వృక్షశాస్త్రంలో నిమ్మగడ్డిని ‘సింబోపొగాన్ సిట్రేటస్’ అని పిలుస్తారు. ఈ గడ్డి మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. నిమ్మగడ్డిని నులిపితే సువాసన వస్తుంది. దీనినుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. వంటకాలు, అత్తరు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీలో నిమ్మగడ్డిని ఉపయోగిస్తారు. ఈ గడ్డితో లెమన్ టీ తయారుచేస్తారు. లెమన్ టీ తాగితే శరీరంలో మలినాలు తొలగిపోతాయి. నిమ్మ ఆకుల్లో ‘సిట్రాల్’ ఉంటుంది. దీన్ని విటమిన్ ఎ తయారీకి ఉపయోగిస్తారు. గ్రీకులు, రోమన్ల కాలం నుంచే లెమన్ గ్రాస్‌ను చికిత్సలో ఉపయోగించినట్టు చరిత్ర చెబుతున్నది. లెమన్ ఆయిల్ నీళ్లలో కలిపి ఇంటిని తుడవడం వల్ల క్రిమికీటకాలు నశిస్తాయి. అంతేకాదు ఇల్లంతా సువాసన వస్తుంది. ఈ సువాసన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
నీటి ప్రవాహం వల్ల కోత పడకుండాగట్టుని కాపాడుకునేందుకు ఈ గడ్డిని పెంచుతారు. నిమ్మగడ్డి సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటుంది. ఈ గడ్డిని పశువులు మేయవు. ఇది సులభంగా పెరుగుతుంది. పెంపకానికి శ్రమ అవసరం లేదు. కాబట్టి దీనిని వాణిజ్య పంటగా సాగుచేయడం చాలా సులువు. వరిగడ్డి దుబ్బులాగా పెరిగే నిమ్మగడ్డిని కోసిన కొద్దీ మళ్లీ పెరుగుతుంది. కోసిన నిమ్మగడ్డిని ఆవిరిపై ఉంచి తైలం తయారుచేయడం సులభమైన పని. దాదాపు ఒక టన్ను గడ్డి నుంచి 10 లీటర్ల లెమన్ ఆయిల్ తయారవుతుంది. బీడునేలలు, మెట్టనేలల్లో పెరిగే ఈ నిమ్మగడ్డిని కేశవరావు అనే రైతు ఏకంగా ఆరు ఎకరాలలో సాగు చేస్తున్నారు. డిస్టలేషన్ యూనిట్ కూడా ఏర్పాటు చేసుకుని లాభాలు ఆర్జిస్తున్నారు.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు