మేక సతీమణి గాంధారి శాపం, బ్రహ్మచారి అయిన శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు చేసుకొన్న కర్మ కారణంగానే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పేర్కొంటూ.. గాంధారి, సాంబుడు పేర్లను రుద్ర చెప్పిన వెంటనే పెట్టె తెరుచుకొంది. తెరిచిన పెట్టెలో మరో ఏడు చిన్న పెట్టెలు ఉన్నాయి. అవేంటో చూద్దామని రుద్ర వాటిని చేతిలోకి తీసుకోబోతుండగా.. స్నేహిల్ అడ్డుకున్నాడు.
‘ఒరేయ్ బాబూ.. వాటి సంగతి తర్వాత.. ముందు మేక భార్య గాంధారి ఎట్లా అయ్యింది? ఆమె ఇచ్చిన శాపమేందీ?? 16 వేల మందిని పెండ్లి చేసుకొన్న శ్రీకృష్ణుడు బ్రహ్మచారి ఎట్లా అయ్యిండు? నువ్వన్నట్టు కృష్ణుడు బ్రహ్మచారి అయితే, ఆయనకు కొడుకుగా సాంబుడు ఎట్లా వచ్చిండు? అతను చేసుకొన్న కర్మ ఏంది? గాంధారి శాపం, సాంబుడు కర్మ వల్ల ద్వారకా నగరం సముద్రంలో ఎట్లా మునిగిపోయింది? త్వరగా చెప్పురా.. నా బుర్ర మొత్తం వేడెక్కిపోతుంది’ అంటూ స్నేహిల్ గుక్కతిప్పుకోకుండా అడిగాడు. ఈ ప్రశ్నలు ఒక్క స్నేహిల్వే కాదు.. అక్కడే ఉన్న అందరివి కూడా. దీంతో కారణాలను రుద్ర ఇలా వివరించాడు.
‘కురుక్షేత్ర మహా సంగ్రామంలో తన సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ఏడుపు యుద్ధ భూమిలోంచి వినిపించింది. ఆ సమయంలో అక్కడకు శ్రీ కృష్ణుడు, పాండవులు వెళ్తారు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి.. శ్రీకృష్ణుడిని నిందించడం ప్రారంభిస్తుంది. నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు రూపం అయిన నువ్వు కూడా నా గర్భశోకాన్ని నిలువరించలేకపోయావని మండిపడుతుంది. ఆమె ఆవేశాన్ని చూసిన కృష్ణుడు చిరునవ్వు నవ్వి.. ‘ఇదంతా జరుగుతుందని దుర్యోధనున్ని ఎప్పుడో హెచ్చరించా’ అని అంటాడు. అయితే, గాంధారిలో ఆగ్రహం చల్లారదు. అప్పుడు ఆమె తీవ్ర ఆవేశంతో.. ‘నాకున్న విష్ణు భక్తి నిజమైతే.. నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే.. ఈ రోజు నుంచి సరిగ్గా 36 ఏండ్లకి నువ్వు మరణిస్తావ’ని కృష్ణుడికి శాపం ఇస్తుంది. అంతేకాదు, ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయి యాదవులంతా చనిపోతారని అంటుంది. ఇదే గాంధారి శాపం. ఇక, కురుక్షేత్రం పూర్తయిన తర్వాత ద్వారకా నగరం చేరుకున్న కృష్ణుడు ఎంతో వైభోగంగా 36 ఏండ్లపాటు ద్వారకాను పాలించాడు. శ్రీకృష్ణుడు-జాంబవతి కుమారుడి పేరు సాంబుడు. ఓసారి శ్రీకృష్ణుడి దర్శనార్థం ద్వారకాకు వచ్చిన సప్తరుషులను సాంబుడు ఆటపట్టిస్తాడు. ఆడపిల్ల వేషంలో వెళ్లి తన కడుపులో ఏ బిడ్డను మోస్తానో చెప్పమని అడుగుతాడు. అసలు విషయం తెలిసి ఆగ్రహించిన సప్తర్షులు.. యాదవవంశాన్ని నాశనం చేసే ముసలం నీ కడుపున పుడుతుందని శపించి వెళ్లిపోతారు. కొన్నాళ్లకు సాంబుడి కడుపులోంచి రోకలి పుడుతుంది. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ రోకలిని పిండిచేసి సముద్రంలో కలిపేస్తారు యాదవులు. ఆ తర్వాత సముద్రం ఉప్పొంగి ద్వారకను ముంచేస్తుంది. ఇదే సాంబుడు చేసుకొన్న కర్మ’ అంటూ రుద్ర ముగించాడు.
