ఔట్‌డోర్ క్యాంపెయినింగ్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎక్సోడ్’ సంస్థ.. ‘ఎయిర్ స్టేషన్ పీఓడీ-01’ను రూపొందించింది. ఒకేసారి నలుగురు వ్యక్తులకు నీడనిచ్చే ఈ ఎయిర్ స్టేషన్.. ఔట్‌డోర్ క్యాంపెయినింగ్లోనే ఓ సరికొత్త అధ్యాయమని సంస్థ చెబుతున్నది. క్యాప్సుల్ డిజైన్‌తో వస్తున్న ఈ నయా టెంట్.. 4.2 చదరపు మీటర్ల స్థలాన్ని అందిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే.. ఇంటినే ఔట్డోర్కు తీసుకెళ్లినట్టుగా ఉంటుంది. దాంతో కేవలం వీకెండ్లో ఒకటి రెండు రోజులు మాత్రమే కాదు.. నెలల తరబడి కూడా ఔట్‌డోర్ క్యాంప్‌లో ఉండొచ్చు. ఇది వాటర్ ప్రూఫ్. వానకాలంలో క్యాంప్‌లను ఇష్టపడేవారికి ఈ టెంట్ మంచి ఆప్షన్. తీవ్రమైన గాలులను కూడా తట్టుకొని నిలబడగలదు. అంతేకాదు.. కేవలం 8.5 కిలోల బరువు మాత్రమే ఉండే ఈ క్యాప్సుల్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఐదే ఐదు నిమిషాల్లో ఏ ప్రదేశాన్నయినా మీ పర్సనల్ గదిగా మార్చేసుకోవచ్చు. సెల్ఫ్ స్టాండింగ్ డిజైన్, రెండు టన్నెల్ డోర్లు, వాల్ ఆర్గనైజేషన్లాంటి ఫీచర్లు ఉన్నాయి. అన్ని సీజన్లకూ అనుకూలంగా ఉండే ఈ ఎయిర్ స్టేషన్ ధర.. 2,26,000. en.exod.storeద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చు.
ఒక్క పరికరం.. ఎన్నో పనులు!
మ్యాగ్‌సేఫ్ టెక్నాలజీతో ఇప్పటికే ఎన్నో రకాల వైర్లెస్ చార్జర్లు వచ్చాయి. వాటన్నిటికీ భిన్నంగా.. అమెరికాకు చెందిన ‘యాంకర్ వర్క్’ సంస్థ సరికొత్త చార్జర్‌కు రూపకల్పన చేసింది. యాంకర్ వర్క్ ఎస్600 పేరుతో వస్తున్న ఈ పరికరం.. మ్యాగ్‌సేఫ్ చార్జర్గానే కాకుండా స్పీకర్, ఫోన్ స్టాండ్‌గానూ పనిచేస్తుంది. ఈ 15 వాట్స్ వైర్లెస్ చార్జర్‌కు 360 డిగ్రీల సరౌండ్ సౌండ్ స్పీకర్‌ను స్టాండ్‌గా ఏర్పాటుచేశారు. ఓవైపు ఫోన్‌ను చార్జ్ చేస్తూనే మనకు ఇష్టమైన పాటలను వినిపిస్తుంది. అంతేకాదు, 70 డిగ్రీల అడ్జస్టబుల్ ఫోన్ స్టాండ్‌గానూ ఉపయోగపడుతుంది. ఇందులోని 4 మైక్ సిస్టమ్ సాయంతో ఎలాంటి ఇబ్బందిలేకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ సిస్టమ్.. 300లకు పైగా నాయిస్ రకాలను గుర్తించగలదు. 16 గంటల బ్యాటరీ బ్యాకప్ కలిగిన యాంకర్ వర్క్ ఎస్600 త్రీ ఇన్ వన్ పరికరం ధర.. రూ. 15,000. us.ankerwork.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
లో కాస్ట్లో హై క్వాలిటీ!
సోషల్ మీడియాలో ఇప్పుడంతా వీడియో కంటెంట్ క్రియేటర్లదే హవా! క్రియేటివ్‌గా వీడియోలు తీస్తూ.. లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటున్నారు. సబ్‌స్ర్కైబర్ల మనసు గెలిచేందుకు 4కే, 2కే రిజల్యూషన్లలో వీడియోలను తీస్తున్నారు. ఇందుకోసం ‘హై క్వాలిటీ’ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ ధరలోనే ఎక్కువ నాణ్యత, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఓ వీడియో కెమెరా మార్కెట్లోకి దూసుకొచ్చింది. ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘లాజిటెక్’, అమెరికాకు చెందిన ప్రముఖ కెమెరాల తయారీదారు ‘మీవో’తో జతకట్టి.. ఈ ‘మీవో కోర్’ కెమెరాను విడుదల చేసింది. 8.3 మెగా పిక్సెల్ సెన్సర్‌తో వస్తున్న ఈ కెమెరా.. 6 గంటలపాటు 4కే వీడియోలను రికార్డ్ చేస్తుంది. 4కేలో లైవ్ స్ట్రీమింగ్‌ను కూడా అందిస్తుంది. ఇందుకోసం ‘మీవో’ మల్టీక్యామ్ యాప్‌ను ఉపయోగిస్తుంది. వైఫై 6ఈ, బ్లూటూత్ 5.1 ద్వారా ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ప్రొఫెషనల్ కెమెరాలకు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు కలిగిన ఈ కెమెరా ఖరీదు.. రూ. 83,500. mevo.comలో లభిస్తుంది.
అందంగా.. అనుకూలంగా..
బయటికి వెళ్లినప్పుడు వాన పడితే.. స్మార్ట్‌ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తడవకుండా కాపాడుకోవడం మహిళలకు కాస్త కష్టమే! ఇక చేతిలో ల్యాప్‌టాప్ ఉందంటే.. అంతే! భుజానికి హ్యాండ్ బ్యాగ్ ఉన్నప్పటికీ.. ఇప్పుడొస్తున్న అనేక రకాల బ్యాగులు వాటర్‌ప్రూఫ్ కావు. ఈ సమస్యకు ప్రముఖ ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ మిరాగియో చక్కని పరిష్కారం చూపింది. ‘ది క్రూయిజ్ కాన్వాస్ టోట్’ పేరుతో వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ బ్యాగులను తీసుకొచ్చింది. కోటెడ్ కాన్వాస్ మెటీరియల్‌తో.. వర్షాకాలానికి అనుగుణంగా వీటిని తీర్చిదిద్దింది. ఇందులోని ల్యాప్‌టాప్ స్లీవ్‌లో.. 14 అంగుళాల ల్యాప్‌టాప్ సులభంగా అమరిపోతుంది. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులు మొదలుకొని.. మేకప్ సామగ్రి వరకూ దాచుకునేలా మరిన్ని ప్యాకెట్లు ఉన్నాయిందులో! క్రీమ్ కలర్‌కు బ్లాక్/ బ్రౌన్ కాంబినేషన్లో, యునిక్ మోడల్లో వస్తున్న ఈ బ్యాగులు లైట్‌వెయిట్ కూడా! ఈ బ్యాగు ధర.. రూ. 5,999. miraggiolife.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.