Keerthy Suresh | ‘మహానటి’గా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి కీర్తి సురేశ్. తన ప్రతిభకు అద్దం పట్టే పాత్రలను ఎంచుకుంటూ వరుస చిత్రాలతో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నది. గ్లామర్ హీరోయిన్గా తెరపైన రాణిస్తూనే విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న కీర్తి ఇప్పుడు స్టార్ హీరోయిన్. తాజాగా ఆమె నటించిన ‘రఘుతాత’ చిత్రం ఓటీటీలో రికార్డు స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నది. ఈ సందర్భంగా కీర్తి పంచుకున్న ముచ్చట్లు ఇవి..
ఎన్ని సినిమాలు చేసినా దసరా సినిమా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. దుమ్ము, ధూళి, బొగ్గు, మైనింగ్ డ్రాప్లో షూట్ చేశాం. పక్కా పల్లెటూరి యువతిగా, నల్లగా కనిపించడానికి ప్రత్యేకంగా మేకప్ వేశారు. షూటింగ్ ముగిసిన తర్వాత మేకప్ తీయడానికి చాలా సమయం పట్టేది. వెన్నెల పాత్ర కోసం వేసిన మేకప్ వల్ల నా లుక్ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పట్టేది. దసరా సినిమా వల్ల తెలంగాణ స్థితిగతులను దగ్గరగా చూసే అవకాశం దక్కింది.
‘దసరా’ చేస్తున్నప్పుడు ‘మహానటి’ మూవీ చేసినప్పుడు కలిగిన అనుభూతి మళ్లీ పొందాను. ముఖ్యంగా దసరా సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ, రావణ సంహారం వంటి సీన్లు చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది.
‘మహానటి’ తర్వాత బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయి. కొన్ని కథలు నచ్చలేదు. కొన్ని పాత్రలు నన్ను ఇంప్రెస్ చేయలేదు. అందుకే బాలీవుడ్‌కు దూరంగా ఉన్నాను. ఇకమీదట హిందీ సినిమాల నుంచి ఏవైనా ఆఫర్లు వస్తే తప్పకుండా ఆలోచిస్తాను.
తెలంగాణలో బతుకమ్మ ఒక ఎమోషన్! అందమైన పూలను తెచ్చి బతుకమ్మ పేర్చి అందరూ ఒకచోట చేరి సంబరంగా ఆడుకోవడం నిజంగా చాలా మంచి సంప్రదాయం. ప్రకృతికి రుణపడి ఉండమని చాటిచెప్పేందుకే మన పెద్దలు పూలను దేవతగా కొలిచే ఆచారం ప్రవేశపెట్టారేమో అనిపిస్తుంది.
కెరీర్ ఆరంభం నుంచి చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాను. బహుశా దక్షిణాదిలో అత్యధిక ట్రోల్స్‌కు గురైంది నేనే కావచ్చు! విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తాను. కానీ, కావాలని నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని పట్టించుకోను.
నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తే జీవితంలో ఒక్కరోజైనా అల్లు అర్జున్‌లా బతకాలనుంది. ఆయనకు ప్రజల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఆయన మంచి డ్యాన్సర్. ఆయనలా డ్యాన్స్ చేయాలనేది నా ఆశ.
దసరా సినిమాలో మేకప్ ఓ చాలెంజ్ అయితే.. తెలంగాణ యాస మాట్లాడటం మరో సవాల్. డైలాగులు చెప్పడం నాకు కష్టంగా అనిపించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, అసోసియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాసను చక్కగా నేర్పించారు. యాసపై పట్టు రావడంతో దసరాకి నేనే డబ్బింగ్ చెప్పాను. సాధారణంగా ప్రతీ సినిమాకు రెండు, మూడు రోజులు డబ్బింగ్ చెబుతాను. కానీ దసరాకు ఐదారు రోజులు పట్టింది.
నా దృష్టిలో పెళ్లంటే ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ జీవించడం.