ఈలోకానికి వెలుగును, వేడిమినీ విరామం లేకుండా పగలంతా అందించిన సూర్యుడు అలసినట్లున్నాడు. ఎర్రబడ్డ ముఖాన్ని తిప్పుకొని తిరుగు పయనమవుతున్నాడు. పక్షులన్నీ ఎంతో క్రమశిక్షణతో తమ గూళ్లకు చేరుతున్నాయి. దేహబడలికతో మంచమెక్కిన ఆకాశం ముసుగేసుకుంటున్నది. దారులన్నీ ఇంటిదారి పట్టాయి. నీటి తొట్టి దగ్గర నిలబడి ఉన్న కుక్కలు రొట్టెముక్క వాసనతో అలానే నిలబడి అటూ ఇటూ చూస్తున్నాయి. సోమ్లా కాళ్లూ చేతులు కడుక్కుంటున్నాడు. మట్టిలో పనిచేయటం వల్ల నల్లగా మారిన శరీరం అంతా ఎరుపు రంగులోకి మారుతున్నది.
“కాయ్ కరీచి? దసేక్ పీయర్ పానిలా..
ఆజ్ కామ్ వారుయేగో”..
(ఏం జేస్తున్నవ్? గిన్ని మంచినీళ్లు తేరాదు.. ఇవ్వాళ ఒంటినిండా పని పడ్డది) అంటూ పిలిచాడు లచ్చిమిని.
“మార్ హాత్ నకామ్ చేయ్! ఆటో భేల్రిచూ,
తూజ్ మాయిదాన్ లియా!”..
(పిండి కలుపుతున్నానయ్యా! నా చేతులతో ఇయ్యలేను గాని, లోపలికి పోయి నువ్వే తెచ్చుకో)
జొన్నపిండిలో వేడినీళ్లు పోసుకుంటూ పిసుకుతున్న పిండిపై చూపును తిప్పుకోకుండానే జవాబిచ్చింది లచ్చిమి. చేసేదేంలేక సోమ్లా లోనికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని, ఆ రేకుల షెడ్డు చివరగా ఉన్న బల్లపీటమీద కూలబడ్డాడు. నీళ్లు తాగాక కొద్దిగా పాణం నెమ్మదించింది. ఒకసారి లచ్చిమికేసి చూశాడు. నిశ్చలంగా ఉన్న లచ్చిమిని ఎప్పుడైనా చూశాడా? లేదు. ఎప్పుడూ ఏదో పనిలోనే ఆమె. పెండ్లయి ముప్పయి ఐదేండ్లు అయింది. నాతో వచ్చినప్పటి నుంచీ రెక్కలాడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడు చీర కడుతున్నది కానీ మొన్నమొన్నటి వరకూ కాళె తొడుక్కుని, ఫేటియా తొడుక్కుని, ఘూంఘాట్తో ముసుగేసుకునే ఉండేది. చూస్తూ చూస్తూ గతంలోని లచ్చిమి కళ్లలోకి వచ్చింది సోమ్లాకి.
ఆ అందమైన ముఖం. దిగులు కనపడని నవ్వు ముఖం. అద్దాలు పొదిగిన ఎర్రని రవికెపైన మెడలో వెండి కాసుల పేరు, పూసల గొలుసులు తళుక్కున మెరుస్తుండేవి. చెవులకు టోక్రీలు, ముక్కును మించిన ముక్కుపోగు, ఘూంఘాట్ ముసుగును చూస్తే రాజమందిరంలోని రాణిలా కనపడేది. ముంజేతి నుంచి దండల వరకు ఏనుగు దంతాలతో చేసిన గాజులు, కాళ్లకు కడియాలు, వడ్డాణం అన్నీ ధరించిన లచ్చిమి, మహాలచ్చిమిలాగే కనపడేది. వీటన్నిటికి కూడా అందాన్నిచ్చింది లచ్చిమి మనసే. నిజంగా ఎంత మంచి తోడును నాకిచ్చాడో ఆ భగవంతుడు. బయటికి అరుసుద్ది గానీ, కలిపిన పిండిలాంటి మెత్తని మనసు దాంది.
