విహారంలో రకరకాలు. తీర్థయాత్రలు, వినోద యాత్రలు, విజ్ఞాన యాత్రలు ఇలా ఎన్నో! హంటింగ్ ట్రిప్‌ల పేరిట భయానక పర్యాటక ప్రాంతాలు చుట్టొచ్చే పోకడ కూడా ఉంది. అలా వెళ్లాలనుకునే వారికి వెంటాడే ప్రదేశాలు ఎన్నెన్నో ఉన్నాయి మన దేశంలో. అలాంటి వెంటాడే విహార కేంద్రమే డ్యూమాస్ 4 బీచ్. అరబిక్ కడలి కల్లోలంగా ఉన్నా అందంగానే కనిపిస్తుంది.
ఆ అందాన్ని ఆస్వాదించడానికి అంతకన్నా అందమైన బీచ్‌లు ఉన్నాయి. సూరత్ నగరానికి 21 కిలోమీటర్ల దూరంలో నాలుగు బీచ్‌లు ఉన్నాయి. డ్యూమాస్ బీచ్‌లని వాటికి పేరు. వీటిలో మూడు బీచ్‌లు పర్యాటకుల కేరింతలకు కేరాఫ్‌గా నిలిస్తే.. నాలుగో బీచ్ మాత్రం భయంకరంగా దర్శనమిస్తుంది. ఈ బీచ్‌కు ఎవరూ వెళ్లరు. దాని గురించి వాకబు చేస్తే.. ‘ఇంట్లో చెప్పొచ్చారా?’ అని తిరిగి ప్రశ్నిస్తారు. అందుకు తగ్గట్టే ఇక్కడ అలలు పోటుమీదుంటాయి. తీరం కల్లోలంగా ఉంటుంది. ఉదయం పూట కూడా ఇటుగా ఎవరూ రారు. ఎవరో ఆసక్తి ఉన్న పర్యాటకులు గుంపులుగా వచ్చి కాసేపు ఉండి.. వెంటనే వెళ్లిపోతారు.
డ్యూమాస్ బీచ్ 4లో ఇసుక నల్లగా ఉంటుంది. అందులో వింత లేకపోవచ్చు. కానీ, ఆ ఇసుకలో బూడిద పాళ్లుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు ఈ తీరాన్ని శ్మశానంగా వాడేవారట. మృతదేహాలను దహనం చేసేవారట. ఆ బూడిద ఇక్కడి ఇసుకలోనూ, ఆత్మలు గాలిలోనూ ఉన్నాయని కొందంటారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, డ్యూమాస్ బీచ్ దగ్గరికి వెళ్లడానికి అంత త్వరగా ఎవరూ సాహసించరు. పైగా ఈ బీచ్‌లో మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయట కూడా! ఈ హంటింగ్ బీచ్ చేరుకోవాలంటే సూరత్‌కు వెళ్లాలి. అక్కడి నుంచి ట్యాక్సీల్లో బీచ్‌కు దారితీయొచ్చు.