ఇంతలో కలుగజేసుకొన్న స్నేహిల్.. ‘అంతా బాగానే ఉంది. మరి గాంధారి మేక భార్య ఎలా అయ్యింది? సాంబుడు కృష్ణుడి కుమారుడని నువ్వే అన్నావు. అలాంటప్పుడు కృష్ణుడు బ్రహ్మచారి ఎలా అవుతాడు?’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు స్నేహిల్. దీనికి రుద్ర స్పందిస్తూ.. ‘ధృతరాష్ర్టుడితో వివాహం జరుగడానికంటే ముందు గాంధారి ఓ మేకను పెండ్లి చేసుకొందని అంటారు. తొలి భర్త మరణిస్తాడనే జాతక దోషం కారణంగానే ఆమె ఇలా చేసిందని అంటారు. ఆ తర్వాత ఆ మేకను బలిచ్చి తర్వాతి భర్తగా ధృతరాష్ర్టుడిని గాంధారి స్వీకరించినట్టు చెప్తారు. ఇక, సకల చరాచర సృష్టిలో సంభోగం చెయ్యని ఏకైక ప్రాణి నెమలి. 16 వేల మంది గోపికలు భార్యలుగా ఉన్నప్పటికీ, వారితో శ్రీకృష్ణుడు సరససల్లాపాలు, అల్లరి చేశాడే తప్ప హద్దుదాటలేదు. ఆ విషయాన్ని తెలియజేయడానికే శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ధరిస్తాడు. ఆయన పుత్రులు కూడా దైవప్రసాదాలేనని అంటారు. అందుకే కృష్ణుడిని అస్ఖలిత బ్రహ్మచారిగా పేర్కొంటారు’ అంటూ రుద్ర ముగిస్తూ.. ఈ ఏడు చిన్న పెట్టెలు ఏమిటి? అంటూ వాటిలో ఒకదానిని తాకాడు. అంతే, ఒకదానికొకటి పెట్టెలన్నీ ముడుచుకుపోయి అతుక్కొని చిన్న పెట్టెగా మారిపోయాయి. అప్పటివరకూ కనిపించని అక్షరాలు ఒక్కసారిగా ఆ పెట్టెపై కనిపించాయి. అశ్చర్యపోయిన రుద్ర.. అవేమిటోనని చదివాడు.
‘ముడుచుకుపోయిన ఈ పేటికలు ఓ మొక్కకు అనుసరణీయాలు. గాంధారి భర్త పాలతో ఆ మొక్కను రంగరిస్తే మగటిమి ఉత్తేజితమవుతుంది. ఇప్పుడు అదే రసాన్ని ఈ కుంచించుకుపోయిన పేటికపై రాస్తే, మళ్లీ సప్త పేటికలు పూర్వస్థితిలోకి వస్తాయి. ఏడు విఘడియల్లో దీన్ని పూర్తి చేయకుంటే అంతా నాశనం’ అని రాసి ఉంది. అది చదవగానే ‘విఘడియ’ అంటే అని హరిశ్వ అడిగాడు. 24 సెకండ్లు అని జయ జవాబిచ్చింది. అంటే, దాదాపు 2.8 నిమిషాల్లో మనం దీన్ని సాల్వ్ చేయాలా? అంటూ కరణ్ అడగ్గానే.. అవునన్నట్టు తలూపుతూ.. అడవిలోకి పరిగెత్తిన రుద్ర.. ఓ మొక్కను పట్టుకొచ్చి, దాని రసాన్ని ఓ జంతువు పాలలో కలిపి కుంచించుకుపోయిన పెట్టెపై పూశాడు. అంతే, మునపటి స్థితిలోకి ఆ ఏడు పెట్టెలు వచ్చాయి. క్లూ ప్రకారం.. రుద్ర ఏం చేసినట్టు?
సమాధానం : టచ్ మీ నాట్ (అత్తిపత్తి) అనే మొక్కను తాకగానే అది ముడుచుకుపోతుంది. ఈ మొక్క రసాన్ని మేక పాలల్లో కలిపి పురుషులు అరికాళ్లకు రాసుకొంటే శృంగార పటుత్వం పెరుగుతుందని అంటారు. ఇది తెలిసిన రుద్ర.. వెంటనే అడవిలో నుంచి ఆ మొక్క రసాన్ని తీసుకొచ్చి మేక (గాంధారి భర్త) పాలతో కలిపి కుంచించుకుపోయిన పెట్టెపై రుద్దాడు.