ఆలోచనలో ఫైర్.. ఆటలో అంతర్జాతీయ అంపైర్
ఆటలంటే ఇష్టం. బ్యాడ్మింటన్ ఆట చెప్పలేనంత ఇష్టం. పల్లెటూరిలో సౌలత్లు లేకున్నా ఎన్నో పోటీల్లో గెలిసొచ్చాడు. వయసుతోపాటే గెలవాలని పట్టుదలా పెరిగింది. కానీ, పేదరికం, పల్లె జీవితం అతనికి ఆటంకమయ్యాయి. నగరాల క్రీడాకారులతో పోటీపడి అంతర్జాతీయ పోటీల్లో ఆడలేకపోయాడు. అయినా అతనిలో ఫైర్ తగ్గలేదు. అంతర్జాతీయ ఆటల్లో అంపైర్‌గా అడుగుపెట్టాడు. తెలంగాణలో ఈ ఘనత సాధించిన తొలి పీఈటీ కొమ్ము రాజేందర్. పారా ఒలింపిక్స్‌లో అంపైర్‌గా వ్యవహరించి దేశానికి గుర్తింపు తెచ్చిన రాజేందర్ ప్రస్థానం ఇది.
వరంగల్ జిల్లాలోని నెక్కొండ గ్రామం కొమ్ము రాజేందర్ స్వస్థలం. వాళ్ల నాన్న దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రికల్ సిగ్నల్ మెయింటెనర్. రాజేందర్ నెక్కొండలోని గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. వరంగల్సీకేఎం కాలేజీలో డిగ్రీ చేశాడు. ఆటలంటే ఆసక్తి చూపే రాజేందర్ షటిల్ కోర్టులో ఓటమి ఎరుగడు. స్కూల్ గేమ్స్‌లో అనేక పతకాలు గెలిచాడు. కాలేజీలోనూ అదే ఒరవడి కొనసాగించాడు. యూనివర్సిటీ స్థాయి టోర్నమెంట్లలో ఎన్నో విజయాలు సాధించాడు. కాకతీయ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలని, అంతర్జాతీయ పోటీల్లో ఆడాలని ఆశపడ్డాడు. ఆ స్థాయిలో ఆడాలన్నా, గెలవాలన్నా మెరుగైన శిక్షణ కావాలి. ప్రభుత్వ సంస్థలు అందించే శిక్షణకు ఎంపిక కావాలన్నా సెలక్షన్స్‌లో నెగ్గాలి. దానికీ శిక్షణ కావాలి.
హైదరాబాద్ నగరంలో ఉంటూ ప్రత్యేక శిక్షణ తీసుకునే స్తోమత అతనికి లేదు. ఊళ్లోనే ఉంటూ సాధన చేస్తూ ఉండేవాడు. తనతో తలపడ్డ ఎంతోమంది ఇండోర్ కోచింగ్ తీసుకుంటూ మెరుగులు దిద్దుకుంటుంటే తను మాత్రం ఎండలో ఆడుతూ, వానలో ఆటలకు బ్రేక్ ఇస్తూ పోయాడు. పేదరికం, సౌకర్యాలు లేని పల్లె జీవితం రాజేందర్‌ని నిరాశపరిచింది. జాతీయ స్థాయిలో పతకాలు గెలిచినా అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు అవకాశం రాలేదు.

Rajender
ఆటల బడిలో
ప్రోత్సాహం లేక అంతర్జాతీయ క్రీడల్లో ఆటగాడిగా అడుగుపెట్టలేకపోయినా అంపైర్‌గా స్థిరపడాలని నిశ్చయించుకున్నాడు. ఆ లక్ష్యం చేరుకునేందుకు వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ మేలనుకున్నాడు. ఉద్యోగంతోపాటు నలుగురు క్రీడాకారు లను తయారుచేసే అవకాశం ఉంటుందని భావించాడు. ఆ అవకాశం కోసం ఎంపీఈడీ (ఉస్మానియా యూనివర్సిటీ) చదివాడు. జేఎన్టీయూలో ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పీహెచ్డీ పూర్తి చేశాడు. విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో పట్టు సాధించాడు. ఈ క్రమంలో నర్సంపేటలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా రాజేందర్ ప్రయాణం మొదలైంది.
