Anil kumar Rachamalla | ముక్కూ మొహం తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా చేసిన అర్థంలేని కామెంట్లు ఆ ఇంజినీర్ మనసుకు గాయం చేశాయి. చదువు, పలుకుడి ఉన్న తనలాంటివారి పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుల గతి ఏమిటి? అన్న ఆలోచనతో తల్లడిల్లిపోయారు. ‘ఇంటర్నెట్ ఎథిక్స్’పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నడుం కట్టారు. ‘సైబర్ గురు’గా అందరి ప్రశంసలూఅందుకుంటున్నారు అనిల్‌కుమార్ రాచమల్ల.
రామాయణ మహాభారతాలు, సుమతీ వేమన శతకాలు, పంచతంత్ర కథలు సమాజంలో ఎలా బతకాలి? సాటి వారితో ఎలా మెలగాలి? పెద్దలతో ఏ విధంగా ప్రవర్తించాలి? బంధువులతో ఎలా సంభాషించాలి? స్నేహితులతో ఎలా మసలుకోవాలి? అన్నది బోధించాయి. తరం మారింది. ఆధునిక యుగం వచ్చింది. మానవ సంబంధాలన్నీ డిజిటల్ బంధాలుగా మారిపోయాయి. వరదలా వచ్చి పడిన సాంకేతిక పరిజ్ఞాన ప్రవాహంలో పడి మనుషులు కొట్టుకుపోతున్నారు. నైతిక విలువలు లేకుండా పోతున్నాయి. పూర్తి వ్యక్తిగత సమాచారాన్ని కూడా ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. ఏది తోస్తే అది రాసేస్తున్నారు. ఇతరుల మనోభావాలను గౌరవించే సంగతి అటుంచితే, ఏకంగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు? ఈ చర్యల వల్ల సున్నిత మనస్కులు మానసిక వేదనకు గురవుతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమాయకులు సైబర్ కేటుగాళ్ల బారిన పడుతున్నారు. అనిల్ రాచమల్ల కూడా ఆ బాధ అనుభవించారు.
హైదరాబాద్ జిల్లా సైదాబాద్‌కాలనీకి చెందిన డాక్టర్ పుష్పవల్లి, విశ్రాంత ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రాచమల్ల వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు అనిల్. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేశారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. అంతే కాదు సప్లయ్ చైన్, ఒరాకిల్, సిక్స్ సిగ్మా, ప్రాజెక్టు మేనేజ్మెంట్, సర్వీస్ డెలివరీ విభాగాల్లో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్లు పొందారు. ఆ అర్హతలతో ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లారు. రెండు దశాబ్దాలకు పైగా దాదాపుగా పద్దెనిమిది దేశాల్లో పనిచేశారు. 2012లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పుడే ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా గుర్తు తెలియని వ్యక్తి తన గురించి చేసిన కామెంట్లు మానసిక క్షోభకు గురిచేశాయి. తనలాంటి బాధితులు సమాజంలో చాలామందే ఉన్నారని అర్థమైంది. దానితో డిజిటల్ స్పేస్‌లో ఇతరులకు సహాయం చేసేయాలని నిశ్చయించుకున్నారు. సోషల్ మీడియా వేధింపులను నిలువరించే సంకల్పంతో ‘ఎండ్ నౌ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టారు. విద్యాసంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలతో కలిసి చైతన్య కార్యక్రమాలు ప్రారంభించారు. కలాన్ని ఝళింపించారు. రేడియో జాకీగా గళాన్నీ వినిపించారు. ఇటీవల ‘డిజిటల్ వెల్బీయింగ్ ’పై జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు నిపుణులలో అనిల్ కూడా ఒకరు. ‘ముఖ్యంగా చిన్నారులు ఆన్లైన్ వలలో ఇట్టే పడిపోతున్నారు. తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. బిడ్డలకు జాగ్రత్తలు నేర్పాలి. అకౌంట్లను పర్యవేక్షిస్తూ ఉండాలి’ అని సలహా ఇస్తారాయన.
మీరు రాజకీయ నాయకుడో, మార్కెటింగ్ నిపుణుడో, సెలబ్రిటీనో అయితే తప్ప.. మీ సోషల్ మీడియా ఖాతాను ‘ప్రైవేట్’గా ఉంచుకోవడమే సురక్షితం. మనం షేర్ చేసిన ప్రతి సమాచారం రికార్డు అవుతుంది. వాటి ఆధారంగా చాలా సంస్థలు మీ మనస్తత్వాన్ని, కొనుగోలు తత్వాన్ని అంచనా వేస్తాయి. మీ వ్యక్తిగత ఫొటోలు, సంభాషణలు పడకూడని చేతుల్లో పడే ప్రమాదం ఉంది. వాటి ఆధారంగా మీ పాస్‌వర్డ్‌ను ఊహించడం పెద్ద కష్టమూ కాదు. ఫొటో మార్ఫిండ్ ద్వారా బ్లాక్ మెయిల్‌కు పాల్పడవచ్చు. మీ ఐడెంటిటీతో ఆన్లైన్లో అప్పులు చేయవచ్చు. దీనివల్ల మీకు ఆర్థిక నష్టం కూడా. దాంతోపాటు మీ క్రెడిట్ హిస్టరీ ఖరాబు అవుతుంది. భవిష్యత్తులో రుణాలు పుట్టకపోవచ్చు.
♦ సోషల్ మీడియాలో ఎప్పుడూ ‘నా గురించి..’ అన్న కాలమ్ జోలికి వెళ్లకండి.
♦ వ్యక్తిగతంగా పరిచయం ఉన్నవారినే స్నేహితుల బృందంలోకి ఆహ్వానించండి.
♦ చివర్లో ‘లాగ్ అవుట్’ కావడం అస్సలు మరచిపోకండి.
♦ బలమైన పాస్వర్డ్ ముఖ్యం. దాన్ని కూడా తరచూ మారుస్తూ ఉండాలి.
♦ అనుమానాస్పద వ్యక్తులను బ్లాక్ చేయండి.
– మ్యాకం రవికుమార్