“కాయ్ పిల్దోక పానీ? హై కాయ్ దే క్రోచి”.. (ఏందీ తాగినవా నీళ్లు? గట్ల కదలకుండా చూస్తున్నవేంది?).. గట్టిగనే అదిలించింది. జ్ఞాపకాల్లోకి పోయిన సోమ్లా వర్తమానంలోకి వచ్చాడు.
“ఆ.. ఆ.. పీల్దో’!”..
(ఆ.. ఆ.. తాగిన) అంటూ బదులిచ్చాడు.
నిజంగా జ్ఞాపకాలు ఎంత మధురంగా ఉన్నాయో! ఒంటి అలుపును మాయంచేశాయి. ముప్ఫై ఐదేండ్ల క్రితంలోకి పోయిన సోమ్లా, ఆ అనుభూతిని వదులుకోలేక పోతున్నాడు. ముక్కెరపైకి చూపు పోయింది..
మిగతావేమీ వేసుకోకున్నా, ఆ ముక్కెర మాత్రం ముక్కును పెట్టుకునే ఉంటుంది లచ్చిమి. ఆ ముఖం మీద ఉన్నందుకే దానికి అందం పెరిగింది. ఎలా మెరిసిపోతుందో… దాని తెల్లని ముఖం కన్నా, దాని తెల్ల మనసే నా కండ్లకు కనిపిస్తది. అప్పుడప్పుడు గొడవపడినా, మళ్లీ మామూలుగానే మాట్లాడుకుంటాం. ఎన్నిసార్లు తిట్టుకున్నా ప్రేమ మాత్రం తగ్గనేలేదు. ప్రేమకు భేదాభిప్రాయానికి సంబంధమే ఉండదు.
ఇవన్నీ మనసులో అనుకుంటూ ఊహల్లోకి వెళ్లిన సోమ్లాకు సమయమే తెలవలేదు. లచ్చిమి పిండి పిసికి, రొట్టెలు చేయటమూ, పెనంపై కాల్వటం చేస్తూనే ఉంది.
“భూక్ లాగిరీకోనిక ది బాటీఘాల్లేన్కో ఉదే ఓ గిన్నె మా బాజీ హై!”..
(ఆకలేయటం లేదా! రెండు రొట్టెలు పెట్టుకొని తిను. అగో ఆ గిన్నెల తోటకూరుంది).. లచ్చిమి సోమ్లా ఆకలి గురించి మాట్లాడుతూ చెప్పింది.
“హా.. సరే!”..
(ఊ సరే!) అని సోమ్లా ఆలోచనలకు శుభం పలికి, ఆకలి లోకంలోకి వచ్చాడు. ప్లేటు తీసుకుని రొట్టెలు పెట్టుకుని తింటున్నాడు.
ఇల్లందు నుంచి కారేపల్లి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మండల కేంద్రమది. చుట్టుపక్కల అనేక తండాలుంటాయి. సోమ్లా, లచ్చిమిలది దగ్గరలో వున్న భాగ్యనగర్ తండా. కారేపల్లికొచ్చి చాన్నాళ్లయింది. సోమ్లా రోజు కూలీకి పోతాడు. లచ్చిమి సాయంత్రం రొట్టెలు చేసి అమ్ముతుంది. రొట్టెలు బాగుంటాయని చెప్పి చాలామంది అక్కడికొచ్చి తింటుంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కూలీలు బాగానే వస్తారు. వాళ్లిద్దరి ఆదాయంలోంచే కూడబెట్టి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. ఒక్కగానొక్క కొడుకును చదివించారు. బంధువుల అమ్మాయినే చూసి పెళ్లి కూడా చేశారు. కొడుకు సుందర్‌లాల్ బాగానే చదువుకున్నాడు. బ్యాంకు ఉద్యోగం వచ్చింది. హైద్రాబాద్‌లో కొడుకూ కోడలు ఉంటారు. ఏడాది క్రితమే కొడుక్కి పెళ్లి చేసి పంపారు. నెలకొకసారి కొడుకు అమ్మానాన్నల దగ్గరికొచ్చి ఒక రోజుండి, అమ్మ పెట్టే రొట్టెలు తిని వెళ్తాడు. వచ్చినప్పుడల్లా పట్నం రమ్మని అడుగుతూనే ఉంటాడు కొడుకు. లచ్చిమి, సోమ్లా.. ‘వస్తాం, వస్తాం!’ అని వాయిదా వేస్తూనే ఉన్నారు. మొదట్లో ఒకసారి పోయి వచ్చారు. మొత్తంగానే వచ్చేయమంటాడు గానీ, వీళ్లు దాని గురించి మాట్లాడనే లేదు.
“ఏమైంది తింటున్నవా?” రొట్టెలు కాలుస్తూనే అడిగింది లచ్చిమి.
“ఆ.. ఆ.. తింటున్న. సరే గానీ, సుందర్ ఎప్పుడొస్తనన్నడు. ఈ ఆదివారమేనా?” కొడుకు గుర్తుకొచ్చి ఆరా తీసిండు సోమ్లా.
కొడుకు అన్ని విషయాలూ తల్లికే చెబుతాడని తెలుసు. అందుకే లచ్చిమినడిగి తెలుసుకుంటున్నడు.
“అవును, వాడు వచ్చే ఆదివారం వస్తనన్నడు”.
“మరి కోడలు పిల్ల రాదా?”.
“ఏమో అడక్కపోయినవా!”.
“నేనెందుకు అడుగుత, నీతోనే అన్నీ చెప్తడు గదా! నువ్వే అడుగు!”.
“అడుగుతనే ఉన్న. ఎన్నిసార్లడిగినా ఏదో ఒకటి చెపుతుండు”.. అన్నది లచ్చిమి.
సాయంత్రం ఏడు గంటలు దాటింది. ఒక్కొక్కరు జొన్నరొట్టెలు తినడానికి వస్తూనే ఉన్నరు. కొందరు ఇంటికి పార్సిల్ తీసుకుపోతున్నరు. రాత్రి తొమ్మిదిన్నర దాకా నడుస్తూనే ఉంటుంది.
“నీ కోడలు గురించి చెప్తలేగని గా సారుకు రెండు రొట్టెలు కట్టియ్యి!”.. భర్తను పురమాయించింది.
రోజూ ఓ మూడు గంటలు చేతికింద పనిచేసే పనిపిల్ల రాకపోవటంతో కొద్దిగ ఒత్తిడి పెరిగింది లచ్చిమికి. పదింటికల్లా చేసిన రొట్టెలన్నీ అమ్ముడు పోయినయ్. ఇద్దరు కలిసి అన్నీ సర్దేశారు. కాళ్లూచేతులు, ముఖం కడుక్కొని, తనకోసం ఉంచుకున్న ఓ రొట్టె కంచంలో పెట్టుకుని, ఆకుకూర వేసుకుని సోమ్లా పడుకున్న మంచం దగ్గరకొచ్చి కూర్చున్నది లచ్చిమి. మనుషుల నడకలు తగ్గి, రోడ్ల మీద ప్రశాంతత ఆవరిస్తున్నది. ఆకాశం, ఆకలి తీరిన మనిషి, మంచంలో కూలబడ్డట్టు నిద్రకు ఉపక్రమిస్తున్నది. కానీ, గుండెలో ఎక్కడో అలజడిగా, మనాదిగా ఉంది లచ్చిమికి. కడుపులో ఉన్న ఆ రందిని సోమ్లాతో పంచుకోవాలనుకుంది.
“పడుకున్నవా?” అన్నది.
“లేదు.. చెప్పు. ఇందాక ఏదో చెప్పబోయినవ్!”.
“ఏం లేదు. తెల్సిన పిల్ల, కల్సిపోయినట్లు ఉంటదని బంధువుల ఇంట్ల పిల్లనే చేసుకుంటిమి”.
“అయితే ఇప్పుడేమైంది!”.
“వాడు చెప్పింది ఏమీ ఇనటం లేదటయ్యా! ఊరికే.. ‘అది కావాలి, ఇది కావాలి’ అని విసిగిస్తున్నదట”.
“ఇయ్యాల్రేపటి పిల్లలు గట్లనే ఉన్నరు. చిన్నగ చెప్పుకోవాలి. గదేం పెద్ద సమస్యనా!”.
“అది కాదయ్యా! రోజూ షాపింగ్‌లకు తిరుగుతదట. సంప్రదాయంగా డ్రెస్సులు, నగలు వేసుకోదట”.
“ఇప్పుడెవరు సంప్రదాయంగా ఉంటున్నరు! సదువుకున్నోళ్లాయే!”.
“చెప్పేది ఇననే ఇనవ్! మళ్ల కోడలెందుకు రాలేదని అడుగుతవ్”.
“ఆ.. చెప్పు”.
“ఏం జెప్పాలి! మనం తినే జొన్నరొట్టెలు, కూరలను కూడా.. ‘ఛీ! ఛీ!’ అని అసయ్యించుకుంటదట! నేనింట్లో మన ఆచారం ప్రకారం ఉంటనని, మనం ప్యాషన్‌గా ఉండమనీ రానంటుందట. అంతేకాదు, ఇంట్లో ఎప్పుడన్న మన భాష మాట్లాడితే, ఇంకోసారి మాట్లాడొద్దని కోప్పడుతున్నదట. ఫోన్ల నాతోటి మాట్లాడినా చిర చిరలాడుతున్నదట. మన తిండి, కట్టుబొట్టు, మాట, పండుగ, పబ్బం, మర్యాద అన్నిటికీ దూరంగా ఉండాలంటదట!”.
“నాగరికం మనుషులు కదా! అట్లనే ఉంటరు. మనవేమీ మంచిగనిపించవు. అంతా పైకే ఉంటున్నయ్ చూపులు. ఏం చేస్తం!”.. ఏం చెప్పాలో అర్థంకాక కోడలు తీరుపై వ్యాఖ్యానం చేశాడు సోమ్లా.
“పడాయి వేజా జెర్ పచ గోరేవున ఆప్‌ని వాతే కూడి వేజాకు (సదువుకోంగనే మన భాష, మనకు అసయ్యమేస్తదా!) చిన్నప్పటి నుంచి వాడికున్న తిండి అలవాట్లను మర్సిపోవాలా! ఈ ఊరూ, తండాల్లోంచే కదా మన బతుకు మొదలయ్యింది. పుట్టినూరును, అమ్మ మాట్లాడే బాసను వొదులుకోవాలనుకుంటరా! ఇదేం, బాగు పట్టం!” రొట్టె తినబుద్ధి కావటం లేదు లచ్చిమికి.
“పెండ్లయి యాడాదే ఆయే! ‘ఇంట్లోకి ఆ సామాను కావాలి. ఇది కావాలి. కారెప్పుడు కొంటరు!’ అని ఒకటే పోరట. దీంతో గొడవలు, తిట్టుకోవడం కూడా మొదలైందట. వాడు చెప్పిన కాన్నుంచి నాకొకటే బాధవుతున్నది” అంటూ నిట్టూరుస్తూ చెబుతున్నది లచ్చిమి.
“సరే ఇప్పుడవ్వన్నీ ఎందుకులే! తర్వాత మాట్లాడుదాం. నువ్వు ముందు రొట్టె తిను” భార్యను సముదాయించాడు సోమ్లా.
“ఈకాలం పిల్లలు జర షోకుగ, మంచిగ ఉండాలనుకుంటరు. మన కుటుంబంలోదే గదా! నేటి కాలపు పిల్లగాండ్ల కోరికలు అట్లనే ఉంటున్నయి. అందరితోని వాళ్లూ! ఏం జేస్తం. కాలం నాగరికత మారుతున్నది కదా! నువ్వు బాధపడితే ఏం లాభం. మనకు చాతనైంది చెప్పాలి. లేదంటే వొదిలేయాలి. వాళ్లే తెలుసుకుంటరు. పట్నంలో సెల్ఫోన్లలో, కళ్లు జిగేల్మనే సరుకులు, వస్తువులు, కొనకుంటే మనం మనుషులమే కామేమో అని భ్రమలు కలిగిస్తయి. వాళ్లు మాత్రం ఏం జేస్తరు. ఈ మార్కెట్ ప్రపంచం ఆడించే బొమ్మలు వాళ్లు!” అని సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు సోమ్లా.
లోపల ఆయనకూ బాధ ఉన్నా, భార్య బాధ పోగొట్టే ప్రయత్నంగా కొన్ని మాటలు చెప్పాడు.
“నా బాధే కాదు! వాడు కూడా బాధపడవట్టే. ‘మన తీజ్ పండుగొచ్చింది. పోదాం మనింటికి, తండాలో అందర్ని ఒకసారి కలిసొద్దాం’ అన్నాడట. ‘నువ్వుపోతే పో.. నేను రాను!’ అని మొండికేసిందట. పండగంటే నలుగురం కలిసి ఉండటమే కదా! గది కూడా తెల్వదా గీ సదువుకున్నోళ్లకు. ఎక్కడికి మనం ఎగబాకినా, కాళ్లు నేల మీదనే ఉండాలె. మరీ చిత్రం చేస్తున్నరు. మనుషుల్లేని నాగరికం ఏం నాగరికం!” అంటూ, ఆయన మాటల్ని తిప్పికొట్టింది లచ్చిమి.
కొంత ఆవేశం, ఆవేదన తగ్గినా, కోడలు చేస్తున్నది సరికాదనే వాదన మాత్రం పోలేదు ఆమెలో.
చిన్న రొట్టె ముక్కను బలవంతాన మింగి, నీళ్లు తాగింది లచ్చిమి. సోమ్లా ఇక ఏమీ మాట్లాడలేదు. ఇంటి ముందరి తలుపులు పెట్టి, సోమ్లా పక్కగా వచ్చి పడుకుంది లచ్చిమి. పడుకుంటూనే..
“ఎల్లుండి వాడు వస్తనన్నడు. మనల్ని కూడా రమ్మంటున్నడు” మెల్లిగా వినిపించింది సోమ్లాకు.
“ఎందుకిప్పుడు మనం అక్కడికి? సరే సరే! వాడొచ్చినంక ఆలోచిద్దాం. పడుకో!” అని మాటలకు ముగింపు చెప్పాడు సోమ్లా.అమ్మను కౌగిలించుకున్న కొడుకునూ, బిడ్డను అట్లనే గట్టిగ పట్టుకుని, చెమ్మగిల్లిన కళ్లతో, ప్రేమను కురిపిస్తున్న ఆ తల్లిని చూస్తూ సోమ్లా అలా అక్కడే ఆగిపోయి నిలుచున్నాడు. ఈ రోజు కొడుకు వస్తాడని పనికి ఎగనామం పెట్టాడు. తల్లి ఇల్లంతా సర్ది, పొద్దటినుంచీ కొడుకు కోసం ఎదురుచూస్తూనే ఉంది. కొడుకు రాగానే అమ్మకున్న ప్రేమేంటో ఎరుక పడుతున్నది.
“ఎట్లా ఉన్నావమ్మా.. ఆరోగ్యం బాగుందా?”.
“నాకేంది బిడ్డా.. బాగానే ఉన్న. నువ్వెట్లున్నవ్?”.
“బాగున్నానమ్మా!” అని బదులిచ్చి, నాన్న దగ్గరికెళ్లాడు సుందర్.
“ఎట్లా ఉన్నవు నాన్నా!” అని కౌగిలించుకున్నాడు.
“బాగున్నారా నాన్నా! మాకేమయింది. బాగున్నం! కోడలమ్మ బాగుందా?”.
“బాగుంది. మేమంతా బాగానే ఉన్నం”.
“లోపటికి రా! బ్యాగు ఆడపెట్టు, కాళ్లు చేతులు కడుక్కో.. ఎప్పుడు బయల్దేరినవో ఏమో! అన్నం పెడతా.. పా!” అంటూ సుందర్‌ను లోపలికి తీసుకెళ్లిపోయింది తల్లి.
కొడుకు భోజనం చేస్తుంటే, తల్లిదండ్రులిద్దరూ అక్కడే కూర్చొని క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుంటున్నరు. కొడుక్కి ఇష్టమైన కూరలు చేసింది లచ్చిమి. భోజనం పూర్తిచేసి చేతిని కడుక్కుని వచ్చి కుర్చీలో కూచున్నాడు సుందర్.
“కోడలిని తోలుకు రాకపోయినవ్ బిడ్డా! ఒక్కతి ఎట్ల ఉంటది” తల్లి ప్రశ్నించింది.
“వాళ్ల దోస్తులతోని ఈరోజు మీటింగ్ ఉందట. వాళ్లందరూ ఈరోజు కలుసుకుంటున్నారంట. అందుకే రాలేదమ్మా!” అని సమాధానం చెప్పాడు.
“సరే! ఇద్దరు బాగున్నారా!” చిన్నగా అడిగింది.
“ఆ బాగానే ఉన్నాం” బదులిచ్చాడు సుందర్.
“అది రావటం.. నేను రావటం కాదమ్మా! మీరే రావాలి. అసలు మీరిక్కడెందుకు ఉండటం. మా దగ్గరే ఉండండి. నేను సంపాదిస్తూనే ఉన్నాను కదా! మళ్లీ మీరు రొట్టెలు చేయాలా? ఏంటి నాన్నా.. నువ్వు ఇంకా కూలికెళ్లాలా? పడ్డ కష్టం చాలు. నేను చెప్తున్నట్లు మీరిద్దరూ నా దగ్గరికి వచ్చేయండి. ఎన్నిసార్లు చెప్పినా, మీరు వినట్లేదు. ఈ పనులన్నీ మానేసి వచ్చేయండి.
జీవితాన్ని హాయిగా గడపండి” సుందర్ క్లాస్
తీసుకుంటున్నాడు.
“ఈ మారుమూల ఊర్లో ఉంటే.. గబుక్కున వైద్యం కావాలంటే ఎట్ల? ఆరోగ్యం బాగాలేకపోతే ఎవరు చూస్తారు! ఇంకా మీరు పని చెయ్యాలా.. కూలికి పోవాలా..! రొట్టెలమ్మాలా..!” కొద్దిగా విసుగ్గానే, నిష్టూరంగానే సుందర్ ఇద్దరినీ నిలదీస్తున్నాడు.
తన వెంట రమ్మని అడుగుతున్నాడు. తల్లిదండ్రులు కష్టపడకూడదనే ప్రేమ సుందర్‌లో ఉంది. అయితే, భార్య మాటలూ కొంత ప్రభావితం చేయటమూ ఉంది.
నెల రోజులకొకసారి వచ్చిపోయే కొడుకుతో.. రాగానే ఈ గొడవెందుకని ఇద్దరూ మౌనంగానే ఉండిపోయారు. ఏమీ మాట్లాడటం లేదు. కొద్దిసేపు అయిన తర్వాత.
“ఈ హోటల్.. అన్నీ తీసేయండి! హైద్రాబాద్ వచ్చేయండి!” తిరిగి నొక్కి వక్కాణించాడు సుందర్.
“బిడ్డా! రొన్నెళ్ల క్రితం ఓసారి వచ్చినం పట్నానికి. గప్పుడు నాల్గు రోజులే ఉండలేకపోయినం. మొత్తం ఇక్కడంతా మూసేసి రమ్మంటే, అక్కడే ఉండమంటే ఎట్ల! మేం ఉండగలుగుతమా! నువ్వు చెప్తున్నది మా మీద ప్రేమతోనే.. కానీ…” చిన్నగా కొడుకుకు తమ నిస్సహాయతను వివరించింది లచ్చిమి.
“కానీ లేదు ఏమీ లేదు. ఈ పనులు మానేయండి. నేను చెప్పేది వినండి” మళ్లీ అదే చెప్పాడు సుందర్.
“ఏం చేయాలి మేమక్కడికి వచ్చి? ఊరికే కూసొని ఉండటం మావల్ల అయితదా? తినుడు పండుడు గంతేనా!” ఒక వాక్యం లచ్చిమికి జోడించాడు సోమ్లా.
“మీరీ పని చేయటం బాగాలేదు నాన్నా! అమ్మా ఇంకా గా జొన్నరొట్టెలు చేసి అమ్మడమేంది? ఈ పల్లెల్లో చాకిరి చేస్తూ ఉండటం వద్దు! నేను బ్యాంకు మేనేజర్‌ను. మీ కోడలు బీటెక్ ఇంజినీరు. మాకు నామోషీగా ఉంటుంది. వద్దని చెబుతున్నాగా..” అసలు విషయాలను మనసు కక్కేసింది. విసిగిపోయిన సుందర్ ఉన్నది ఉన్నట్లు చెప్పేశాడు.
ఒక్క రెండు నిమిషాలు మౌనం దాల్చింది ఆవరణం. లచ్చిమి భర్త వైపు చూసింది. ఏ రకమైన భావన లేనట్టే ముఖం పెట్టాడు సోమ్లా. ఇల్లూ, హోటలు, దర్వాజలోంచి బయటికి చూసింది చిన్నగా.. లచ్చిమి. తనని కప్పుకొన్న ఆవరణమది. తనని నింపుకొన్న తలం అది. కొడుకు వైపు చూసింది.
“నాయనా సుందర్.. మాకు పనిచేయటం కష్టం కాదురా! అది మా బతుకులో భాగం. ఎవరూ లేరని నువ్వనుకుంటావు కానీ, మాకు తోడున్నది గీ పనే. పనే మా జీవితం. పొద్దున్నే లేచి, మీ కడుపుల్లోకి ఏదో ఒకటి తయారుచేసి, వండి పెట్టాలని ఇన్నేండ్లూ మనసులో అనుకుంటూనే చేసిపెట్టాను. అందుకనే మీరు పెరిగిన్రు.. పెద్దగయిన్రు. మీ పని మీరు చేసుకుంటున్నరు. ఎక్కడోళ్లక్కడ ఎళ్లిపోయిన్రు. మాతోనే ఉన్నది మా రెక్కలేరా! ఇవి ఆడుతూనే ఉన్నయ్! పని మాకు కష్టంకాదు బిడ్డా! నువ్వు ఏడాది నుంచీ రమ్మంటున్నవ్. కానీ, మాకు కుదరదు. ప్రతి సాయంత్రం జొన్న పిండి పిసకందే చేతులు ఊరుకోవు. రొట్టెలు చేయన్నాడు చేతులు పడిపోయినట్లుంటది. అసలు చేతులే లేనట్లుంటది!”.. తల్లి తన అనుభవాన్ని అంతరంగాన్ని చెబుతుంటే సుందర్‌కు ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి ముఖాన్ని తీక్షణంగా చూశాడు. సోమ్లాకు కొద్దిగ కొత్త విషయాలే.. భలే మాట్లాడుతున్నదే లచ్చిమి అనుకుని ఆమెనే చూస్తున్నాడు. కొద్దిగా ఆగి మళ్లీ..
“జొన్నరొట్టె మన ఆహారం మాత్రమేకాదు, ఆచారం కూడా. రొట్టె చేయటం నామోషీ అయితే.. దాన్ని తినడమూ అంతే అవుతుంది. నాకెంత సంతోషంగా ఉంటది. నేను రోజూ చేసి పెడుతున్న రొట్టెల కోసం ఎంతోమంది ఎదురుచూస్తూ ఉంటరు. వాళ్ల ఆకలికి, నా పని కడుపు నింపుతదంటే ఆనందం నాకు. మీకు వండిపెట్టినపుడూ అదే తృప్తి పొందిన. డబ్బులిచ్చే కొనుక్కుంటారు. కానీ, రొట్టెలు బాగుంటయని వాళ్లు సంతోషపడటం చూస్తే నాకు ఆనందంగా ఉంటది. రొట్టె ఎక్కడైనా దొరుకుతుంది. కానీ, నువ్వు తినాలని పెట్టేవాళ్లు దొరకడం కష్టం. ఈ రెండు సంతృప్తులకు నేను అడ్డాగా నిలుస్తున్నాను.
ఈ రొట్టే, ఈ పనే నాకీ ఆరోగ్యాన్నిచ్చింది. పనికూడా ఒక అలవాటే బిడ్డా! అది మన తరతరాల సంప్రదాయం. ఇప్పుడు నేను పని మానితే.. నేను నేనుగా ఉండటమే కష్టమవుతది. పరిసరాల అనుకూలతలలోనే మనిషి బతుకుతడు. బతకడానికి తిండొకటుంటేనే సరిపోదు. ఇక్కడి నేల, మట్టి, మనిషి, నిప్పు, రాయి, మొగ్గ, చెట్టు, పుట్ట, పువ్వు పుట్రా, కుక్క, పిల్లి అన్నీ నా సుట్టాలుగానే అనిపిస్తది. కాళ్లురెక్కలాడినంత కాలం ఇక్కడే ఉంటం. మీ బతుకుదెరువు కోసం మీరు పోయిండ్లు. పోండి. కానీ, బతుకునిచ్చిన, మట్టినీ, మనిషినీ, బంధాన్ని సంప్రదాయపు అనుబంధాల్ని గౌరవించండి! మన ఇష్టమున్న తీరుగనే బతకాలి. కానీ, ఎవరినీ కష్టపెట్టవద్దు. బాసతోని, బతకటానికి నిజాయతీగా చేసే పనితోని మన విలువలు తగ్గిపోవురా.. చేయకూడని పనులు చేస్తేనే సిగ్గుపడాలి!”..
రోజూ రొట్టెలు తినేవాళ్లతో మాట్లాడీ మాట్లాడీ లచ్చిమి లోకజ్ఞానం బాగానే సంపాదించింది.
తల్లి చెబుతుంటే నిర్ఘాంతపోయి వింటున్నాడు సుందర్. యూనివర్సిటీలో ప్రొఫెసర్ పాఠం చెబుతున్నట్లు అనిపించింది. నిజంగా అమ్మ నాన్నల ప్రాణం ఎక్కడ ఉందో అర్థమైంది సుందర్‌కు. కుర్చీలోంచి లేచి.. కళ్లలో నీళ్లు తిరుగుతున్న అమ్మ చేతులు పట్టుకున్నాడు.
“నన్ను క్షమించమ్మా! మీరిక్కడే ఉండండి! నేను బలవంతం చేయను. మీకే ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి. సరేనా!” అని లేచాడు.
‘ఈ రకంగా నా భార్యకు నేనెందుకు చెప్పలేకపోయాను. వివరించలేకపోయాను’.. అని మనసులోనే అనుకున్నాడు సుందర్. లచ్చిమి ఏం చెప్పిందో అది నిజం. తనూ లచ్చిమితోడే.. సోమ్లా కూడా మనసులోనే లచ్చిమిని కౌగిలించుకున్నాడు. లచ్చిమి పెద్దగా సదువుకోలే. మనుషుల మధ్య సంబంధాలలో తనను తానుగా రూపుదిద్దుకుంది. నాగరికతలోని విషయాలు, సౌకర్యాలు, సమస్యలూ ఆమెకు తెలవకపోవచ్చు. కానీ బతుకు సారమేంటో, ఎలా బతకాలో, బతుకులోని విలువేంటో తెలుసు. తరతరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయాలు అనివార్యంగా మారిపోతాయి. కొన్ని అనవసరం అయిన వాటిని వదిలించుకోవాలి కూడా. కానీ ఏవయితే మనిషిని మనిషిగా నిలబెడ్తవో, మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతవో వాటిని కొనసాగించాలి. లచ్చిమి అందుకు నిలువెత్తు నిదర్శనం.
-కటుకోజ్వల ఆనందా చారి,99487 87660