ముంబయి నగరంలో 1924లో గేట్ వే ఆఫ్ ఇండియా ప్రారంభమైంది. అదే ఏడాది బెంగళూరులో ముగ్గురు అన్నదమ్ములు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్) ఫలహారశాల మొదలుపెట్టారు. గేట్ వే ఆఫ్ ఇండియాలాగే.. ఎంటీఆర్ బ్రాండ్ కూడా పాపులర్ అయింది! ‘టిఫిన్ సెంటర్’ అనే మాట రాకముందే ఏర్పాటైన ఈ హోటల్‌కు మావల్లి టిఫిన్ రూమ్ అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాతి కాలంలోనూ పేరు మార్చలేదు. ఇక్కడికి వచ్చే భోజన ప్రియులకు కొత్త రుచులు పరిచయం చేయడం తప్ప కొత్త పేరు పెట్టుకోవాలనే ఆలోచన వారికి రాలేదు.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు ఓసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉడుపి పట్టణానికి సమీపంలోని పారంపల్లి గ్రామంలో పనిలేక, పూట గడవక పరమేశ్వర మయ్య, గణపయ్య మయ్య, యజ్ఞనారాయణ మయ్య అనే ముగ్గురు అన్నదమ్ములు బెంగళూరు నగరానికి వలస వెళ్లారు. బ్రాహ్మణుల ఇండ్లలో పనిచేసే వంటవాళ్లుగా పని మొదలుపెట్టారు. నాలుగేండ్లు గడిచాయి. అయిదు వేళ్లు లోనికిపోతున్నాయి. కష్టఫలాన్ని రేపటి కోసం కొంత వెనకేసుకున్నారు. కూడబెట్టిన డబ్బుతో లాల్బాగ్ రోడ్లో 1924లో ‘బ్రాహ్మణ కాఫీ క్లబ్’ పేరుతో చిన్న ఫలహారశాల ప్రారంభించారు. అందులో ఇడ్లీ, కాఫీ మాత్రమే అమ్మేవాళ్లు. తర్వాతికాలంలో రకరకాల రుచులు వండి వడ్డించడం మొదలుపెట్టారు.
రెండో ప్రపంచ యుద్ధం వల్ల 1940 దశాబ్దం తొలినాళ్లలో దేశంలో అత్యంత దుర్భిక్షమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రోజుల్లో బియ్యం కొరత తీవ్రంగా ఉండేది. ఇడ్లీ వండడానికి కావాల్సిన బియ్యం కొరత వల్ల కాఫీ క్లబ్ నిర్వాహకులు సంకట స్థితిలో పడ్డారు. అప్పుడు బియ్యం పిండికి బదులుగా గోధుమ రవ్వతో ఇడ్లీలు చేశారు. వాటికి విపరీతమైన ఆదరణ వచ్చింది. రోజుకు 700 వరకు ఇడ్లీలు అమ్ముడయ్యేవట. అలా అపాయంలో ఉపాయం వెదికి.. బిజినెస్ మైండ్ అనిపించుకున్నారు ఈ సోదర త్రయం. వీరిలో చిన్నవాడైన యజ్ఞనారాయణ 1951లో ఇంగ్లండ్ వెళ్లి, అక్కడ రెస్టారెంట్లు ఎలా నిర్వహిస్తున్నారో పరిశీలించారు. లండన్ నుంచి వచ్చాక కాఫీ క్లబ్‌కు మహర్దశ మొదలైంది. ‘బ్రాహ్మణ కాఫీ క్లబ్’ పేరును మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్)గా మార్చేశారు. నిర్వహణ, ఆహార నాణ్యతలో లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అన్నదమ్ములు. కొత్తగా పింగాణీ కప్పులు, ప్లేట్లు అందుబాటులోకి తెచ్చారు. అవిరితో వండే పాత్రలు, యంత్రాలు వినియోగించడం మొదలుపెట్టారు. కొత్తగా మెనూ కార్డు ముద్రించి కస్టమర్లకు కొత్తదనాన్ని పరిచయం చేశారు. వెండికప్పులో కాఫీ అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌకర్యాలు మెరుగుపరచడంతో ఎంటీఆర్కు ఆదరణ విపరీతంగా పెరిగింది. 1960లో ‘మావల్లి టిఫిన్ రూమ్’ను ఇప్పుడున్న భవనంలోకి తరలించారు.
