‘భేష్.. వీరాధివీరా! పురాణాలపై నీ బుద్ధి కుశలత అద్భుతం
‘వరం పొందిన వాడే, వరమిచ్చిన వాడి ఇల్లాలిని అదే వరంతో ముక్కలు చేశాడు. ఎలా?’ అంటూ దైవవాణి అడిగిన ప్రశ్నకు స్పందించిన రుద్ర..‘వరం పొందిన వాడు అంటే ఆ శ్రీ మహావిష్ణువు.. తనకు వరమిచ్చిన వాడు అంటే శివుడు. అతని ఇల్లాలిని అంటే పార్వతి (సతీదేవి)ని అదే వరం అంటే సుదర్శనచక్రంతో ముక్కలు చేశాడు’ అంటూ రుద్ర సమాధానం చెప్పాడు.
పాంచజన్యం, ది మిస్టరీస్ ఆఫ్ ద్వారక-12
జవాబు సరైనదే అన్న దైవవాణి ఎలాగో వివరించాలనడంతో రుద్ర ఇలా ప్రారంభించాడు. ‘దక్షయజ్ఞం సమయంలో పుట్టింట్లో అవమానాలకు గురైన పార్వతిదేవి (సతీదేవి) ఆ అవమానాన్ని భరించలేక తండ్రి దక్షుడు ముందే యోగాగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకొంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు సతీ వియోగదుఃఖం భరించలేక ఆమె మృత శరీరాన్ని భుజాన వేసుకొని రుద్రతాండవం చేస్తాడు. ఈ క్రమంలో తన జగద్రక్షణ కార్యాన్ని కూడా మానేస్తాడు. దీంతో ముల్లోకాలు అల్లకల్లోలంగా మారుతాయి. ఆ పరమేశ్వరుడిని మునుపటి స్థితిలోకి తీసుకురావాలంటూ దేవతలందరూ ఆ శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తారు. మన్నించిన విష్ణువు పరమశివుడు ప్రసాదించిన ఆ సుదర్శన చక్రంతోనే సతీదేవి మృతదేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తాడు. సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అందుకే, వరం పొందిన వాడే (మహావిష్ణువు), వరమిచ్చిన వాడి (శివుడి) ఇల్లాలిని (సతీదేవి) అదే వరంతో (సుదర్శన చక్రం) ముక్కలు చేశాడని చెప్పా’ అంటూ రుద్ర ముగించాడు.
రుద్ర సమాధానంతో సంతృప్తిచెందిన దైవవాణి.. ‘భేష్.. వీరాధివీరా! పురాణాలపై నీ బుద్ధి కుశలత అద్భుతం. సరైన సమాధానాన్ని చెప్పి సుదర్శన చక్రం ద్వారా సంప్రాప్తించే భూకవచాన్ని వశం చేసుకొన్నావు. ఇక, మిగిలింది.. పాంచజన్యం. దీన్ని సునాయాసంగా నీకు దక్కేలా చేస్తాను. అంతకు ముందు.. పాంచజన్యం కథ చెప్తాను జాగ్రత్తగా విను’ అంటూ దైవవాణి ఇలా చెప్పడం ప్రారంభించింది. ‘బలరామకృష్ణులు తమ బాల్యంలో సాందీప మహాముని వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో ఒకసారి సాందీప ముని కుమారుడు సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోగా ‘పంచజనుడు’ అనే రాక్షసుడు ఆ బాలుడిని మింగేశాడు. ఆ రాక్షసుడి శరీరంలో ఉన్న శంఖంలోకి ముని కుమారుడు ప్రవేశించాడు. విద్యాభ్యాసం ముగించుకున్న బలరామకృష్ణులు గురుదక్షిణగా ఏం కావాలో చెప్పాలని సాందీపుడిని ప్రార్థించారు. దీంతో తన కుమారుడిని ఇవ్వమని ఆ ముని కోరాడు. అప్పుడు సముద్ర తీరానికి వెళ్లిన కృష్ణుడు గురుపుత్రుడు ఏడని సముద్రుడిని ప్రశ్నించాడు. అసలు విషయం చెప్పిన సముద్రుడు.. తన గర్భంలోకి దారిచూపాడు. పంచజనుడిని సంహరించి శరీరాన్ని చీల్చిన కృష్ణుడికి గురుపుత్రునికి బదులు శంఖం దొరికుతుంది. ఆ శంఖాన్ని కృష్ణుడు యమపురిలో పూరించాడు. అంతే, అక్కడున్నవారంతా ఆ ధ్వనికి హడలిపోయారు. పరిగెత్తుకొని వచ్చిన యముడు.. కృష్ణుడు వచ్చిన కారణాన్ని ఆరాతీసి సాందీపుడి కుమారుడిని అప్పగించాడు. అలా అప్పటి నుంచి పంచజనుడి శరీరంలో దొరికిన శంఖాన్ని తన అలంకారంగా కృష్ణుడు ధరిస్తూ వచ్చాడు. అంతేకాదు, కృష్ణావతారం కంటే ముందే ఆ శ్రీమహావిష్ణువు పాంచజన్యాన్ని ధరించాడు. దానికీ ఓ కథ ఉంది. చెప్తా విను’ అంటూ దైవవాణి మళ్లీ కొనసాగించింది.
‘క్షీరసాగర మథనంలో అయిదు వర్గాలవారు పాల్గొన్నారు. రాక్షసులు, దేవతలు, నాగులు, గంధర్వులు, రుషులు. ఈ క్రమంలో మహాలక్ష్మితో పాటు శంఖం కూడా ఉద్భవించింది. వీళ్లిద్దరినీ సోదరీసోదరులని అంటారు. ఐదు వర్గాల వారి మథనంతో ఉద్భవించిన ఆ శంఖంను పాంచజన్యంగా పిలవడం ప్రారంభించారు. దీన్ని శ్రీమహా విష్ణువు ధరించాడు. ఈ శంఖం నుంచి వచ్చే ధ్వని ఎంతో శక్తిమంతమైనది, పవిత్రమైనది, మంగళకరమైనది. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడు మొదటగా ఈ పాంచజన్యాన్ని పూరించే యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఈ నాథమే విజయలక్ష్మి.. పాండవులను వరించేలా చేసింది. ఇప్పుడు ఈ పాంచజన్యమే.. మనిషి మేదస్సును దాటుకొని ఏవైనా జీవులు భూమ్మీదకు దాడులకు పాల్పడితే, వాటిని నియంత్రించే జ్ఞానమణిగా దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే, ఈ జ్ఞానమణి నీకు దక్కాలంటే, నేను అడిగే సునాయాసమైన ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆ ప్రశ్న ముగిసేలోపు ఇవ్వు’ అంటూ దైవవాణి ఆగిపోయింది. ప్రశ్న ముగిసేలోపు సమాధానమా? అదెలా సాధ్యం అంటూ రుద్ర టీమ్ మెంబర్స్ అంటూ షాక్లో ఉండగానే, దైవవాణి ప్రశ్న అడగడం ప్రారంభించింది. ‘ఈ అబ్బాయి తండ్రి నా తండ్రికి కుమారుడు. అయితే, ఈ అబ్బాయి నా కొడుకు కాదు. మరేమవుతాడు?’ అని దైవవాణి ప్రశ్న ముగియకముందే, రుద్ర సరైన సమాధానం చెప్పాడు. అదేంటో మీరు కనిపెట్టారా?
సమాధానం: మేనల్లుడు (ప్రశ్న అడుగుతున్నది స్త్రీమూర్తి)
– రాజశేఖర్ కడవేర్గు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

