స్నేహిల్ కేసు పరిష్కారం కావడంతో హుషారుగా స్టేషన్‌కు కదిలాడు ఇన్స్పెక్టర్ రుద్ర. స్టేషన్లోకి ఎంటర్ అయ్యాడో లేదో.. ల్యాండ్‌ఫోన్ రింగ్ అయ్యింది. పొద్దుపొద్దున్నే ఏది వినాల్సి వస్తుందోనంటూ భయపడుతూనే లోపలికి నడిచాడు. ఇంతలో ‘సార్.. జయానగర్‌లో క్రైమ్ జరిగిందట’ అంటూ కేకేసినంత పనిచేశాడు హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి.
అటు నుంచి డీటెయిల్స్ తీసుకొన్న రామస్వామి రుద్ర క్యాబిన్లోకి కదిలాడు. ‘బాబాయ్.. ఈ మధ్య క్రైమ్ కేసులంటే మీకు భలే ఇంట్రెస్టు కలుగుతున్నట్టు అనిపిస్తున్నది’ ఆట పట్టించాడు రుద్ర. ‘అదేంలేదు సార్.. స్నేహిల్ బాబు కేసులో మీరు అంత ఈజీగా హంతకురాలిని ఎలా పట్టుకొన్నారా? అని ఆలోచించా. తర్వాత వచ్చే ఏ కేసైనా నేనే సాల్వ్ చేయాలని నిర్ణయించుకొన్నా’ అంటూ ఛాతీని వెడల్పు చేసి చూరును చూసుకొంటూ గొప్పలకు పోయాడు రామస్వామి. ‘సరే.. మరి. మీరే ఈ కేసు సాల్వ్ చేద్దురుగానీ. పదండి’ అంటూ జయానగర్‌కు కదిలింది రుద్ర బృందం.
క్రైమ్ జరిగిన ఇంటిచుట్టూ స్థానికులు పెద్దయెత్తున గుమిగూడారు. దీంతో రుద్ర బృందంలో ఒకింత ఆసక్తి పెరిగింది. ‘కొంపదీసి ఇది ఏ సెలెబ్రిటీ ఇల్లయితే కాదు కదా సార్’ అన్నాడు ఓ కానిస్టేబుల్. ‘ఒకవిధంగా సెలెబ్రిటీ ఇల్లే. సీరియల్స్‌లో అడపాదడపా పాటలు పాడే గాయని రేఖ ఇల్లు ఇది’ చెప్పాడు రామస్వామి. స్థానికులను పక్కకు జరిపి, బారికేడ్లు ఏర్పాటు చేసి రుద్ర బృందం లోపలికి వెళ్లింది.
తలుపు తీయగానే హాల్లోనే రక్తపు మడుగులో పడి ఉన్న రేఖ మృతదేహం కనిపించింది. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మరణించినట్టు అర్థమవుతున్నది. ఆమె చేతిలో రివాల్వర్ అలాగే ఉన్నది. హాల్ మొత్తం రుద్ర టీమ్ క్షుణ్నంగా పరిశీలించసాగింది. మరోవైపు ఫోరెన్సిక్ టీమ్ సాక్ష్యాలు, ఆధారాల కోసం ఇల్లంతా జల్లెడ పడుతున్నది. టేబుల్ మీద ఉన్న ఓ టేప్‌రికార్డర్‌ను గమనించాడు రుద్ర. ఆన్ చేయాలంటూ కానిస్టేబుల్‌ను పురమాయించాడు. అదే చేశాడు కానిస్టేబుల్.
‘నా పేరు రేఖ. సీరియల్స్‌లో పాటలు పాడుతాను. ఒంటరి జీవితం భరించలేక చావాలనుకొంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా భర్త మంచివారు. నేను చనిపోయాక.. నా ఆస్తి నా భర్తకు వచ్చేలా చేయండి. సెలవు..’ అంటూ రేఖ వాయిస్ ముగించగానే బుల్లెట్ సౌండ్ వినిపించింది. రికార్డింగ్ విన్నవెంటనే.. ‘బాబాయ్.. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇప్పుడు ఈ టేప్‌రికార్డర్ వాడటమేంటి?’ అడిగాడు రుద్ర. ‘రేఖ గారి స్పెషల్ అదే సార్.. తన వాయిస్‌ను ముందు క్యాసెట్లో రికార్డ్ చేసుకోవడం ఆమెకు అలవాటు.
ప్రతి పాటా పాడే ముందు ఆమె చేసే పని ఇదే’ అంటూ హాల్‌ను ఎగాదిగా చూస్తున్నాడు రామస్వామి. ‘సరే. మరి ఈ కేసు సాల్వ్ అయినట్లేనా?’ రామస్వామిని సూటిగా అడిగాడు రుద్ర. ‘ఇందులో మిస్టరీ ఏముంది సార్? క్లియర్‌గా సూసైడ్ అని తెలిసిపోతుందిగా’ అన్నాడు రామస్వామి. ‘ఒకసారి, రేఖ గారి భర్తకు కబురుపెట్టండి’ అన్నాడు రుద్ర. ఎందుకో అని మనసులో అనుకొన్న రామస్వామి సరేనంటూ తలూపాడు. ఫార్మాలిటీస్ పూర్తిచేసిన రుద్ర టీమ్.. స్టేషన్‌కు తిరిగొచ్చింది.
