటుచేయడం, వచ్చిన భక్తులను అనుగ్రహించడం.. భారతీయ ఆధ్యాత్మిక చైతన్యానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
నాలుగు అమృత బిందువులు
కుంభమేళా యుగాలుగా వస్తున్న ఆచారం. ఈ క్రతువు నిర్వహణ వెనుక ఒక పౌరాణిక గాథ వినిపిస్తుంది. క్షీర సాగర మథనంలో చివరికి అమృతం ఆవిర్భవించింది. అమృతభాండం కోసం దేవదానవులు ఘర్షణ పడుతుండగా.. ఆ కుంభం నుంచి నాలుగు అమృత బిందువులు కిందికి ఒలికాయట. అవి హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అలా అమృతత్వం పొందిన ఈ క్షేత్రాల్లో ఆనాటి నుంచి కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. హరిద్వార్‌లో గంగానది, ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం, ఉజ్జయినీలో క్షిప్రా నది, నాసిక్‌లో గోదావరి నదిలో సుమారు మూడేండ్ల విరామంతో ఒకసారి ఒక్కోచోట కుంభమేళా జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కో క్షేత్రం పన్నెండేండ్లకు ఒకసారి కుంభమేళాకు వేదిక అవుతుందన్నమాట. ప్రయాగ్‌రాజ్‌లో ఆరేండ్లకు ఒకసారి అర్ధకుంభమేళ కూడా జరుగుతుంది.
ఆరో శతాబ్దిలో..
ఏడో శతాబ్దిలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ తన రచనల్లో కుంభమేళా గురించి ప్రస్తావించాడు. త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళాకు ఆనాటి చక్రవర్తి హర్షవర్ధనుడు హాజరవ్వడమే కాకుండా.. తన దగ్గరున్న బంగారమంతా సాధువులకు దానమిచ్చి కట్టుబట్టలతో రాజప్రాసాదానికి చేరుకున్నాడని అందులో పేర్కొన్నాడు. నేటికీ కుంభమేళాలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. చాలామంది యాత్రికులు దానధర్మాలు చేయడాన్ని అదృష్టంగా భావిస్తారు.
గ్రహగతులే ఆధారం..
ముఖ్యనదులకు పన్నెండేండ్లకు ఒక నదికి పుష్కరాలు రావడం మనకు తెలుసు. గురు గ్రహం ఒక్కోరాశి మారినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు చేపడతారు. కుంభమేళా విషయంలోనూ గ్రహగతులనే ప్రామాణికంగా తీసుకుంటారు. రవి, గురువు సంచార స్థానాల ఆధారంగా కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. రవి, గురువు సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్‌లో, మేషంలో ఉన్నప్పుడు హరిద్వార్‌లో, గురువు వృషభంలో, రవి మకరంలో ఉన్నప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో, రవి, గురువు వృశ్చికంలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళా నిర్వహిస్తారు. అలా పన్నెండేండ్లకు ఒకసారి ఒక క్షేత్రంలో పూర్ణ కుంభమేళా జరుగుతుంది. త్రివేణి సంగమంలో జరుగుతున్న ఈ మహోత్సవానికి క్షేమంగా వెళ్లి.. లాభంగా వద్దాం!
ఇలా చేరుకోవచ్చు
ప్రయాగ్‌రాజ్ ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ నుంచి 200 కి.మీ., ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి నుంచి 120 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్, విజయవాడ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వారణాసి, లఖ్‌నవూకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ఉన్నాయి. అక్కడినుంచి రోడ్డు, రైలు, విమాన మార్గంలో ప్రయాగ్‌రాజ్ చేరుకోవచ్చు.
దర్శనీయాలు..
కుంభమేళా ఉత్సవంలో పాల్గొన్న తర్వాత భక్తులు అదే ఉత్సాహంతో గంగా-యమునా తీరంలో పలు ఆలయాలు దర్శించుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి..