‘వీవర్స్ మిత్ర బ్యాక్ సపోర్ట్’ తయారు చేసి.. జాతీయ అవార్డు అందుకుని!
‘వీవర్స్ మిత్ర బ్యాక్ సపోర్ట్' తయారు చేసి నేతన్న వెన్నుకు దన్నుగా నిలిచాడు. ఈ పరికరంతో ‘జాతీయ హ్యాండ్లూమ్ హ్యాకథాన్-2026’ అవార్డు అందుకున్నాడు వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వగ్గు శ్రీరామ్.
నేతన్న వెన్నుకు దన్నుగా..
ఉదయం నుంచి రాత్రి వరకు మగ్గం పనులు చేస్తూ తమ రెక్కలను ముక్కలు చేసుకుంటున్నారు నేతన్నలు. వెన్ను నొప్పులు, కాళ్ల నొప్పులతో నానా అవస్థలు పడుతుంటారు. ఆ నొప్పులకు ఉపశమనం కలిగించాలనుకున్నాడు ఈ పద్దెనిమిదేండ్ల యువకుడు. చేనేత కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడు తల్లిదండ్రుల ఇబ్బందులను చూసి చలించిపోయాడు. ‘వీవర్స్ మిత్ర బ్యాక్ సపోర్ట్’ తయారు చేసి నేతన్న వెన్నుకు దన్నుగా నిలిచాడు. ఈ పరికరంతో ‘జాతీయ హ్యాండ్లూమ్ హ్యాకథాన్-2026’ అవార్డు అందుకున్నాడు వనపర్తి జిల్లా అమరచింత గ్రామానికి చెందిన వగ్గు శ్రీరామ్. ఈ పరికరం తయారీ వెనుక కథాకమామీషు అతని మాటల్లోనే..
మాది చేనేత కుటుంబం కావడంతో నేతన్నల కష్టాలను చూస్తూ పెరిగాను. అమ్మానాన్నలిద్దరూ నేత పని చేస్తుంటారు. పొద్దంతా కష్టం చేసి రాత్రి కాళ్ల నొప్పులు, నడుము నొప్పితో బాధపడుతూ ఉండేవాళ్లు. అమ్మానాన్నలకు చిన్న సాయమైనా చేయాలని ఎప్పుడూ అనుకునేది. నా పాఠశాల చదువంతా మా ఊరు అమరచింత బడిలోనే సాగింది. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పడు ఇంక్విలాబ్ ఫౌండేషన్ వాళ్లు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా వివిధ పరిశోధనలపై అవగాహన కల్పించారు. అదే సమయంలో ఆ టీమ్‌లోని అఖిల మేడం ఫీడ్‌బ్యాక్ కోసం నాకు ఫోన్ చేసింది. నేను ‘నా దగ్గర ఓ ఐడియా ఉంద’ని చెప్పి దాన్ని ప్లాన్ గీసి పంపించాను. నేత నేసే సమయంలో మగ్గం పనిచేస్తున్నప్పుడు పాదాలు పీటలను తొక్కుతూనే ఉండాలి. దానివల్ల కాళ్ల నొప్పులు విపరీతంగా వస్తుంటాయి. అలా కాళ్లకు పని తప్పించేలా నేను ఓ యంత్రం ప్లాన్ గురించి చెప్పాను. వాళ్లకు నా ఆలోచన నచ్చడంతో ఫండింగ్‌కు సహాయం చేశారు. పద్మశ్రీ మల్లేశమన్న ఓ వారం రోజులపాటు కొత్త టెక్నిక్స్ నేర్పించారు.