గంటన్నర తర్వాత రేఖ భర్త సుదర్శనం స్టేషన్‌కి వచ్చాడు.‘మీరేనా సుదర్శనం?’ అడిగాడు రుద్ర. అవునన్నట్టు తలూపాడు సుదర్శనం కన్నీటిపర్యంతమవుతూ. ‘మీ భార్య మరణంపై మీకేమైనా అనుమానాలు ఉన్నాయా?’ అడిగాడు రుద్ర. ‘లేదు’ అన్నట్టు తలూపాడు సుదర్శనం. ‘మీ భార్య మీరు వేర్వేరుగా ఉంటున్నారా?’ రుద్ర ప్రశ్నకు అవునన్నట్టు తలూపిన సుదర్శనం.. ఇద్దరిమధ్య వచ్చిన అభిప్రాయభేదాల గురించి ఏకరువు పెట్టాడు. అయితే, తన భార్య ఎంతో మంచిదని చెప్పుకొచ్చాడు. ‘పొద్దున క్రైమ్స్పాట్లో మీరు కనిపించలేదు. రాలేదా?’ అడిగాడు రుద్ర.
‘లేదు’ అటునుంచి సమాధానం. ‘మీ భార్య మంచిదని మీరే అంటున్నారు. అలాంటిది ఆమెను చివరిసారి కూడా చూడాలని మీకు అనిపించలేదా?’ మళ్లీ రుద్ర సూటి ప్రశ్న. ‘అనిపించింది. అయితే, అందమైన ఆమె తల ఇప్పుడు బుల్లెట్‌తో ఛిద్రమై ఉండటాన్ని చూసే ధైర్యం నాకు లేదు’ బదులిచ్చాడు సుదర్శనం. ‘క్రైమ్ స్పాట్‌కు రాకుండా ఆమె ఎలా చనిపోయిందో మీకెలా తెలుసు?’ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ‘పరిచయస్తుల ద్వారా తెలిసింది’ అంతేసూటిగా సమాధానమిచ్చాడు సుదర్శనం. రేఖ మరణం సూసైడ్ అని అంత కచ్చితంగా తెలుస్తున్నప్పటికీ, కేసు మూసేయకుండా రుద్ర ఇంకా ఎందుకు సాగదీస్తున్నాడో రామస్వామికి అర్థంకావట్లేదు.
‘మిస్టర్ సుదర్శనం.. క్రైమ్ స్పాట్‌కు రాలేదని ఎందుకు అబద్ధం చెప్పారు’ బాంబు పేల్చాడు రుద్ర. ‘మీరు చెప్పేది అబద్ధం’ అంటూ ఇన్స్పెక్టర్ వంక ఆగ్రహంగా చూశాడు సుదర్శనం. ‘కాదు నిజం’ అన్నాడు రుద్ర. “పొద్దున క్రైమ్స్పాట్లో మీరు కనిపించలేదు. రాలేదా?’ అని ఇంతకుముందే మీరే నన్ను అడిగారు. ఇప్పుడు మాటమారుస్తారేంటి?’ రుద్రను ఎదురు ప్రశ్నించాడు సుదర్శనం. ‘కేసు సాల్వ్ చేయాలన్న లక్ష్యంతో ఎన్నెన్నో చెప్తాం. అలాగే నేను అబద్ధం చెప్పా. నువ్వు ఏ తప్పూ చేయకుంటే, లేదు వచ్చా అని నిజం చెప్పాల్సింది. అది కాకుండా రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావ్. నేను క్రైమ్ స్పాట్లో నిన్ను చూశా’ గద్దించాడు రుద్ర. అసలేం జరుగుతుందో స్టేషన్‌లోని వారెవ్వరికీ అర్థం కావట్లేదు. ఇద్దరిమధ్య వాగ్వాదంతో స్టేషన్ వాతావరణం వేడెక్కింది.
‘అవును సార్. మీరు చెప్పింది నిజమే. భార్య చనిపోయిందన్న బాధతో చివరిసారి చూడాలని పొద్దున వచ్చా’ ముఖానికి చేతులు పెడుతూ ఏడ్చాడు సుదర్శనం. ‘మరి, నిన్న రాత్రి ఎందుకు వెళ్లావ్?’ రుద్ర ప్రశ్నకు సుదర్శనం కింద భూకంపం వచ్చినంత పనైంది. ‘నే.. నేను వెళ్లడమేంటి సార్?’ భయపడుతూ అడిగాడు సుదర్శనం. ‘అబద్ధం చెప్పొద్దు సుదర్శనం.
మీరు నిన్న అర్ధరాత్రి దాటాక రేఖ గారి ఇంటికి వెళ్లినట్టు పక్కింటి జగన్నాథం తన స్టేట్మెంట్లో ఇచ్చారు’ అంతకుముందే సేకరించిన సమాచారాన్ని సుదర్శనం ముందుంచాడు రుద్ర. బిత్తరపోయిన సుదర్శనం.. ‘వెళ్లినంత మాత్రాన, రేఖను నేను చంపినట్టా? ఆమె సూసైడ్ చేసుకొందనడానికి టేప్‌రికార్డరే సాక్ష్యం’ నిర్భయంగా చెప్పాడు సుదర్శనం. కోపంతో చివాలున లేచిన రుద్ర.. సుదర్శనాన్ని నాలుగు ఉతికాడు. తనదైన శైలిలో విచారించడంతో ఆస్తి కోసం తానే రేఖను చంపినట్టు ఒప్పుకొన్నాడు. ఇంతకీ, రేఖది ఆత్మహత్య కాదు హత్యే అని రుద్ర ఎలా కనిపెట్టగలిగాడు.