తరాల వెలుగులకు.. పచ్చదనం తోడు!
దీపావళి అంటే దివ్వెల వెలుగులు.. రంగురంగుల ఆకాశం.. ఇంటిల్లిపాదీ ఆనందాలు! చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలో టపాసులకూ ప్రత్యేక స్థానం ఉంది. అయితే సంప్రదాయ సంబరాలను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు ఆసక్తి రేపుతున్నాయి. గ్రీన్ క్రాకర్స్ నుంచి జనరేషన్2 రకాల వరకు సాగుతున్న ఈ పరిశోధనలు కొత్త అవకాశాలను పరిచయం చేస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కొత్త తరం అనుసంధాన టపాసుల విషయంలో ఇచ్చిన ఆదేశాలు కూడా ఈ అంశాన్ని మరోసారి చర్చలోకి తెచ్చాయి.
సాధారణ టపాసుల్లో మండటానికి ఉపయోగపడే పదార్థాలు, మంటను వేగంగా వ్యాపింపజేసే రసాయనాలు, రంగులు ఇచ్చే పదార్థాలు ఉంటాయి. ఇవి మండినప్పుడు గాలిలోకి అతి సూక్ష్మమైన ధూళికణాలు, కొన్ని వాయువులు విడుదల అవుతాయి. ఈ కణాలు శ్వాస ద్వారా మన శరీరంలోకి చేరే అవకాశం ఉంది. వీటిని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు టపాసుల్లో వాడే పదార్థాలను మార్చడం, కొన్ని రసాయనాల పరిమాణాన్ని తగ్గించడం, పదార్థాలు సమర్థంగా మండేలా చేయడం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఐఆర్నీరి)కి చెందిన పరిశోధనల్లో అభివృద్ధి చేసిన కొన్ని పచ్చ టపాసులు సంప్రదాయ రకాలతో పోలిస్తే ధూళికణాల విడుదలను కనీసం 30 శాతం తగ్గించేలా రూపొందించారు.
స్వాస్.. స్టార్.. సఫల్..
పచ్చ టపాసుల్లో స్వాస్, స్టార్, సఫల్ అనే మూడు రకాలు ఉన్నాయి. ‘స్వాస్”లో నీటిని నిల్వ చేసుకునే ప్రత్యేక పదార్థాలను ఉపయోగిస్తారు. టపాసు మండినప్పుడు విడుదలయ్యే నీటి ఆవిరి గాలిలోకి వెళ్లే ధూళికణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. స్టార్‌లో ఐరన్ ఆక్సైడ్ వంటి పదార్థాలను ఉపయోగించి టపాసులోని పదార్థాలు మెరుగ్గా మండేలా చూస్తారు. దీనివల్ల వెలువడే వ్యర్థాలను తగ్గించే అవకాశం ఉంటుంది. సఫల్లో అల్యూమినియం వినియోగాన్ని తగ్గించి, దాని స్థానంలో ఇతర పదార్థాలను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు. ఈ మార్పులతో గాలిలోకి వెళ్లే సూక్ష్మ కణాలను తగ్గించడమే లక్ష్యం.
జెన్ 2…
జనరేషన్2 టపాసుల్లో ప్రధానంగా రసాయనాల మిశ్రమాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడుతున్నారు. టపాసులకు ఆకుపచ్చ రంగును ఇచ్చే బేరియం సమ్మేళనాల వినియోగాన్ని తగ్గించడం, వాటికి బదులుగా ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించడం ఇందులో ముఖ్యమైన అంశాలు. కొన్ని ప్రయోగాత్మక మిశ్రమాల్లో సంప్రదాయ టపాసులతో పోలిస్తే గాలిలోకి విడుదలయ్యే సూక్ష్మ ధూళికణాలు 4560 శాతం తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఫలితాలు అన్ని రకాల టపాసులకూ వర్తించవు. ప్రతి రకాన్నీ విడిగా పరీక్షించి దాని ప్రయోజనాలను నిర్ధారించాలి.
థౌజెండ్వాలాల్లో…
ఒకే వత్తితో వరుసగా పేలే టపాసుల దండలను లారీ క్రాకర్స్ అంటారు. మనం వీటిని థౌజెండ్వాలాలుగా పిలుస్తాం. వరుసగా టపటపమని పేలే వీటిని గతంలో కోర్టు నిషేధించింది. కొత్త తరం లారీల్లో టపాసుల సంఖ్య, వాటి పరిమాణం, ఒక్కదాని తర్వాత మరొకటి పేలడానికి పట్టే సమయాన్ని మార్చారు. కొన్ని రకాలలో సెకనుకు 25 పేలుళ్లకు బదులుగా ఐదు పేలుళ్లు మాత్రమే సంభవించేలా రూపొందించారు. దీనివల్ల పేలుళ్ల వేగాన్ని తగ్గించి, శబ్ద తీవ్రతను నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని రకాలలో టపాసుల తయారీకి ఉపయోగించే పదార్థాల పరిమాణాన్ని తగ్గించడం వల్ల వ్యర్థాలు, ఉద్గారాలను తగ్గించే ప్రయత్నమూ జరుగుతున్నది. ఈ కారణంగానే ఇటీవల సుప్రీంకోర్టు వీటి పరిమిత వాడకానికి సూచనలు ఇచ్చింది. తక్కువ సార్లు పేలినా పర్యావరణపరంగా ఆలోచిస్తే ఇవి ఎక్కువ ఆనందాన్ని తెచ్చిపెడతాయి. అయితే గ్రీన్ క్రాకర్స్ పేరును మాత్రమే చూసి కొనకుండా, అధికారిక ధ్రువీకరణ గుర్తులు, అనుమతుల వివరాలను పరిశీలించాలి. అప్పుడే ఈ దివ్వెల వెలుగులు నింగీనేలను మరింత శోభాయమానం చేస్తాయి.

Green Crackers

Green Crackers 1
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

