అహంభావం పోగొట్టుకోవాలంటే సాటివారికి సేవ చేయడమే ఉత్తమమైన మార్గమని జాతిపిత మహాత్మా గాంధీ మాట. బిహార్ రాష్ట్రం సమస్తీపుర్కు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడు సరిగ్గా అదే చేస్తున్నారు. ఆయన పేరు డాక్టర్ కౌశల్ కిషోర్ మిశ్రా. సమస్తీపుర్ జిల్లా ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 46 ఏండ్ల మిశ్రా తన డ్యూటీ తర్వాత మారుమూల గ్రామాల పేదలకు వైద్య సహాయం అందిస్తూ సామాజిక సేవతో తృప్తి చెందుతున్నారు. ఆయన కుష్ఠు వ్యాధిగ్రస్తులకు సేవ చేయడమే కాకుండా, ఈ వ్యాధి గురించి ప్రజల్లో పేరుకుపోయిన అపోహలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
వంద సంవత్సరాల క్రితం గాంధీజీ కూడా ఇదే పనిచేయడం గమనార్హం. కుష్ఠు ఓ అంటువ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలాది మంది కొత్తగా ఈ వ్యాధి బారినపడుతుంటారు. కొత్తగా నమోదయ్యే కేసులలో సగం భారతదేశం నుంచే ఉండటం శోచనీయం. చికిత్స ఉన్నప్పటికీ మనదేశంలో బిహార్ సహా అనేక రాష్ర్టాల్లో కుష్ఠును రూపుమాపడం సాధ్యం కావడం లేదు. కుష్ఠు రోగులను వెలివేస్తుండటమే దీనికి ప్రధాన కారణం. గ్రామాల్లో ఈ దుస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటిది కుష్ఠు రోగులకు సేవచేయడంలో డాక్టర్ మిశ్రా శ్రద్ధ చూపుతున్నారు. “కుష్ఠు రోగులు సమాజ నిర్లక్ష్యానికి గురవుతారు. కానీ వాళ్లు కూడా సమాజంలో భాగమే. ఇతరులలాగే వారికీ సాయం అందాలి. తగినంత గౌరవం దక్కాలి” అని మిశ్రా చెబుతారు.
ఈ క్రమంలో తనవంతుగా కుష్ఠు రోగులకు, గ్రామీణ ప్రజలకు ఆయన అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఆయన తన వేతనంలో పదిహేను శాతం వరకు పేదలు, అవసరంలో ఉన్నవాళ్ల కోసం ఖర్చు చేస్తారు. వైద్య సహాయం మాత్రమే కాకుండా విద్యార్థులు మంచిగా చదువుకోవడానికి ఆయన ఆపన్న హస్తం అందిస్తున్నారు. సమస్తీపుర్ ప్రాంతానికి ఇంతమంచి వైద్యుడు దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నారు అక్కడి ప్రజలు. అందుకే వైద్యుడు నారాయణుడితో సమానం అంటారు. దాన్ని నిజం చేయడమే వైద్యుల నుంచి సమాజం ఆశించేది.