మొబైల్ ఫొటోగ్రఫీలో మరో కొత్త శైలి.. ఫ్లాట్ లే ఫొటోగ్రఫీ. ఇందులో ఒక ఉపరితలంపై వస్తువులను ఉంచి.. వాటిని పైనుంచి (టాప్ యాంగిల్స్‌లో) ఫొటోలు తీస్తారు. ఈ శైలిని ఎక్కువగా ఫుడ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, ప్రొడక్ట్ షూట్స్, క్రియేటివ్ స్టయిలింగ్ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ కెమెరాతో ఫ్లాట్ లే ఫొటోలు తీసేందుకు కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉన్నాయి. అవి పాటిస్తే మీ ఫొటోలు ప్రొఫెషనల్ లుక్‌తో ఆకట్టుకుంటాయి.
ఒక ప్లెయిన్ (సమతల) ఉపరితలంపై ఏదైనా వస్తువు(సబ్జెక్ట్)ను ఉంచి.. పై నుంచి (బర్డ్ఐ వ్యూ) ఫొటోలు తీయడమే ‘ఫ్లాట్ లే ఫొటోగ్రఫీ’. ఇది మీ సబ్జెక్ట్‌ను సరికొత్త యాంగిల్లో హైలైట్ చేస్తుంది. ఫొటోలకు సింపుల్, క్లీన్ అండ్ స్టయిలిష్ లుక్ ఇస్తుంది.
స్మార్ట్‌ఫోన్ : మంచి క్వాలిటీ కలిగిన కెమెరా ఉండాలి. 12 ఎంపీకి తగ్గకుండా ఉంటే మంచిది.
ఫ్లాష్ డిఫ్యూజర్ – కొన్నిసార్లు ఫ్లాష్ వల్ల ఫొటోలు దెబ్బతింటాయి. కాబట్టి, ఫ్లాష్ డిఫ్యూజర్‌ను వాడితే మంచిది. లేకుంటే.. సహజసిద్ధమైన వెలుతురులో తీసినా.. ఫొటోలు బాగుంటాయి.
బేస్ లేదా బ్యాక్‌గ్రౌండ్ – వస్తువు (సబ్జెక్ట్)లను అందంగా పేర్చడానికి ఒక ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ లేదా సర్ఫేస్ అవసరం. చెక్క, ఫ్యాబ్రిక్ (బట్ట)తో ఉన్న బేస్ అయినా బాగుంటుంది.
వస్తువులు – మీ సబ్జెక్ట్ మరింత హైలైట్ అయ్యేలా.. చిన్న చిన్న డెకరేటివ్ వస్తువులను ఎంచుకోవాలి.
మంచి సర్ఫేస్ : మీ సబ్జెక్ట్ క్రిస్టల్ క్లియర్‌గా రావాలంటే.. అందుకు తగ్గ బ్యాక్‌గ్రౌండ్‌ను ఎంచుకోవాలి. సింపుల్ – క్లీన్ బ్యాక్‌గ్రౌండ్.. మీ ఫొటోను మరింత హైలైట్ చేస్తుంది. వైట్ బ్యాక్‌గ్రౌండ్.. క్లాస్ లుక్‌ని ఇస్తుంది. చెక్క లేదా ఫ్యాబ్రిక్ బ్యాక్‌గ్రౌండ్ ఫొటోల్లో రస్టిక్ ఫీల్ కనిపిస్తుంది.
బ్యాక్‌గ్రౌండ్ : డార్క్ వస్తువుల కోసం లైట్ బ్యాక్‌గ్రౌండ్, లైట్ కలర్ సబ్జెక్ట్ అయితే.. డార్క్ బ్యాక్‌గ్రౌండ్ వాడుకోవాలి. కలర్ కోఆర్డినేషన్.. ఫొటోలకు స్టయిలిష్ లుక్ ఇస్తుంది.
