Gym Trainer Junaid Khan | బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ బాడీని చూస్తే ‘వాహ్! కండలా రాతి కొండలా?’ అనిపిస్తుంది. ఇటీవల హల్చల్ చేసిన అక్కినేని అఖిల్ సిక్స్‌ప్యాక్ పిక్ చూసి అభిమానులు ఊగిపోయారు. ఇక సమంత ఫిట్నెస్ వార్తలు మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఆ ఏక్దమ్ ఫిట్ శరీరాల వెనుక ఓ యంగ్ గురూజీ ఉన్నాడు. పేరు జునైద్ షేక్. తనిప్పుడు ఫిట్నెస్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాడు.
ముంబై వీధులు.
‘సార్! పాంప్లెట్ తీసుకోండి’, ‘మేడమ్! ప్లీజ్..’
..అంటూ ఓ తొమ్మిదో తరగతి కుర్రాడు కరపత్రాలు పంచుతున్నాడు. అతని పేరు జునైద్ షేక్. ఆ మహానగరంలో ఓ మధ్యతరగతి కుటుంబం తనది. ‘తక్కువ ధరకే మా జిమ్‌లో సభ్యత్వం తీసుకోండి’ అంటూ ఓ తాలింఖానా ప్రకటన అది. జిమ్ యజమానులతో ఓ ఒప్పందం చేసుకుని రంగంలోకి దిగాడు జునైద్. ఆ కాగితాలు పంచినందుకుగాను, తనకు జిమ్‌లో ఉచిత సభ్యత్వం ఇవ్వాలి. ఏం చేస్తాడు పాపం! ఇంట్లో డబ్బు అడగాలంటేనేమో భయం. అందుకే, సొంతంగా సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. పెద్దయ్యాక కూడా రాత్రిళ్లు కాల్ సెంటర్లలో పనిచేస్తూ పగటిపూట కాలేజీకి వెళ్లేవాడు. పని ఒత్తిడితో చదువు మీద ఫోకస్ తగ్గింది. దీంతో ఇంజినీరింగ్ తప్పాడు. అప్పుడే పూర్తి స్థాయిలో జిమ్ ట్రైనర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. సల్మాన్‌ఖాన్ వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ ముస్తఫా అహ్మద్ ‘జెరాయ్’ అనే జిమ్ నడిపేవాడు. అందులో ఉద్యోగానికి ప్రయత్నించాడు. కానీ ఫలించలేదు. అయినా ఆశ చావక, ముస్తఫాతో పరిచయం పెంచుకున్నాడు. ఆ చనువుకొద్దీ ‘నేను త్వరలోనే జూహూలో జిమ్ స్టార్ట్ చేస్తున్నా. పనులు పూర్తికాగానే కాల్ చేస్తాలే ’ అంటూ మాటిచ్చాడు ఆయన. ఆరు నెలలు గడిచినా పిలుపు లేదు. దీంతో ఆశ వదులు కున్నాడు జునైద్. అంతలోనే ఓ అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది. ‘నేను ముస్తఫా మాట్లాడుతున్నా. ఈ రాత్రికి యూఎస్ వెళ్లాల్సి ఉంది. రేపు సాయంత్రం ఐదు గంటలకు హృతిక్ రోషన్ ఇంటికెళ్లు. ఇక నుంచి తనకు నువ్వే ట్రైనర్’ అంటూ అడ్రస్ పంపాడు ముస్తఫా. వ్యక్తిత్వ వికాస భాషలో చెప్పాలంటే అప్పటినుంచీ జునైద్ వెనక్కి చూసుకోలేదు.
ఇటీవల టాలీవుడ్ హీరోయిన్ సమంత తన ఫిట్‌నెస్‌లో భాగంగా ట్రైనర్‌తో కలిసి ‘నాగిని మొబిలిటీ డ్యాన్స్’ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో.. ఎంతోమంది ఔత్సాహికులు రీల్స్, వీడియోలు చేస్తున్నారు. ఆ ఆలోచన జునైద్ షేక్దే. సమంత వల్ల ఆ వీడియోకు ఎక్కడలేని రెస్పాన్స్ వస్తున్నది. జునైద్ మైండ్‌లో ఇలాంటి ఎన్ని ఫిట్నెస్ మంత్రాలు దాగున్నాయో తెలుసుకోవడానికి నాగిని డ్యాన్స్ ఒక ఉదాహరణ మాత్రమే. సమంత తిరుగులేని ఫిట్నెస్ వెనుక జునైద్ ఉన్నాడు. ‘ఏజెంట్’ కోసం అఖిల్‌ను తీర్చిదిద్దిందీ తనే.
‘ఒక్క చాన్స్ ఇవ్వండి ప్లీజ్’ అంటూ సినిమాల్లో పాత్రలు వెతుక్కునే ఆర్టిస్టులా.. జిమ్ ట్రైనర్‌గా తనను తాను నిరూపించుకునే అవకాశం కోసం ఎన్నో జిమ్‌ల మెట్లు ఎక్కిదిగాడు జునైద్ షేక్. మొత్తానికి ఆ కృషి ఫలించింది. హృతిక్ రోషన్ సిఫారసుతో రణ్వీర్ సింగ్ కోటలో పాగా వేశాడు. ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి భర్త ప్రీతమ్‌రెడ్డికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లో అడుగుపెట్టి, అనుకోకుండా సమంత అభిమానాన్ని సంపాదించాడు. అప్పుడే అఖిల్ పరిచయం అయ్యాడు. వెండి తెర మీద తాము పోషించాల్సిన పాత్రల గురించి చెబితే చాలు.. అందుకు తగినట్లు శరీరాలను సిద్ధం చేస్తాడు. డైట్ తనే ప్రిపేర్ చేస్తాడు. వర్కవుట్స్ చేయిస్తాడు. ‘సమంత, శిల్పారెడ్డి నా ఫేవరెట్ క్లయింట్లు. ఇద్దరూ సున్నితంగా కనిపిస్తారు కానీ, మనోశక్తి అమోఘం’ అంటూ తన తెలుగు శిష్యులకు మంచి సర్టిఫికెటే ఇస్తాడు జునైద్.
“Pushpa: The Rise | పుష్ప సెకండ్ పార్ట్‌లో.. దిశా పటాని?”
“Samantha | పట్టుబట్టి మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్పించిన సమంత..?”
Samantha | సమంతకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా”
Samantha | స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సామ్..దేనికోసమంటే!”