Miracle Garden | ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో దుబాయ్ ప్రత్యేకమైనది. ఎడారి దేశంలో వెలసిన ఈ అద్భుత నగరి భూతల స్వర్గంగా వినుతికెక్కింది. దుబాయ్‌లో ఉన్న ఆకర్షణీయమైన ప్రదేశాల్లో ఈ మిరాకిల్ గార్డెన్ ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద సహజమైన పూల తోటగా రికార్డులకెక్కింది. సృజనాత్మకత మేళవింపుతో రూపుదిద్దుకున్న ఈ నందనవనంలో అణువణువూ అచ్చెరువొందిస్తుంది. బంతిపూలు, గులాబీలు ఇలా పూలజాతులను లెక్కించడం అందరికీ సాధ్యమేయ్యే పనికాదు.
ఈ తోటకు ఏ రోజు వెళ్లినా సుమారు 15 కోట్ల విరులు పలకరిస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ గార్డెన్ 72వేల చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. మర్మయోగి సినిమాలోని ఆరుద్ర పాట ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ అన్నట్టే ఉంటుందీ ఉద్యానవనం. ఒక్క పడవే కాదు, పూల కోట, పూల గడియారం, ఎగబాకిన తీగలతో ఏర్పడిన సాఫ్ట్‌టాయ్స్ చూపు తిప్పుకోనివ్వదు. హృదయాకారంలో ఉన్న ఈ పూల వనం దారుల్లో నడుస్తూ ఉంటే ‘ఇది మైమరపించే హాయి.. ఇక రానే రాదీ రేయి’ అని ఆరుద్ర చెప్పిన అనుభూతే కలుగుతుంది! ప్రఖ్యాతమైన భవనాల నమూనాలను పూలతో నిర్మించిన ఈ గార్డెన్ పేరుకు తగ్గట్టుగానే మిరాకిల్!
వంద రకాలకుపైగా పూల జాతులు ఉన్న ఈ ఉద్యానవనంలో సృష్టిలో ఉన్న అన్ని రంగులూ కనువిందు చేస్తాయి. ఈ వన్నెల వనంలో ల్యాండ్ అయినట్లుగా ఉన్న ఎయిర్ బస్ 380 నమూనా కూడా పూల మొక్కలతోనే నిర్మించారు. ఈ సూపర్ జంబో ఎయిర్ క్రాప్ట్ కోసం అయిదు లక్షల పూల మొక్కలు ఉపయోగించారట. ఒక రూపం కోసం అత్యధిక పూలు వినియోగించిన నిర్మాణంగా ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులోనే ఉన్న బటర్ ఫ్లై పార్క్ మరింతగా అలరిస్తుంది.
పూల వర్ణాలకు పోటీగా రంగురంగుల సీతాకోక చిలుకలు విరులపై వాలుతూ, గాల్లో తేలుతూ పర్యాటకులకు ఆనందాన్ని పంచుతాయి. కనువిందు చేసే ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను మాత్రమే కాదు ఫొటోగ్రఫీలో రాణిస్తున్నవారికీ కేరాఫ్‌గా నిలుస్తున్నది. నవంబర్ నుంచి మే వరకు ఈ నందన వనానికి పర్యాటకులు తాకిడి అధికంగా ఉంటుంది. కాస్త చల్లదనం ఎక్కువగా ఉండే డిసెంబర్లో ఇక్కడ విరులు కొల్లలుగా పూసి అలరిస్తాయి. శని, ఆదివారాల్లో మాత్రమే ఈ పార్క్ తెరిచి ఉంటుంది.