సరైన లైటింగ్ : ఎలాంటి ఫొటోగ్రఫీకి అయినా.. లైటింగ్ కీలకం. అందులోనూ సహజసిద్ధమైన వెలుతురే మంచి ఆప్షన్. అవసరమైతే వైట్ కార్డ్ లేదా రిఫ్లెక్టర్ ఉపయోగించి.. లైట్‌ను బ్యాలెన్స్ చేయండి. ఇండోర్‌లో షూట్ చేయాల్సి వస్తే.. ఫ్లాష్‌లకు డిఫ్యూజర్‌ను అమర్చుకోవాలి. అప్పుడే.. ఫొటోలు సాఫ్ట్‌గా కనిపిస్తాయి.
డెకరేషన్ : ఈ కేటగిరిలో.. ‘లెస్ క్లటర్ – మోర్ బ్యూటీ’ కాన్సెప్ట్ బాగుంటుంది. అంటే.. తక్కువ వస్తువులను అందంగా డెకరేట్ చేస్తే.. ఫొటోలు ఎక్కువ అందంగా వస్తాయన్నమాట. ఇందుకోసం మీరు హైలైట్ చేయాల్సిన ప్రధాన వస్తువు (సబ్జెక్ట్)ను మధ్యలో ఉంచి, మిగతావాటిని చుట్టూ అమర్చండి. ట్రయాంగిల్ సెట్అప్, సర్కిల్ ఫామేషన్, లైనియర్ అరేంజ్మెంట్ వంటివి ఫొటోలకు కొత్త లుక్‌ను ఇస్తాయి. ఎక్కువ ప్రాప్స్ వేయడం కంటే.. ముఖ్యమైన వస్తువులను మాత్రమే ఫ్రేమ్‌లో ఉంచండి. ఫొటోలో బ్రీతింగ్ స్పేస్ (ఖాళీ ప్రదేశం) ఉండేలా చూసుకోవాలి.
టాప్ యాంగిల్ : ఫ్లాట్ లే ఫొటోగ్రఫీలో టాప్ యాంగిల్స్‌లోనే ఎక్కువగా షూట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఫోన్‌ను రెండు చేతులతో పట్టుకొని.. ఫొటోలు తీయాలి. లేకుంటే.. కెమెరా ఒరిగిపోతే ఫొటోలు అసంతృప్తికరంగా ఉంటాయి. మెట్లపై నిలబడి లేదా ట్రైపాడ్‌ను ఉపయోగించి మరింత క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.
ఫోన్ కెమెరా సెట్టింగ్స్ : ఫొటోలను తర్వాత ఎడిట్ చేసుకోవడానికి మాన్యువల్ మోడ్‌లో ఉంచండి. ISO 100 లేదా 200 ఉంటే సరిపోతుంది. లేకుంటే.. ఫొటోల్లో నాయిస్ పెరుగుతుంది. షట్టర్ స్పీడ్ 1/60 లేదా 1/125 ఉంచే చాలు. ఫోకస్, ఎక్స్పోజర్ను మాన్యువల్‌గా సెట్ చేయండి.
ఎడిటింగ్ అండ్ ఫిల్టర్స్ : ఫ్లాట్ లే ఫొటోలను ఎడిట్ చేయడానికి Snapseed, Lightroom, VSCO వంటి యాప్స్ ఉపయోగించండి.
ఫైనల్‌గా.. ఫ్లాట్ లే ఫొటోగ్రఫీ అనేది ఒక అందమైన కళ! సరైన లైటింగ్, బ్యాలెన్స్, అరేంజ్మెంట్స్తో మొబైల్ ఫొటోగ్రఫీలోనూ ప్రొఫెషనల్ ఇమేజెస్ తీసుకోవచ్చు. మీ ఫొటోలను ఇన్‌స్టా, పింటరెస్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసి.. క్రియేటివ్ ఫీడ్ సృష్టించుకోండి!