ఎక్కడ చూసినా బుల్లెట్టు బండి పాటే. ఓ జంట అయితే రాత్రికి రాత్రే ఆ పాటతో ఫేమస్ అయింది. ఒరిజినల్ సాంగ్ కూడా లక్షల వ్యూస్ కొల్లగొట్టింది. పాటలోని సాహిత్యం, పదాల కూర్పు, తెలంగాణతనం అందర్నీ కట్టిపడేశాయి. ఈ ఘన విజయాన్ని చూసి పాట రచయిత కాటికె లక్ష్మణ్ పరవశించిపోతున్నాడు.
bullettu bandi | కాటికె లక్ష్మణ్.. ‘బుల్లెట్టు బండి’ పాట రచయిత. జానపదాన్ని సినిమా హంగులతో జోడించి మెప్పించాడు. గాయని మోహన భోగరాజు కోరిక మేరకు.. కొద్దిరోజుల్లోనే మంచి సాహిత్యం ఉన్న పాటను అందించాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలోని నిరుపేద కుటుంబంలో పుట్టిన లక్ష్మణ్‌కు చిన్నప్పటి నుంచీ జానపదాలంటే అమితాసక్తి.
‘నీబుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా..
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ..
నా అందాల దునియాను సూపిత్తపా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ’
అంటూ లక్ష్మణ్ రాసిన పాట కేశంపేట నుంచి కాలిఫోర్నియా వరకు, ఆమనగల్ నుంచి అట్లాంటా వరకు, చౌలపల్లి నుంచి శాన్ఫ్రాన్సిస్కో వరకు మార్మోగుతున్నది. ‘పట్టూ చీరను కట్టుకున్నుల్లో.. కట్టుకున్నా.. టిక్కీ బొట్టే పెట్టుకున్నుల్లో పెట్టుకున్నా’ అంటూ ఓ పల్లెటూరి అమ్మాయి తన కలల రాకుమారుడి గురించి పాడే ఈపాటకు నెటిజనం ఫిదా అయిపోయారు. ‘ఏముందా పాటలో అంతగా ఆకట్టు కోవడానికి?’ అంటే.. గుప్పుమనే తెలంగాణ మట్టి పరిమళం ఉంది. నిండైన జీవం ఉంది. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లల కలల ప్రపంచం ఉంటుంది. అమ్మానాన్నల పెంపకం, అన్నదమ్ముల ఆత్మీయానురాగాలు సజీవంగా కనిపిస్తాయి. వీటన్నిటినీ పొందికగా అల్లి, అందమైన మాలగా కూర్చాడు లక్ష్మణ్.కవలలుగా అమ్మ కడుపునే కాదు, కళనూ సమానంగా పంచుకున్నారు రామ్-లక్ష్మణ్. రామ్ గాత్రంతో అలరిస్తే, లక్ష్మణ్ సాహిత్యంతో కట్టిపడేస్తాడు. నిర్దవెల్లిలోని నిరుపేద దంపతులు కాటికె లక్ష్మమ్మ-జంగయ్యల కుమారులు వీళ్లు. తల్లి వ్యవసాయ కూలీ, తండ్రి మేస్త్రీ. రామ్ – లక్ష్మణ్ పదోతరగతి సొంతూర్లో పూర్తిచేశారు. ఇంటర్, డిగ్రీ షాద్‌నగర్‌లో చదివారు.
సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు వచ్చారు రామ్ లక్ష్మణ్. ఉపాధి కోసం ప్రైవేట్ ఆల్బమ్స్, జానపద పాటలు పాడారు. లక్ష్మణ్ ఇప్పటి వరకు 300 పాటలు రాశాడు. వాటిని రామ్ స్వయంగా పాడాడు. అందులో కొన్ని సినిమాల్లో కూడా వచ్చాయి. ఇటీవల, ‘నీ బుల్లెట్ బండి’ పాటకు తిరుగులేని పాపులారిటీ రావడంతో లక్ష్మణ్‌కు మంచి పేరు వచ్చింది. ఈ అన్నదమ్ముల కలయికలో వచ్చిన ‘నువ్వంటే పిచ్చి’, ‘గాయపడిన మనసు’, ‘బాగుండాలమ్మ’ తదితర ఆల్బమ్ సాంగ్స్ జనాదరణ పొందాయి. లక్షల వ్యూస్‌ను దక్కించుకున్నాయి. ఈ గుర్తింపుతో చిన్న సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశం కూడా వచ్చింది. గేయ రచయితలు చంద్రబోస్, అందెశ్రీ, గోరెటి వెంకన్న, కాసర్ల శ్యామ్ తదితరులు లక్ష్మణ్‌కు ఫోన్ చేసి అభినం దించారు. ‘నేను అచ్చమైన గ్రామీణ భాషనే ఎంచుకుంటాను. సామాన్యుల సంభాషణలే నా ముడిసరుకు. మన సంప్రదాయాలను అందులో జోడిస్తాను’ అంటాడు లక్ష్మణ్. ‘తమ్ముడి పాటకు దృశ్యరూపం ఇవ్వడంలో నాకు ఆనందం ఉంది’ అని చెబుతాడు రామ్.
ఇప్పటి వరకూ చాలా ఆల్బమ్స్‌లో పాడాను. గాయకుడిగా మరింత గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తున్నా. ‘బుల్లెట్టు బండి’ పాటతో మాకు అవకాశాలు పెరిగాయి. చాలా సంతోషంగా ఉన్నది. సామాజిక మాధ్యమాలు మంచి పాటలను ప్రోత్సహిస్తున్నాయి. జానపదాలను నెత్తిన పెట్టుకుంటున్నాయి.
– కాటికె రామ్
ఇప్పటి వరకు రాసిన 300 పాటల్లో కొన్ని మంచి గుర్తింపును తెచ్చాయి. ప్రత్యేకించి, బుల్లెట్ బండి ఆల్బమ్ సాంగ్ ఎంతో పాపులారిటీని తీసుకొచ్చింది. సినిమా రంగంలో గేయ రచయితగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. జానపదాలు నాకు ప్రాణం.
– కాటికె లక్ష్మణ్
–గుండ్రాతి రమణగౌడ్ ,కేశంపేట
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా పాట పెడితేనే పాలు తాగుతున్న కొండెంగ..!! ఎక్కడంటే?
Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!
Royal Enfield | తెలంగాణలో దూసుకెళ్తున్న బుల్లెట్టు బండి!
Royal Enfield: బుల్లెట్టు బండి పుట్టు పూర్వోత్తరాలు తెలుసా?