బడిలో పిల్లల్ని ఆడించడం, ఆటల్లో ప్రోత్సహించడం, బాగా ఆడేవాళ్లను గుర్తించడంలో నిమగ్నమయ్యాడు. వాళ్లు తప్పు చేస్తే హెచ్చరిస్తూనే సరైన న్యాయం చెబుతూ బెస్ట్ అంపైర్‌గానూ మారిపోయాడు. ప్రస్తుతం కేసముద్రం స్టేషన్ జడ్పీ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. రాజేందర్ ఏ బడికి మారిపోతే ఆ బడిలో ఆటల పండుగే. ఆటలు ఇష్టపడే పిల్లలకు కావాల్సినంత ప్రోత్సాహం ఇస్తూ వాళ్లకు విజయాలను పరిచయం చేస్తుంటాడు. తన విద్యార్థులు కూడా అనేక క్రీడల్లో బహుమతులు గెలుస్తూ గురువుకు గౌరవం తెచ్చారు. పిల్లల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న రాజేందర్‌ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వరించాయి.
ఇంటర్నేషనల్ అంపైర్
ఓవైపు పిల్లల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతూనే.. క్రీడాపోటీల్లో అంపైర్‌గా ఎదగాలనుకున్నాడు రాజేందర్. పీఈటీ విధులు నిర్వహిస్తూ, బ్యాడ్మింటన్‌లో ప్రతిభను చాటుకుంటూనే అంపైర్‌గా స్థిరపడటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బ్యాడ్మింటన్ ఆటలో నియమాలు, సాంకేతిక అంశాలను క్షుణ్నంగా అర్థం చేసుకుని అంపైరింగ్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన అంపైర్ గ్రేడ్ 2 పరీక్షలో 2వ ర్యాంక్ సాధించాడు. మూడేండ్ల తర్వాత గ్రేడ్1లో పరీక్షలో అర్హత సాధించాడు. అలా రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆంపైర్గా వ్యవహరించేందుకు ఎంపికయ్యాడు.

Umpiring
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కూడా రాజేందర్‌ను అంపైర్‌గా గుర్తించింది. అటు తర్వాత బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్, పారా ఒలింపిక్స్, బ్యాడ్మింటన్ ఏషియా పోటీలకు అంపైర్‌గా బాధ్యతలు చేపట్టాడు. వీటితోపాటు ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్, థామస్ అండ్ ఉబర్ కప్, ఖేలో ఇండియా గేమ్స్, స్కూల్ గేమ్స్‌తోపాటు పలు అంతర్జాతీయ, జాతీయ టోర్నమెంట్లలో అంపైర్‌గా సమర్థంగా విధులు నిర్వహించాడు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు గెలుచుకున్నట్టే అంపైర్‌గానూ అందరి మన్ననలూ అందుకుంటున్నాడు.
సంతృప్తిని సాధించా..: కొమ్ము రాజేందర్
స్కూల్ నుంచే బ్యాడ్మింటన్ బాగా ఇష్టం. పుల్లెల గోపిచంద్, కేసీహెచ్ పున్నయ్య చౌదరి, వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రమేశ్ కుమార్, కార్యదర్శి పింగిలి రమేశ్ రెడ్డి, డి. నాగకిషన్, నిమ్మ మోహన్‌రావు, స్వర్గీయ టి.రవీందర్రావు, వేమూరి సుధాకర్ ప్రోత్సహంతో నేను ఈ స్థాయికి చేరుకున్నాను. ఒకప్పుడు కొద్దిపాటి అవకాశాలతోనే ఎన్నో పోటీల్లో గెలిచాను. ఇప్పుడు క్రీడల నిర్వహణలో అధికారిగా ఎదగాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. ఒకనాడు అడుగుపెట్టలేని అంతర్జాతీయ పోటీల్లో అంపైర్‌గా నిలిచాను. నా ప్రయత్నం ఫలించింది. సంతృప్తిని మిగిల్చింది.
– పిన్నింటి గోపాల్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- fire
- International
- Thinking
- umpire
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