Weavers Mitra Back Support
నిరాశ చెందకుండా
అలా రూపొందించిన పరికరాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు జీవితంలో మొదటిసారి విమానం ఎక్కాను. అసోంలో నిర్వహించిన ‘యంగ్ ఇన్నోవేటర్ చాలెంజ్’కు దేశవ్యాప్తంగా 100 మంది తమ పరిశోధనలతో పాల్గొన్నారు. అందులో తెలంగాణ నుంచి నలుగురం వెళ్లాం. మగ్గం నేసే సమయంలో నేను రూపొందించిన యంత్రాన్ని నేతన్నల కాళ్లకింద అమర్చుతారు. దానిమీద బరువు పడగానే అది పనిచేయడం ప్రారంభిస్తుంది. కాళ్లు కదిలించాల్సిన అవసరం లేకుండానే పని సాగుతుంది. ఐదు రోజులపాటు జరిగిన ఈ ప్రదర్శనలో దాని గురించి ఎంతో వివరించాను కానీ, ఏ బహుమతికీ నోచుకోలేదు. అయినా నిరాశ చెందలేదు. నేను బడికి సెలవులు ఉన్నప్పుడల్లా పత్తి తీయడానికి వెళ్లేవాణ్ని. పత్తి తీసేటప్పుడు దాని గొగ్గి దగ్గరున్న ముళ్లు చేతి చిగుళ్లకు గుచ్చుకోవడంతో రక్తం వచ్చేది. చిగుళ్లు దెబ్బతిని నొప్పి వస్తుండేది. అవి గుచ్చుకోకుండా ఉండేందుకు కాటన్ ఫ్లకింగ్ యంత్రం తయారు చేశాను. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నా. దీన్ని కూడా స్కూల్ ఇన్నోవేషన్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించాను. దీనికీ బహుమతి దక్కలేదు. ఫండింగ్ లేక అది మధ్యలోనే నిలిచిపోయింది.
నొప్పులను నివారించేందుకు
పదో తరగతి తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కళాశాలలో మూడేండ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశం దొరికింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడల్లా చుట్టుపక్కల గ్రామాల నేతన్నలను కలిసేవాణ్ని. వారి ఆనారోగ్య సమస్యలను తెలుసుకునేవాణ్ని. అలా సుమారు 100 మందికిపైగా కలిశాను. వాళ్ల సమస్యలను రికార్డులో నమోదు చేసుకున్నాను. ఇందులో చాలామంది నడుము నొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారే. వాళ్లకోసం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాను. ఆ ఆలోచనల ఫలితమే ‘వీవర్స్ మిత్ర బ్యాక్ సపోర్ట్’ యంత్రం. ఈ ఏడాది జాతీయ హ్యాండ్లూమ్ హ్యాకథాన్‌లో అవార్డు పొందింది. నేత నేసే సమయంలో నడుము వాల్చడానికి వీలుగా ఉంటుంది, వెన్ను నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది. నెల రోజులపాటు కష్టపడి దీన్ని తయారు చేశాను. ఈ ఏడాది జాతీయ హ్యాండ్లూమ్ హ్యాకథాన్-2026కు దరఖాస్తు చేసుకున్నాను. ఇందులో దేశవ్యాప్తంగా సుమారు 2500 మంది పాల్గొన్నారు. అందులో 100 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో నేను జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం విశేషం.

Vaggu Sriram
భవిష్యత్తులోనూ..
ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా అవార్డుతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందుకున్నాను. ఈ యంత్రాన్ని మా నాన్నకు ఇచ్చి వాడమని చెప్పాను. ఆయన ట్రయల్ వేసి చూసి ఎంతో ఉపశమనం కలిగిందని చెప్పారు. ప్రస్తుతం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇది వాడుకలోకి వస్తే నేతన్నలకు వెన్నుదన్నుగా నిలిచినవాణ్ని అవుతాను. బహుమతులు అందుకోలేపోయిన నా తొలి రెండు ఆవిష్కరణలను మరింత పక్కాగా రూపొందించాలని భావిస్తున్నాను. భవిష్యత్తులో నేతన్నల కోసం మరిన్ని ఆవిష్కరణలు చేయడమే నా లక్ష్యం.
– రాజు పిల్లనగోయిన

Vaggu Sriram-1
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