పనుల ఎమర్జెన్సీలో అందరికీ గుర్తుకువచ్చే రెడీమిక్స్.. ఎంటీఆర్ బ్రాండే. దీని పుట్టుక వెనుక కారణమూ ఎమర్జెన్సీనే! దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో ఆహార ఉత్పత్తులు తక్కువ ధరలకు విక్రయించాలనే నిబంధన ఉండేది. ఎంటీఆర్ కూడా ధరలు తగ్గించింది. దీంతో లాభాలు సన్నగిల్లాయి. ఆర్థిక భారం పెరిగి రెస్టారెంట్ మూసేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఎంతోకాలంగా తమపై ఆధారపడిన కార్మికులను వీధిన పడేయడం మయ్య బ్రదర్స్‌కు నచ్చలేదు. అప్పుడే ఎంటీఆర్ సాంబారు పొడి, మసాలా పొడులు అమ్మకాలు మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో రెడీ టు ఈట్ పేరుతో బిసిబేలా బాత్, పొంగల్, పులిహోర, పాయసం ఇలా రకరకాల రెడీమిక్స్ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నది ఎంటీఆర్. కొన్నాళ్ల కిందట ఈ సంస్థ ఫుడ్ ఫ్రోజన్ దోశను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ రెడిమేడ్ దోశను ఇంట్లో పెనం మీద ఆడించి వెంటనే తినేయొచ్చు. అమెరికా, ఇంగ్లండ్తోపాటు గల్ఫ్దేశాలకూ ఎంటీఆర్ రెడీమిక్స్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
2007లో ఆహార ఉత్పత్తుల విభాగాన్ని విక్రయించాలని భావించింది ఎంటీఆర్. ఆ బ్రాండ్‌ని కొనేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి. చివరికి నార్వే కంపెనీ ఓర్కా 400 కోట్ల రూపాయలకు దీనిని దక్కించుకుంది. ఎంటీఆర్ హోటళ్లు విదేశాలకూ విస్తరించాయి. ప్రస్తుతం బెంగళూరుతో పాటు మైసూరు, ఉడుపి, హసన్, సింగపూర్, దుబాయ్, కౌలాలంపూర్, లండన్, సియాటిల్, కాఠ్మండు, టొరంటో నగరాల్లో ‘మావల్లి టిఫిన్స్ రూమ్స్’ వెలిశాయి. ప్రస్తుతం ఎంటీఆర్ వ్యాపారాలను మూడో తరం నిర్వహిస్తున్నది. తమ సంస్థ నెలకొల్పి వందేండ్లు పూర్తయిన సందర్భంగా 123 అడుగుల పొడవైన దోశ వేసి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకుంది. ‘బ్రాండ్ అంటే ఇది’ అని గర్వంగా చెప్పుకొనే ఎంటీఆర్ శతాబ్ది చరిత్ర ప్రస్తుత ఆంత్రప్రెన్యూర్లకు ఓ గెలుపు పాఠం అని చెప్పొచ్చు.
వందేండ్ల ప్రస్థానంలో అప్పడాల నుంచి పచ్చళ్ల దాకా 270 రకాల ఉత్పత్తులను అమ్ముతూ వినియోగదారులకు చేరువైంది. ఎంటీఆర్ ఉత్పత్తి చేస్తున్న ఆహార పదార్థాల్లో ఎలాంటి రసాయనాలు, హానికారక పదార్థాలు లేవని అంతర్జాతీయ స్థాయి హెచ్ఏసీసీపీ గుర్తింపునిచ్చింది. ఈ ఘనత వహించిన తొలి భారతీయ ఆహార ఉత్పత్తి సంస్థ ఇదే! ఏడు గంటల్లో 21 వేల మంది ఆర్డర్ చేసిన వంటకాలు అందించి, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్‌లో అత్యంత వేగవంతంగా సర్వీస్ అందించిన సంస్థగా గిన్నిస్ రికార్డు సాధించింది ఎంటీఆర్.